13
1 నా కళ్లు ఇదంతా చూశాయి,
నా చెవులు విని గ్రహించాయి.
2 మీకు తెలిసింది నాకు కూడా తెలుసు.
మీకు నేనేమి తీసిపోను.
3 అయినా, సర్వశక్తిమంతుడైన దేవునితో మాట్లాడాలని
దేవునితోనే వాదించాలని కోరుతున్నాను.
4 అయితే మీరు అబద్ధాలను పుట్టిస్తారు.
మీరంతా ఎందుకు పనికిరాని వైద్యులు!
5 మీరందరు మౌనంగా ఉంటే మంచిది,
మీకు అదే జ్ఞానము.
6 ఇప్పుడు నా వాదన వినండి;
నా వాదనలు ఆలకించండి.
7 దేవుని పక్షంగా మీరు దుర్మార్గంగా మాట్లాడగలరా?
ఆయన కోసం వంచనగా మాట్లాడగలరా?
8 ఆయన పట్ల పక్షపాతం చూపిస్తారా?
దేవుని పక్షంగా మీరు వాదిస్తారా?
9 ఒకవేళ దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తే బాగుంటుందా?
ఒక మనిషిని మోసం చేసినట్టు మీరు ఆయనను మోసం చేయగలరా?
10 మీరు రహస్యంగా పక్షపాతం చూపిస్తే
ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని గద్దిస్తారు.
11 దేవుని వైభవం మిమ్మల్ని భయపెట్టదా?
ఆయన భయం మీ మీదికి రాదా?
12 మీ నీతిమాటలు బూడిదలాంటి సామెతలు,
మీ వాదనలు మట్టి వాదనలు.
13 మౌనంగా ఉండండి నన్ను మాట్లాడనివ్వండి;
అప్పుడు నా మీదికి ఏది రావాలో అది వస్తుంది.
14 నేనెందుకు ప్రమాదంలో పడాలి?
నా ప్రాణాన్ని ఎందుకు నా చేతుల్లో పెట్టుకోవాలి?
15 ఆయన నన్ను చంపినా సరే ఆయనలోనే నిరీక్షిస్తాను;
నా మార్గం గురించి నేరుగా ఆయనతో వాదిస్తాను.
16 ఇది నాకు విడుదలలా మారుతుంది,
ఎందుకంటే భక్తిహీనులు దేవుని ముందుకు రావడానికి తెగించలేరు!
17 నా మాటలను శ్రద్ధగా వినండి.
మీ చెవుల్లో నా మాటలు మారుమ్రోగాలి.
18 ఇప్పుడు నా వ్యాజ్యెం సిద్ధంగా ఉంది కాబట్టి,
నేను నిర్దోషినని రుజువవుతానని నాకు తెలుసు.
19 ఎవరైనా నాపై ఆరోపణలు చేయగలరా?
ఒకవేళ చేయగలిగితే, నేను మౌనంగా ఉండి చనిపోతాను.
20 దేవా! కేవలం రెండింటిని నాకు అనుగ్రహించండి,
అప్పుడు మీ నుండి నేను దాగను.
21 మీ చేతిని నా మీద నుండి తీసివేయండి,
మీ భయంతో నన్ను భయపెట్టకండి.
22 అప్పుడు నన్ను పిలిస్తే నేను జవాబిస్తాను.
నన్ను మాట్లాడనిచ్చి మీరు జవాబివ్వండి.
23 నేను ఎన్ని దోషాలను పాపాలను చేశాను?
నా అతిక్రమాన్ని నా పాపాన్ని నాకు చూపించండి.
24 ఎందుకు మీ ముఖాన్ని దాచుకుంటున్నారు?
ఎందుకు నన్ను శత్రువుగా భావిస్తున్నారు?
25 గాలికి ఎగిరే ఆకును మీరు వేధిస్తారా?
ఎండిన చెత్తను మీరు తరుముతారా?
26 మీరు నాకు కఠిన శిక్ష విధించారు
యవ్వనకాలంలో చేసిన పాపాల ప్రతిఫలం అనుభవించేలా చేశారు.
27 సంకెళ్ళతో నా కాళ్లు బిగించారు.
నా అరికాళ్ల చుట్టూ గీత గీసి,
నా ప్రవర్తనంతటిని జాగ్రత్తగా కనిపెడుతున్నారు.
28 మురిగి కుళ్ళిపోతున్న దానిలా, చిమ్మెటలు కొట్టిన వస్త్రంలా
మనిషి నాశనమవుతాడు.