18
బిల్దదు 
  1 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబిచ్చాడు:   
 2 “నీవు ఈ మాటలు మాట్లాడడం ఎప్పుడు మానేస్తావు?  
కొంచెం ఆలోచించు, అప్పుడు మేము మాట్లాడతాము.   
 3 నీ దృష్టికి మేము ఎందుకు పశువులుగా  
తెలివితక్కువ వారిగా కనబడుతున్నాము?   
 4 కోపంలో నిన్ను నీవే ముక్కలు చేసుకున్నవాడవు,  
నీకోసం భూమంతా విడిచిపెట్టబడాలా?  
నీకోసం కొండలు వాటి స్థానం తప్పాలా?   
 5 “దుర్మార్గుల దీపం ఆర్పివేయబడుతుంది;  
వారి అగ్నిజ్వాలలు మండవు.   
 6 వారి గుడారంలో వెలుగు చీకటిగా అవుతుంది;  
వారి దగ్గర ఉన్న దీపం ఆరిపోతుంది.   
 7 వారి బలమైన అడుగులు బలహీనపడతాయి;  
వారి సొంత ఆలోచనలే వారిని పడగొడతాయి.   
 8 వారి కాళ్లు వారిని వలలోనికి నడిపిస్తాయి;  
వారు వలలో పడతారు.   
 9 బోను వారి మడమను పట్టుకుంటుంది;  
ఉచ్చు వారిని గట్టిగా పట్టుకుంటుంది.   
 10 వారి కోసం నేల మీద ఉరి అమర్చబడింది;  
వారి దారిలో ఉచ్చు ఉంది.   
 11 భయాలు ప్రతి దిక్కునుండి వారిని ఆవరిస్తాయి,  
అడుగడుగునా వారిని వెంటాడతాయి.   
 12 విపత్తు వారి కోసం ఆకలితో ఉంది;  
వారు పడిపోతే ఆపద వారి కోసం సిద్ధంగా ఉంది.   
 13 అది వారి చర్మ భాగాలను తినివేస్తుంది;  
మరణం యొక్క మొదటి సంతానం వారి అవయవాలను మ్రింగివేస్తుంది.   
 14 వారి గుడారంలో ఉన్న భద్రత నుండి వారు పెరికివేయబడ్డారు.  
భయం కలిగించే రాజు దగ్గరకు కొనిపోబడతారు.   
 15 అగ్ని వారి గుడారంలో నివసిస్తుంది.*లేదా అతని దగ్గర ఉన్నది ఏది మిగలదు  
వారి నివాసం మీద మండే గంధకం చెదిరిపోతుంది.   
 16 క్రింద వారి వేర్లు ఎండిపోతాయి  
పైన వారి కొమ్మలు వాడిపోతాయి.   
 17 భూమి మీద వారి జ్ఞాపకం నశించిపోతుంది;  
నేలమీద వారి పేరే ఉండదు.   
 18 వెలుగులో నుండి చీకటిలోకి వారు నడిపించబడతారు  
లోకం నుండి వారు తరిమివేయబడతారు.   
 19 తమ ప్రజల్లో వారికి సంతానం గాని వారసులు గాని ఉండరు,  
ఒకప్పుడు వారు నివాసమున్న స్థలాల్లో బ్రతికి ఉన్నవారు ఎవరు లేరు.   
 20 వారి దుస్థితిని చూసిన పశ్చిమ ప్రజలు ఆందోళన చెందుతారు;  
తూర్పున ఉన్నవారు భయంతో నిండి ఉంటారు.   
 21 ఖచ్చితంగా దుర్మార్గుల నివాసం ఇలాగే ఉంటుంది;  
దేవుని ఎరుగనివారి స్థలం కూడా ఇలానే ఉంటుంది.”