33
1 “యోబూ, ఇప్పుడు నా మాటలు విను;
నేను చెప్పే ప్రతిదాన్ని ఆలకించు.
2 నేను నోరు తెరిచి మాట్లాడబోతున్నాను;
నా మాటలు నా నాలుక చివర ఉన్నాయి.
3 యథార్థమైన హృదయం నుండి నా మాటలు వస్తున్నాయి;
నాకు తెలిసిన దానిని నా పెదవులు నిష్కపటంగా పలుకుతాయి.
4 దేవుని ఆత్మ నన్ను సృష్టించింది;
సర్వశక్తిమంతుని ఊపిరి నాకు జీవమిచ్చింది.
5 నీకు చేతనైతే నాకు జవాబు చెప్పు;
నా ముందు నిలబడి నీ వాదన వినిపించు.
6 దేవుని దృష్టిలో నీవెంతో నేను అంతే;
నేను కూడా మట్టితో చేయబడ్డాను.
7 నా భయం నిన్ను భయపెట్టకూడదు,
నా చేయి నీ మీద భారంగా ఉండకూడదు.
8 “నేను వింటుండగా నీవు మాట్లాడావు
నీ మాటలు నేను విన్నాను.
9 అవేమిటంటే, ‘నేను పవిత్రుడను, ఏ తప్పు చేయలేదు;
నేను శుద్ధుడను పాపం లేనివాడను.
10 అయినా దేవుడు నాలో తప్పును కనుగొన్నారు;
నన్ను తన శత్రువుగా భావిస్తున్నారు.
11 నా కాళ్లకు సంకెళ్ళు బిగించాడు.
నా మార్గాలన్నిటిని దగ్గర నుండి గమనిస్తున్నాడు.’
12 “కాని ఈ విషయంలో నీవు తప్పు,
ఎందుకంటే దేవుడు మానవుల కంటే గొప్పవాడు.
13 ఒకని మాటలకు ఆయన స్పందించరని
ఎందుకు నీవు ఆయనకు ఫిర్యాదు చేస్తావు?
14 ఎందుకంటే దేవుడు ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడతారు,
అయితే ఎవరు దానిని గ్రహించలేరు.
15 ప్రజలు పడకపై పడుకుని,
గాఢనిద్రలో ఉన్నప్పుడు,
రాత్రి వచ్చే కలలో,
16-18 నరులను గర్విష్ఠులు కాకుండచేయాలని
వారు చేయదలచిన తప్పులను చేయకుండా వారిని ఆపడానికి,
గోతిలో పడకుండ వారిని కాపాడడానికి,
ఖడ్గం ద్వార వారి ప్రాణాలు పోకుండ వారిని తప్పించాలని*లేదా నది దాటుట నుండి
ఆయన వారి చెవుల్లో మాట్లాడవచ్చు
హెచ్చరికలతో వారిని భయపెట్టవచ్చు.
19 “లేదా ఒకరు ఎముకల్లో నిరంతరం బాధ కలిగి
నొప్పితో మంచం పట్టడం ద్వారా శిక్షించబడతారు.
20 అప్పుడు వారికి అన్నం సహించదు
వారికి ఇష్టమైన భోజనమైనా సరే అసహ్యంగా ఉంటుంది.
21 వారి మాంసం కృషించిపోయి,
ఇంతకుముందు కనిపించని ఎముకలు ఇప్పుడు బయటకు కనబడతాయి.
22 వారు సమాధికి దగ్గరవుతారు,
వారి ప్రాణాలు మరణ దూతలకు†లేదా మృతుల స్థలానికి దగ్గరవుతాయి.
23 అయినాసరే వారికి ఒక దేవదూత ఉంటే,
వేలాది దేవదూతల్లో ఒక దూతను,
మనుష్యులు యథార్థంగా ఎలా ఉండాలో చెప్పడానికి పంపితే,
24 ఆ దూతకు వారిపై దయ కలిగి దేవునితో,
‘వారిని సమాధిలోనికి దిగిపోకుండా కాపాడండి;
వారి కోసం క్రయధనం నాకు దొరికిందని చెప్తాడు.
25 అప్పుడు వారి దేహం చిన్నపిల్లల దేహంలా ఉంటుంది;
వారికి తమ యవ్వనకాలం తిరిగి వస్తుంది.’
26 అప్పుడు వారు దేవునికి ప్రార్థించి ఆయన దయను పొందవచ్చు,
వారు దేవుని ముఖం చూసి ఆనందంతో కేకలు వేస్తారు;
ఆయన వారి నీతిని వారికి తిరిగి ఇస్తారు.
27 వారు ఇతరుల దగ్గరకు వెళ్లి ఇలా చెప్తారు,
‘నేను పాపం చేశాను, సరియైన దానిని వంకరగా మార్చాను,
అయినా దానికి తగిన శిక్ష నాకు విధించబడలేదు.
28 సమాధికి వెళ్లకుండ దేవుడు నా ప్రాణాన్ని విమోచించారు.
జీవిత వెలుగును ఆస్వాదించడానికి నేను బ్రతుకుతాను.’
29-30 “జీవిత వెలుగు వారి మీద ప్రకాశించేలా
వారిని సమాధి నుండి తప్పించడానికి,
దేవుడు మానవుల కోసం వీటన్నిటిని
రెండు, మూడు సార్లైనా చేస్తారు.
31 “యోబూ, నా మాటలు విను; శ్రద్ధగా ఆలకించు,
మౌనంగా ఉండు, నేను మాట్లాడతాను.
32 నీవు చెప్పవలసినది ఏదైనా ఉంటే నాతో చెప్పు;
మాట్లాడు, నీ దోషమేమీ లేదని నేను నిరూపించదలిచాను.
33 కాని ఒకవేళ ఏమిలేకపోతే, నేను చెప్పేది విను;
మౌనంగా ఉండు, నేను నీకు జ్ఞానాన్ని బోధిస్తాను.”