39
 1 “కొండమీద తిరిగే అడవి మేకలు ఎప్పుడు ఈనుతాయో నీకు తెలుసా?  
లేళ్లు పిల్లలను కంటున్నప్పుడు నీవు చూశావా?   
 2 అవి ఎన్ని నెలల వరకు మోస్తాయో నీవు లెక్కపెడతావా?  
అవి పిల్లలను కనే సమయం నీకు తెలుసా?   
 3 అవి వంగి తమ పిల్లలకు జన్మనిస్తాయి;  
వాటి పురుటినొప్పులు అంతలోనే ఆగిపోతాయి.   
 4 వాటి పిల్లలు అడవిలో పెరిగి బలపడతాయి.  
అవి తల్లిని విడిచిపోయి మరలా తిరిగి రావు.   
 5 “అడవి గాడిదను స్వేచ్ఛగా వెళ్లనిచ్చేది ఎవరు?  
దాని కట్లను విప్పింది ఎవరు?   
 6 బంజరు భూమిని దానికి ఇల్లుగా  
ఉప్పు పర్రలను నివాస స్థలంగా ఇచ్చాను.   
 7 అది పట్టణంలోని సందడిని చూసి నవ్వుతుంది;  
తోలేవాని కేకలు అది వినదు.   
 8 దాని పచ్చిక కోసం అది పర్వతాల్లో తిరుగుతుంది,  
ఏదైన పచ్చని దాని కోసం వెదకుతుంది.   
 9 “నీకు సేవ చేయడానికి అడవి ఎద్దు అంగీకరిస్తుందా?  
రాత్రివేళ అది నీ పశువుల దొడ్డిలో ఉంటుందా?   
 10 నీవు అడవి ఎద్దుకు పగ్గం వేసి నాగటికి కట్టి నడిపించగలవా?  
నీ వెనుక నడుస్తూ అది లోయ భూములను దున్ని చదును చేస్తుందా?   
 11 దాని బలం గొప్పదని దాన్ని నమ్ముతావా?  
నీ పెద్ద పనిని దానికి అప్పగిస్తావా?   
 12 అది నీ ధాన్యాన్ని ఇంటికి మోసుకొనివచ్చి,  
అది నీ నూర్పిడి కళ్ళంలో కూర్చుతుందని నీవు నమ్మగలవా?   
 13 “నిప్పుకోడి రెక్కలు సంతోషంతో ఆడిస్తుంది,  
అయినా కొంగకున్న రెక్కలు ఈకలతో  
అవి పోల్చబడకపోయినా.   
 14 అది నేలమీద గుడ్లు పెడుతుంది  
ఇసుకలో వాటిని పొదుగుతుంది.   
 15 ఏ పాదమో వాటిని నలిపివేస్తుందని,  
ఏ అడవి జంతువో వాటిని త్రొక్కివేస్తుందని అది ఆలోచించదు.   
 16 తన పిల్లలు తనవి కానట్టు, వాటిని కఠినంగా చూస్తుంది;  
తన ప్రసవ వేదనంతా వృధా అయినా అది పట్టించుకోదు.   
 17 ఎందుకంటే దేవుడు దానికి జ్ఞానం ఇవ్వలేదు  
దానికి గ్రహింపు ఇవ్వలేదు.   
 18 అయినా పరుగెత్తడానికి అది తన రెక్కలను చాపినప్పుడు,  
అది గుర్రాన్ని దాని రౌతును చూసి నవ్వుతుంది.   
 19 “గుర్రానికి దాని బలాన్ని నీవిస్తావా?  
దాని మెడ మీద జూలు పెట్టింది నీవా?   
 20 దాని భీకరమైన గురకతో భయాన్ని సృష్టించే మిడతలా,  
మీరు దానిని దూకేలా చేస్తారా?   
 21 అది తన బలాన్నిబట్టి సంతోషిస్తూ, ఆగ్రహంతో నేలను దువ్వి,  
పోరాడటానికి పరుగెడుతుంది.   
 22 అది భయాన్ని చూసి నవ్వుతుంది, దేనికి భయపడదు;  
ఖడ్గాన్ని చూసినా వెనుతిరుగదు.   
 23 మెరుస్తున్న ఈటెలు బరిసెలతో పాటు  
దాని అంబులపొది గలగలలాడుతుంది,   
 24 పిచ్చి కోపంలో అది నేల మీద కాలు దువ్వుతుంది;  
బూరధ్వని విన్నప్పుడు అది ప్రశాంతంగా నిలబడలేదు.   
 25 బూర మ్రోగగానే అది, ‘ఆహా!’ అని అంటుంది  
దూరం నుండే యుద్ధవాసన,  
సేనాధిపతుల కేకలు యుద్ధఘోష పసిగడుతుంది.   
 26 “దక్షిణదిక్కు వైపుకు తన రెక్కలు చాపి ఎలా ఎగరాలో  
డేగకు నీ జ్ఞానంతో నేర్పించావా?   
 27 నీ ఆజ్ఞను బట్టే గ్రద్ద పైకెగిరిపోయి,  
తన గూడు ఎత్తైన చోటులో కట్టుకుంటుందా?   
 28 ఎవరు ఎక్కలేని కొండచరియలో నివసిస్తుంది రాత్రివేళ అక్కడే గడుపుతుంది;  
ఏటవాలుగా ఉన్న బండ దానికి బలమైన కోట.   
 29 అక్కడి నుండే ఆహారం కోసం చూస్తుంది;  
దాని కళ్లు దూరం నుండే దానిని కనిపెడతాయి.   
 30 దాని పిల్లలు రక్తాన్ని త్రాగుతాయి,  
మృతదేహాలు ఎక్కడ ఉంటాయో అక్కడే అది ఉంటుంది.”