3
దేశాలకు తీర్పు 
  1 “ఆ దినాల్లో ఆ కాలంలో,  
నేను యూదా, యెరూషలేము వారిని తిరిగి రప్పించినప్పుడు,   
 2 నేను దేశాలన్నిటిని సమకూర్చి,  
యెహోషాపాతు*యెహోషాపాతు అంటే యెహోవా తీర్పు తీర్చును; 12 వచనంలో కూడా లోయలోకి నడిపిస్తాను.  
నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులకు వారు చేసిన దానిని బట్టి,  
అక్కడ వారికి న్యాయ విచారణ జరిగిస్తాను,  
ఎందుకంటే వారు నా ప్రజలను దేశాల్లో చెదరగొట్టారు  
నా దేశాన్ని విభజించారు.   
 3 వారు నా ప్రజల కోసం చీట్లు వేసి  
అబ్బాయిలను ఇచ్చి వేశ్యలను తీసుకున్నారు.  
అమ్మాయిలను అమ్మి ద్రాక్షరసం కొన్నారు.   
 4 “తూరూ, సీదోనూ, ఫిలిష్తియా ప్రాంతాలందరూ, నా మీద మీకున్న వ్యతిరేకత ఏంటి? నేను చేసిన దానికి నాకు ప్రతీకారం చేస్తున్నారా? ఒకవేళ మీరు నాకు ప్రతీకారం చేస్తే, మీరు చేసిన దాన్ని త్వరలోనే, చాలా వేగంగా మీ తల మీదికి రప్పిస్తాను.   5 ఎందుకంటే మీరు నా వెండి బంగారాలను తీసుకెళ్లారు, నా శ్రేష్ఠమైన వస్తువులను మీ గుళ్ళకు†లేదా భవనాలకు తీసుకెళ్లారు.   6 యూదా, యెరూషలేము ప్రజలు తమ ప్రాంతానికి దూరం ఉండాలని వారిని గ్రీకులకు‡హెబ్రీలో యావాను ప్రజలకు అమ్మివేశారు.   
 7 “చూడండి, మీరు వారిని అమ్మి వేసిన స్థలాల నుండి వారిని రప్పిస్తాను. మీరు చేసిన దాన్ని మీ తల మీదికే రప్పిస్తాను.   8 నేను మీ కుమారులను, కుమార్తెలను యూదా ప్రజలకు అమ్ముతాను, వారు దూర దేశస్థులైన షెబాయీయులకు వారిని అమ్మివేస్తారు.” యెహోవా చెప్పింది ఇదే.   
 9 దేశాల మధ్య ఈ విషయం చాటించండి,  
యుద్ధానికి సిద్ధపడండి!  
వీరులను పురికొల్పండి,  
పోరాడేవారందరు సమకూడి వచ్చి దాడి చేయాలి.   
 10 మీ నాగటి నక్కులను సాగగొట్టి ఖడ్గాలు చేయండి,  
మడ్డికత్తులను సాగగొట్టి ఈటెలుగా చేయండి.  
“నేను బలవంతున్ని!”  
అని బలహీనులు అనుకోవాలి.   
 11 ప్రతి వైపు ఉన్న అన్ని దేశాల్లారా, త్వరగా రండి,  
అక్కడ సమకూడండి.  
యెహోవా, మీ వీరులను తీసుకురండి!   
 12 “దేశాలు లేవాలి;  
అవి యెహోషాపాతు లోయ వైపు వెళ్లాలి  
నలుదిశల ఉన్న అన్ని దేశాలకు  
తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను.   
 13 పంట పండింది కాబట్టి,  
కొడవలి తిప్పండి,  
ద్రాక్షగానుగ నిండింది  
తొట్లు పొర్లి పారుతున్నాయి కాబట్టి  
రండి, ద్రాక్షలను త్రొక్కండి,  
వారి దుష్టత్వం అధికంగా ఉంది!”   
 14 తీర్పు తీర్చే లోయలో ప్రజలు  
గుంపులు గుంపులుగా ఉన్నారు,  
ఎందుకంటే తీర్పు తీర్చే లోయలో  
యెహోవా దినం ఆసన్నమైంది.   
 15 సూర్యచంద్రులు చీకటిగా మారుతాయి,  
నక్షత్రాలు ఇక ప్రకాశించవు.   
 16 యెహోవా సీయోను నుండి గర్జిస్తారు,  
యెరూషలేములో నుండి ఉరుముతారు;  
భూమ్యాకాశాలు వణకుతాయి,  
అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయంగా ఉంటారు,  
ఇశ్రాయేలు ప్రజలకు దుర్గంగా ఉంటారు.   
దేవుని ప్రజలకు దీవెనలు 
  17 “అప్పుడు మీ దేవుడైన యెహోవానైన నేను  
నా పవిత్ర కొండయైన సీయోను మీద నివసిస్తానని మీరు తెలుసుకుంటారు.  
యెరూషలేము పరిశుద్ధంగా ఉంటుంది;  
ఇక ఎన్నడు ఇతర దేశాల సైన్యాలు దానిని ఆక్రమించరు.   
 18 “ఆ రోజు పర్వతాల నుండి క్రొత్త ద్రాక్షరసం ప్రవహిస్తుంది,  
కొండల నుండి పాలు ప్రవహిస్తాయి;  
యూదాలోని వాగులన్నిటిలో నీళ్లు పారతాయి.  
యెహోవా మందిరంలో నుండి ఒక ఊట ప్రవహిస్తూ,  
షిత్తీము లోయను తడుపుతుంది.   
 19 అయితే ఈజిప్టు పాడైపోతుంది,  
ఎదోము పాడైపోయిన ఎడారిగా అవుతుంది.  
ఎందుకంటే ఈ దేశాలు యూదా ప్రజలపై దౌర్జన్యం చేశాయి,  
వారి దేశంలో నిర్దోషుల రక్తం చిందించారు.   
 20 యూదాలో ప్రజలు నిత్యం నివసిస్తారు,  
యెరూషలేము తరతరాలకు నివాస స్థలంగా ఉంటుంది.   
 21 వారు చిందించిన నిర్దోషుల రక్తాన్ని బట్టి ప్రతీకారం  
తీసుకోకుండా వారిని వదిలేయాలా?  
నేను ప్రతీకారం చేస్తాను.”   
యెహోవా సీయోనులో నివసిస్తున్నారు!