3
యోనా నీనెవెకు వెళ్లుట
1 తర్వాత యెహోవా వాక్కు రెండవసారి యోనాకు వచ్చింది: 2 “నీవు మహా పట్టణమైన నీనెవెకు వెళ్లి నేను నీకు ఇచ్చే సందేశాన్ని ప్రకటించు.”
3 యోనా యెహోవా మాటకు లోబడి నీనెవెకు వెళ్లాడు; నీనెవె చాలా పెద్ద పట్టణం కాబట్టి దానిగుండా వెళ్లడానికి మూడు రోజుల పట్టింది. 4 యోనా ఆ పట్టణంలో ఒక రోజు ప్రయాణమంత దూరం వెళ్లి, “ఇంకా నలభై రోజులకు నీనెవె నాశనమవుతుంది” అని అంటూ ప్రకటించాడు. 5 నీనెవె ప్రజలు దేవున్ని నమ్మి ఉపవాసం ప్రకటించారు. గొప్పవారి నుండి సామాన్యుల వరకు అందరు గోనెపట్ట కట్టుకున్నారు.
6 యోనా హెచ్చరిక నీనెవె రాజుకు చేరినప్పుడు, అతడు తన సింహాసనం దిగి, తన రాజ వస్త్రాలను తీసివేసి, గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. 7 అతడు నీనెవెలో ఈ ప్రకటన చేశాడు:
“రాజు, అతని ఘనుల శాసనం ప్రకారం:
“మనుష్యులు గాని జంతువులు పశువులు గొర్రెల మందలు గాని దేన్ని రుచి చూడకూడదు తినకూడదు త్రాగకూడదు. 8 మనుష్యులు పశువులు గోనెపట్ట కప్పుకోవాలి. అందరు తక్షణమే దేవున్ని వేడుకోవాలి. తమ చెడు మార్గాలను, దౌర్జన్యాన్ని మానివేయాలి. 9 దేవుని మనస్సు మార్చుకుని కనికరంతో తన తీవ్రమైన కోపాన్ని విడిచిపెట్టి మనం నశించకుండా చేస్తారేమో ఎవరికి తెలుసు?”
10 వారు చేసింది, వారు ఎలా తమ చెడుతనాన్ని విడిచిపెట్టారో దేవుడు చూసి తన మనస్సు మార్చుకొని, ఆయన వారికి మీదికి రప్పిస్తానని చెప్పిన కీడును రానివ్వలేదు.