13
ఇంకా స్వాధీనం చేసుకోవలసిన భూమి 
  1 యెహోషువ ముసలివాడయ్యాక, యెహోవా అతనితో, “నీవు ముసలివాడవయ్యావు, ఇంకా చాలా ప్రాంతాలు స్వాధీనం చేసుకోవలసి ఉంది.   
 2 “ఇంకా మిగిలి ఉన్న ప్రాంతాలు:  
“ఫిలిష్తీయుల, గెషూరీయుల అన్ని ప్రాంతాలు,   3 కనానీయులవని పిలువబడిన ఈజిప్టు తూర్పున ఉన్న షీహోరు నది నుండి ఉత్తరాన ఎక్రోను భూభాగం వరకు, అయిదుగురు ఫిలిష్తీయ పాలకులకు సంబంధించిన గాజా, అష్డోదు, అష్కెలోను, గాతు, ఎక్రోను;  
ఆవీయుల భూభాగం,   4 దక్షిణాన;  
సీదోనీయుల ఆరా*కొ.ప్ర.లలో మియరా నుండి ఆఫెకు, అమోరీయుల సరిహద్దుల వరకు ఉన్న కనానీయుల దేశమంతా;   
 5 గెబాలీయుల ప్రాంతం;  
హెర్మోను పర్వతం క్రింద బయల్-గాదు నుండి లెబో హమాతు వరకు తూర్పున ఉన్న లెబానోను ప్రాంతమంతా.   
 6 “లెబానోను నుండి మిస్రెఫోత్-మయీము వరకు ఉన్న పర్వత ప్రాంతాల నివాసులందరిని అంటే, సీదోనీయులందరినీ ఇశ్రాయేలీయుల ముందు నుండి నేనే వారిని వెళ్లగొడతాను. నేను నీకు ఆజ్ఞాపించినట్లుగా ఈ భూమిని ఇశ్రాయేలుకు వారసత్వంగా ఇవ్వాలి,   7 దానిని తొమ్మిది గోత్రాలకు, మనష్షే అర్థగోత్రానికి వారసత్వంగా పంచి ఇవ్వాలి” అని చెప్పారు.   
యొర్దానుకు తూర్పున ఉన్న భూభాగం విభజన 
  8 మనష్షే గోత్రంలో మిగిలిన సగభాగం, రూబేనీయులు, గాదీయులు యొర్దాను తూర్పున యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చిన విధంగా యొర్దాను తూర్పున వారసత్వంగా పొందారు.   
 9 ఇది అర్నోను కొండగట్టు అంచున ఉన్న అరోయేరు నుండి, కొండగట్టు మధ్యలో ఉన్న పట్టణం నుండి, మెదెబా మొత్తం పీఠభూమితో సహా దీబోను వరకు విస్తరించి ఉంది,   10 హెష్బోనులో అమ్మోనీయుల సరిహద్దు వరకు పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోను పట్టణాలన్ని ఉన్నాయి.   
 11 అందులో గిలాదు, గెషూరు, మయకా ప్రజల భూభాగం, హెర్మోను పర్వతం మొత్తం, సలేకా వరకు ఉన్న బాషాను కూడా ఉన్నాయి,   12 అంటే, అష్తారోతు ఎద్రెయీలో పాలించిన బాషానులోని ఓగు రాజ్యం మొత్తము. (అతడు రెఫాయీయులలో చివరివాడు.) మోషే వారిని ఓడించి వారి భూమిని స్వాధీనం చేసుకున్నాడు.   13 కానీ ఇశ్రాయేలీయులు గెషూరు, మయకా ప్రజలను బయటకు వెళ్లగొట్టలేదు, కాబట్టి వారు ఇప్పటికీ ఇశ్రాయేలీయుల మధ్యనే నివసిస్తున్నారు.   
 14 కానీ లేవీ గోత్రానికి అతడు ఎలాంటి వారసత్వాన్ని ఇవ్వలేదు, ఎందుకంటే ఆయన వారికి వాగ్దానం చేసినట్లు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు అర్పించబడిన హోమబలులే వారి వారసత్వము.   
 15 రూబేను గోత్రం వారికి వారి వంశాల ప్రకారం మోషే వారికిచ్చింది:   
 16 అర్నోను నది లోయ ప్రక్కన ఉన్న అరోయేరు లోయ మొదలుకొని ఆ లోయలో ఉన్న పట్టణం నుండి మెదెబా దగ్గరి పూర్తి మైదానం,   17 ఇదీగాక హెష్బోను దాని మైదానంలోని పట్టణాలన్ని, దీబోను, బామోత్ బయలు బేత్-బయల్-మెయోను,   18 యహజు, కెదేమోతు, మెఫాతు,   19 కిర్యతాయిము, షిబ్మా లోయలో ఉన్న కొండ మీది శెరెత్ షహరు,   20 బేత్-పెయోరు, పిస్గా కొండచరియలు, బేత్-యెషిమోతు,   21 మైదానంలోని పట్టణాలన్ని, హెష్బోనులో పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోను రాజ్యం మొత్తం వారసత్వంగా ఇచ్చాడు. మోషే అతన్ని, ఆ దేశంలో నివసించిన సీహోనుతో జతకట్టిన మిద్యానీయుల ప్రధానులైన ఎవీ, రేకెము, సూరు, హూరు, రేబ అనే వారిని ఓడించాడు.   22 ఇశ్రాయేలీయులు యుద్ధంలో చంపినవారితో పాటు, బెయోరు కుమారుడైన భవిష్యవాణి చెప్పే బిలామును కత్తితో చంపారు.   
 23 రూబేనీయుల సరిహద్దు యొర్దాను నది తీరము. ఈ పట్టణాలు, వాటి గ్రామాలు రూబేనీయులకు వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఇవ్వబడ్డాయి.   
 24 గాదు గోత్రానికి దాని వంశాల ప్రకారం మోషే ఇచ్చింది ఇదే:   
 25 యాజెరు ప్రాంతం, గిలాదు పట్టణాలన్ని, అమ్మోనీయుల దేశంలో సగం అంటే రబ్బాకు సమీపంలో ఉన్న అరోయేరు వరకు;   26 హెష్బోను నుండి రామాత్ మిస్పే, బెతోనీము వరకు, మహనయీము నుండి దెబీరు ప్రాంతం వరకు;   27 లోయలో, బేత్-హారాము, బేత్-నిమ్రా, సుక్కోతు, సాఫోను, హెష్బోను రాజైన సీహోను యొక్క ప్రాంతం (యొర్దాను తూర్పు వైపు, కిన్నెరెతు సముద్రం†అంటే గలిలీ చివరి వరకు ఉన్న ప్రాంతం).   
 28 ఈ పట్టణాలు, వాటి గ్రామాలు గాదీయులకు వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఇవ్వబడ్డాయి.   
 29 మోషే మనష్షే యొక్క అర్థగోత్రానికి, అంటే మనష్షే వంశస్థుల సగం కుటుంబానికి, దాని వంశాల ప్రకారం ఇచ్చింది ఇదే:   
 30 వారి సరిహద్దు మహనయీము నుండి బాషాను రాజైన ఓగు రాజ్యం మొత్తం, అంటే బాషానులోని యాయీరు స్థిరనివాసాలైన అరవై పట్టణాలు,   31 గిలాదులో సగం, అష్తారోతు, ఎద్రెయీ (బాషానులోని ఓగు యొక్క రాజ పట్టణాలు).   
ఇవి మనష్షే కుమారుడైన మాకీరు వంశస్థులకు వారి వంశాల ప్రకారం మాకీరు కుమారులలో సగం మందికి ఇవ్వబడ్డాయి.  
 32 యెరికోకు తూర్పున యొర్దాను అవతల మోయాబు సమతల మైదానంలో ఉన్నప్పుడు మోషే ఇచ్చిన వారసత్వం ఇదే.   33 కానీ లేవీ గోత్రానికి, మోషే వారసత్వం ఇవ్వలేదు; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారికి వాగ్దానం చేసినట్లు ఆయనే వారి స్వాస్థ్యము.