18
మిగిలిన భూభాగం విభజన
ఇశ్రాయేలీయుల సమాజమంతా షిలోహులో సమావేశమై అక్కడ సమావేశ గుడారాన్ని ఏర్పాటు చేసింది. ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంది, కాని ఇంకా ఏడు ఇశ్రాయేలీయుల గోత్రాలకు వారి వారసత్వం కేటాయించబడలేదు.
కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: “మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశాన్ని స్వాధీనపరచుకోడానికి వెళ్లకుండా మీరు ఎంతకాలం వేచి ఉంటారు? ప్రతి గోత్రం నుండి ముగ్గురు వ్యక్తులను నియమించండి. ఒక్కొక్కరి వారసత్వం ప్రకారం భూమిని పరిశీలించి దాని వివరాలు వ్రాసి నా దగ్గరకు తీసుకురావడానికి నేను వారిని పంపుతాను. అప్పుడు వారు నా దగ్గరకు తిరిగి వస్తారు. మీరు భూమిని ఏడు భాగాలుగా విభజించాలి. యూదా వారు దక్షిణాన ఉన్న తన ప్రాంతంలోనూ, యోసేపు గోత్రాలు ఉత్తరాన ఉన్న తమ ప్రాంతాల్లోనూ ఉండాలి. మీరు భూమి యొక్క ఏడు భాగాల వివరాలు వ్రాసి వాటిని నా దగ్గరకు తీసుకురండి, నేను మన దేవుడైన యెహోవా సన్నిధిలో మీ కోసం చీట్లు వేస్తాను. అయితే లేవీయులు మీ మధ్య భాగాన్ని పొందరు, ఎందుకంటే యెహోవాకు యాజక సేవ చేయడమే వారి వారసత్వము. గాదు, రూబేను, మనష్షే అర్థగోత్రం ఇప్పటికే యొర్దాను తూర్పు వైపున వారి వారసత్వాన్ని పొందారు. యెహోవా సేవకుడైన మోషే దానిని వారికి ఇచ్చాడు.”
మనుష్యులు భూమిని పరిశీలించడానికి బయలుదేరేటప్పుడు యెహోషువ వారికి, “మీరు వెళ్లి భూమిని పరిశీలించి దాని వివరాలు వ్రాసి నా దగ్గరకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో యెహోవా సన్నిధిలో మీ కోసం చీట్లు వేస్తాను” అని చెప్పాడు. ఆ మనుష్యులు అక్కడినుండి బయలుదేరి దేశమంతా తిరిగి ఏడు భాగాలుగా పట్టణాలవారీగా దాని వివరాలను ఒక గ్రంథపుచుట్ట మీద వ్రాసి, షిలోహులోని శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చారు.
 
10 యెహోవా ఎదుట షిలోహులో యెహోషువ వారి కోసం చీట్లు వేసి, ఇశ్రాయేలు ప్రజలకు వారి గోత్రాల విభజనల ప్రకారం ఆ దేశాన్ని పంచిపెట్టాడు.
బెన్యామీనుకు ఇవ్వబడిన భాగం
11 బెన్యామీను గోత్రానికి వారి వంశాల ప్రకారం మొదటి చీటి వచ్చింది. వారికి కేటాయించబడిన భూభాగం యూదా, యోసేపు గోత్రాల మధ్య ఉంది.
12 ఉత్తరాన వారి సరిహద్దు యొర్దాను నది దగ్గర మొదలై యెరికోకు ఉత్తరంగా వెళ్లి పడమర వైపుకు కొండ సీమగుండా వెళ్లి, బేత్-ఆవెను అడవి వరకు ఉంది. 13 అక్కడినుండి అది లూజు అనే బేతేలుకు దక్షిణంగా సాగి క్రింది బేత్-హోరోనుకు దక్షిణంగా ఉన్న కొండ దగ్గర అతారోత్-అద్దారు వరకు వెళ్లింది.
14 అక్కడినుండి దక్షిణాన బేత్-హోరోనుకు ఎదురుగా ఉన్న కొండ నుండి పడమటి దిక్కున దక్షిణంగా సాగి యూదా వారి పట్టణమైన కిర్యత్-బయలు అనే కిర్యత్-యారీము దగ్గర అంతమయ్యింది. ఇది పడమటి సరిహద్దు.
15 దక్షిణ సరిహద్దు కిర్యత్-యారీము పొలిమేర నుండి మొదలై పడమటి వైపున నెఫ్తోవ నీళ్ల ఊట వరకు వెళ్లింది. 16 ఆ సరిహద్దు రెఫాయీము లోయకు ఉత్తరాన బెన్ హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న కొండ దిగువకు వెళ్లింది. ఇది హిన్నోము లోయ నుండి యెబూసీయుల పట్టణపు దక్షిణ వాలు వెంబడి ఎన్-రోగేలు వరకు కొనసాగింది. 17 అది ఉత్తరం వైపుకు తిరిగి, ఎన్-షెమెషుకు వెళ్లి, అదుమ్మీము కనుమకు ఎదురుగా ఉన్న గెలీలోతు వరకు కొనసాగింది. రూబేను కుమారుడైన బోహాను రాయి దగ్గరకు వెళ్లింది. 18 ఇది బేత్-అరాబా యొక్క ఉత్తర వాలు వరకు అరాబా క్రింది వరకు కొనసాగింది. 19 అది బేత్-హొగ్లా ఉత్తర వాలుకు వెళ్లి దక్షిణాన యొర్దాను ముఖద్వారం దగ్గర మృత సముద్రపు ఉత్తర అఖాతం దగ్గరకు వచ్చింది. ఇది దక్షిణ సరిహద్దు.
20 తూర్పు వైపున యొర్దాను సరిహద్దుగా ఉంది.
ఇవి బెన్యామీను వంశాల వారసత్వానికి అన్నివైపులా ఉన్న సరిహద్దులు.
 
21 వారి వారి వంశాల ప్రకారం బెన్యామీను గోత్రం వారి పట్టణాలివి:
యెరికో, బేత్-హొగ్లా, యెమెక్-కెసీసు, 22 బేత్-అరాబా, సెమరాయిము, బేతేలు 23 ఆవీము, పారా, ఒఫ్రా 24 కెఫార్-అమ్మోని, ఓఫ్ని, గెబా అనేవి పన్నెండు పట్టణాలు వాటి గ్రామాలు.
25 గిబియోను, రామా, బెయేరోతు, మిస్పే, 26 మిస్పే, కెఫీరా, మోసా, 27 రేకెము, ఇర్పెయేలు, తరలా, 28 సేలా ఎలెపు, యెబూసి పట్టణం (యెరూషలేము) గిబియా, కిర్యత్ అనేవి పద్నాలుగు పట్టణాలు వాటి గ్రామాలు,
వారి వారి వంశాల ప్రకారం ఇది బెన్యామీను గోత్రం వారికి వచ్చిన వారసత్వము.