20
ఆశ్రయ పట్టణాలు
అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా చెప్పారు: “నేను మోషే ద్వారా మీకు సూచించినట్లు ఆశ్రయ పట్టణాలను నియమించమని ఇశ్రాయేలీయులకు చెప్పు, తద్వార, ఎవరైనా ఒక వ్యక్తిని తెలియక పొరపాటున చంపితే అక్కడికి పారిపోయి ఆ హత్యకు చేసే ప్రతీకారం నుండి ఆశ్రయం పొందవచ్చు. వారు ఈ పట్టణాల్లో ఒక దానికి పారిపోయినప్పుడు, వారు నగర ద్వారం దగ్గర నిలబడి, ఆ పట్టణపు పెద్దల ముందు తమ వాదనను తెలియజేయాలి. అప్పుడు పెద్దలు పారిపోయినవారిని తమ పట్టణంలోకి చేర్చి, వారి మధ్య నివసించడానికి ఒక స్థలాన్ని ఇవ్వాలి. హత్యకు ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి వెంబడిస్తూ వస్తే ఆ పెద్దలు వానికి పారిపోయి వచ్చిన వ్యక్తిని అప్పగించకూడదు. ఎందుకంటే పారిపోయిన వ్యక్తి తన పొరుగువారిని అనుకోకుండ చంపాడు కాని పగతో కాదు. వారు సమాజం ముందు విచారణ జరిగే వరకు, ఆ సమయంలో సేవ చేస్తున్న ప్రధాన యాజకుడు చనిపోయే వరకు ఆ పట్టణంలోనే ఉండాలి. తర్వాత వారు తాము పారిపోయి వచ్చిన పట్టణంలోని తమ సొంత ఇంటికి తిరిగి వెళ్లవచ్చు.”
కాబట్టి వారు నఫ్తాలి కొండ సీమలోని గలిలయలో ఉన్న కెదెషును, ఎఫ్రాయిం కొండ సీమలోని షెకెమును, యూదా కొండ సీమలోని కిర్యత్-అర్బాను (అంటే హెబ్రోను) ప్రత్యేకపరిచారు. యొర్దానుకు తూర్పున (యెరికో నుండి అవతలి వైపు) వారు రూబేను గోత్రంలో పీఠభూమిలోని అరణ్యంలో బేసెరును, గాదు గోత్రంలో గిలాదులోని రామోతును, మనష్షే గోత్రంలో బాషానులోని గోలానును నిర్ణయించారు. ఇశ్రాయేలీయులలో ఎవరైనా లేదా వారిలో నివసించే విదేశీయులెవరైనా అనుకోకుండ ఎవరినైనా చంపితే వారు ఈ నిర్ణయించబడిన పట్టణాలకు పారిపోవచ్చు, సమాజం ముందు విచారణ జరిగే వరకు రక్తపు పగతో చంపబడరు.