5
1 యెహోవా, మాకు ఏమి జరిగిందో జ్ఞాపకముంచుకోండి;
మా వైపు తిరిగి, మాకు కలిగిన అవమానాన్ని చూడండి.
2 మా వారసత్వం అపరిచితులకు,
మా ఇళ్ళను విదేశీయులకు అప్పగించారు.
3 మేము తండ్రిలేని వారమయ్యాము,
మా తల్లులు విధవరాండ్రు.
4 మేము త్రాగే నీటిని మేము కొనుక్కోవలసి వస్తుంది;
మేము కట్టెలు ఎక్కువ వెలపెట్టి కొనుక్కోవలసి వస్తుంది.
5 మమ్మల్ని వెంటాడేవారు మా వెనుకే ఉన్నారు;
మేము అలసిపోయాము, కాని విశ్రాంతి దొరకడం లేదు.
6 తగినంత ఆహారం పొందేందుకు మేము ఈజిప్టు, అష్షూరు వారివైపు
మేము మా చేతులు చాపాము.
7 మా పూర్వికులు పాపం చేశారు, వారు చనిపోయారు,
వారి శిక్షను మేము భరిస్తున్నాము.
8 బానిసలు మమ్మల్ని పరిపాలిస్తున్నారు,
వారి చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించేవారు ఎవరూ లేరు.
9 ఎడారిలో ఖడ్గం కారణంగా,
ప్రాణాలను పణంగా పెట్టి ఆహారం తెచ్చుకుంటున్నాము.
10 ఆకలికి జ్వరంగా ఉండి,
మా చర్మం పొయ్యిలా వేడిగా అయ్యింది.
11 సీయోనులో స్త్రీలు,
యూదా పట్టణాల్లో కన్యలు హింసించబడ్డారు.
12 అధిపతుల చేతులు కట్టబడి, వ్రేలాడదీయబడ్డారు;
పెద్దలకు గౌరవం లేదు.
13 యువకులు తిరుగటిరాళ్ల దగ్గర కష్టపడుతున్నారు;
బాలురు కట్టెల బరువు మోయలేక తూలుతున్నారు.
14 పెద్దలు నగర ద్వారం నుండి వెళ్లిపోయారు,
యువకులు తమ సంగీతాన్ని ఆపివేశారు.
15 మా హృదయాల్లో నుండి ఆనందం వెళ్లిపోయింది,
మా నాట్యం దుఃఖంగా మారింది.
16 మా తల మీది నుండి కిరీటం పడిపోయింది,
పాపం చేశాము, మాకు శ్రమ.
17 మా హృదయాలు ధైర్యం కోల్పోయాయి,
వీటిని బట్టి మా కళ్లు క్షీణిస్తున్నాయి
18 సీయోను పర్వతం నిర్జనంగా పడి ఉంది,
నక్కలు దాని మీద విహరిస్తున్నాయి.
19 యెహోవా, ఎప్పటికీ పాలించండి;
మీ సింహాసనం తరతరాలుగా ఉంటుంది.
20 మీరు మమ్మల్ని ఎందుకు మరచిపోతారు?
ఇంతకాలం వరకు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టారు?
21 యెహోవా, మేము తిరిగి వచ్చేలా, మమ్మల్ని మీ దగ్గరకు రప్పించుకోండి;
మీరు మమ్మల్ని పూర్తిగా తిరస్కరించి,
22 మామీద చెప్పలేనంత కోపాన్ని పెంచుకుంటే తప్ప,
మా రోజులను పాత రోజుల్లా నూతనపర్చండి.