లేవీయకాండం
1
దహనబలి
యెహోవా మోషేను పిలిచి సమావేశ గుడారం నుండి అతనితో మాట్లాడారు. ఆయన అన్నారు, “ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘మీలో ఏ మనుష్యుడైనా యెహోవాకు అర్పణ తెచ్చినప్పుడు, మీ అర్పణగా పశువుల మంద నుండి గాని లేదా గొర్రెల మంద నుండి ఒక జంతువును తీసుకురావాలి.
“ ‘ఒకవేళ అర్పణ, మంద నుండి దహనబలి అయితే, మీరు లోపం లేని మగదానిని అర్పించాలి. అది యెహోవాకు అంగీకారంగా ఉండేలా మీరు దానిని సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర సమర్పించాలి. దహనబలి పశువు యొక్క తలపై మీరు చేయి ఉంచాలి, అప్పుడు అది మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి మీ తరపున అంగీకరించబడుతుంది. మీరు కోడెను యెహోవా ఎదుట వధించాలి, అప్పుడు యాజకులైన అహరోను కుమారులు దాని రక్తాన్ని తెచ్చి సమావేశ గుడారపు ద్వారం దగ్గర ఉన్న బలిపీఠం చుట్టూ చల్లుతారు. తర్వాత అతడు దహనబలి పశువు చర్మం తీసి, దానిని ముక్కలుగా చేయాలి. యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద నిప్పు పెట్టి ఆ నిప్పుమీద కట్టెలు పేర్చాలి. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు దాని తల, క్రొవ్వుతో పాటు, ముక్కలను బలిపీఠం మీద కాలుతున్న కట్టెల మీద పేర్చాలి. అతడు లోపలి అవయవాలను కాళ్లను నీటితో కడగాలి, యాజకుడు వాటన్నిటిని బలిపీఠం మీద కాల్చాలి. అది దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.
10 “ ‘ఒకవేళ అర్పణ మంద నుండి తెచ్చిన దహనబలి అర్పణ అయితే, గొర్రెల నుండి గాని లేదా మేకల నుండి గాని, మీరు లోపం లేని మగవాటినే అర్పించాలి. 11 మీరు దానిని బలిపీఠానికి ఉత్తర దిక్కున యెహోవా ఎదుట వధించాలి, యాజకులైన అహరోను కుమారులు దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూరా చల్లుతారు. 12 మీరు దానిని ముక్కలుగా చేయాలి, యాజకుడు దాని తల, క్రొవ్వుతో పాటు, వాటిని బలిపీఠం మీద కాలుతున్న కట్టెల మీద పేర్చాలి. 13 మీరు దాని లోపలి అవయవాలను కాళ్లను నీటితో కడగాలి, యాజకుడు వాటినన్నిటిని తెచ్చి బలిపీఠం మీద దహించాలి. అది దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.
14 “ ‘ఒకవేళ యెహోవాకు అర్పించే అర్పణ పక్షుల దహనబలి అయితే, మీరు పావురం లేదా గువ్వను అర్పించాలి. 15 యాజకుడు దానిని బలిపీఠం దగ్గరకు తెచ్చి, దాని తలను విరిచి బలిపీఠం మీద దానిని కాల్చాలి; దాని రక్తం బలిపీఠం ప్రక్కనే పిండాలి. 16 యాజకుడు ఆ పక్షి ప్రేగులను ఈకలను తీసివేసి అదంతా బలిపీఠానికి తూర్పుగా బూడిద ఉండే స్థలంలో పారవేయాలి. 17 పక్షిని పూర్తిగా విడదీయక, అతడు రెక్కల సందులో దానిని చీల్చాలి, అప్పుడు యాజకుడు బలిపీఠం మీద కాలుతున్న కట్టెల మీద దానిని కాల్చాలి. అది దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.