6
 1 యెహోవా మోషేతో ఇలా అన్నారు:   2-3 “ఒకవేళ మనుష్యులెవరైనా తన పొరుగువాడు తనకు అప్పగించిన దాని విషయంలో ఆ వ్యక్తిని మోసం చేసినా, వంచించినా, దోచుకున్నా, లేక ఒత్తిడిచేసినా, లేక పొరుగువాడు పోగొట్టుకున్న వస్తువు దొరికినా సరే దాని విషయం అబద్ధం చెప్పినా, ఒట్టు పెట్టి మరీ అబద్ధం చెప్పినా, ఇంకా ఇలాంటి వాటి విషయాల్లో పాపం చేస్తే అది యెహోవాకు వ్యతిరేకంగా ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించి చేసిన పాపమే అవుతుంది.   4 వారు వీటిలోని దేని విషయంలోనైనా పాపం చేసి తమ అపరాధాన్ని గ్రహిస్తే, వారు దొంగిలించిన లేదా దోపిడి ద్వారా తీసుకున్నా, లేదా వారికి అప్పగించబడినదైనా, లేదా పోయిన ఆస్తి తిరిగి దొరికినదైనా,   5 లేదా వారు అబద్ధ ప్రమాణం చేసినదైనా, వారు తప్పక పూర్తి నష్టపరిహారం చెల్లించాలి, దానికి దాని వెలలో అయిదవ వంతు కలిపి వారు తమ అపరాధపరిహారబలి సమర్పించే రోజున దానినంతటిని యజమానికి ఇవ్వాలి.   6 నిర్ణయించిన విలువ ప్రకారం వారు మందలో నుండి యెహోవాకు అపరాధపరిహారబలిగా ఒక లోపం లేని పొట్టేలును జరిమానాగా యాజకుని దగ్గరకు తీసుకురావాలి.   7 ఈ విధంగా యాజకుడు యెహోవా ఎదుట వారి కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు అపరాధులవడానికి కారణమైన కృత్యాల నుండి వారు క్షమించబడతారు.”   
దహనబలి 
  8 యెహోవా మోషేతో ఇలా అన్నారు:   9 “అహరోనుకు అతని కుమారులకు ఈ ఆజ్ఞ ఇవ్వు: ‘ఇది దహనబలికి సంబంధించిన నియమం: దహనబలి రాత్రి నుండి ఉదయం వరకు బలిపీఠం పొయ్యిపై ఉండాలి, బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి.   10 యాజకుడు తన నారబట్టలు నారలోదుస్తులు వేసుకుని, బలిపీఠం మీద అగ్నికి కాలిపోయిన దహనబలి అర్పణ బూడిదను తీసి బలిపీఠం ప్రక్కన ఉంచాలి.   11 తర్వాత అతడు ఈ బట్టలు విడిచి వేరే దుస్తులు ధరించి శిబిరం బయట ఆచార ప్రకారంగా శుభ్రంగా ఉన్న స్థలానికి ఆ బూడిద తీసుకెళ్లాలి.   12 బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి; అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయం యాజకుడు దాని మీద కట్టెలు పేర్చి, మంట మీద దహనబలి ఉంచి సమాధానబలుల క్రొవ్వును దహించాలి.   13 బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుతూ ఉండాలి; అది ఆరిపోకూడదు.   
భోజనార్పణ 
  14 “ ‘ఇవి భోజనార్పణకు సంబంధించిన నియమాలు: అహరోను కుమారులు యెహోవా ఎదుట బలిపీఠం ఎదురుగా దానిని అర్పించాలి.   15 యాజకుడు భోజనార్పణలో నుండి పిడికెడు నాణ్యమైన పిండిని కొంచెం ఒలీవ నూనెను సాంబ్రాణి మొత్తాన్ని తీసుకుని వాటిని జ్ఞాపక భాగంగా బలిపీఠం మీద యెహోవాకు ఇష్టమైన సువాసనగా దహించాలి.   16 అందులో మిగిలింది అహరోను అతని కుమారులు తినాలి, అయితే పరిశుద్ధాలయ ప్రాంతంలో పులియకుండా దానిని తినాలి; సమావేశ గుడారం యొక్క ఆవరణంలో వారు దానిని తినాలి.   17 దానిని పులిసిన దానితో కలిపి కాల్చకూడదు; నాకు సమర్పించిన హోమబలులలో నేను దానిని వారి వాటాగా ఇచ్చాను. పాపపరిహారబలిలా అపరాధపరిహారబలిలా, ఇది అతిపరిశుద్ధము.   18 అహరోను వంశస్థుడు ఎవరైనా దానిని తినవచ్చు. అన్ని తరాలకు ఇది యెహోవాకు సమర్పించబడే హోమబలులలో అతని శాశ్వత వాటా. వాటిని ఏది తాకినా అది పవిత్రమవుతుంది.*లేదా వాటిని తాకే వారెవరైనా పరిశుద్ధంగా ఉండాలి; 27 వచనంలో కూడా’ ”   
 19 యెహోవా మోషేకు ఇలా కూడా చెప్పారు,   20 “అహరోను అభిషేకించబడిన రోజున అతడు,†లేదా ఒక్కొక్కరు అతని కుమారులు యెహోవా దగ్గరకు తీసుకురావలసిన అర్పణ ఇది: భోజనార్పణగా ఒక ఓమెరు‡సుమారు 1.6 కి. గ్రా. లు నాణ్యమైన పిండి ఉదయం సగం, సాయంత్రం సగం అర్పించాలి.   21 దానిని పెనం మీద నూనెతో కాల్చాలి; బాగా కాల్చి ముక్కలుగా చేసిన భోజనార్పణను యెహోవాకు ఇష్టమైన సువాసనగా సమర్పించాలి.   22 ప్రధాన యాజకునిగా అతని తర్వాత వచ్చే కుమారుడు దానిని సిద్ధం చేయాలి. ఇది యెహోవాకు శాశ్వత వాటా, ఇది పూర్తిగా దహించబడాలి.   23 యాజకుడు అర్పించే ప్రతి భోజనార్పణను పూర్తిగా దహించబడాలి; దానిని తినకూడదు.”   
పాపపరిహారార్థ బలి 
  24 యెహోవా మోషేతో ఇలా అన్నారు,   25 “అహరోను, అతని కుమారులకు ఇలా చెప్పు: ‘పాపపరిహారబలికి సంబంధించిన నియమాలు ఇవే: దహనబలిని వధించే స్థలంలోనే పాపపరిహారబలి పశువులను కూడా యెహోవా ఎదుట వధించాలి. అది అతిపరిశుద్ధము.   26 పాపపరిహారం కోసం దానిని అర్పించే యాజకుడు దానిని తినాలి; పరిశుద్ధాలయ ప్రాంతంలో, సమావేశ గుడారం యొక్క ఆవరణంలో దానిని తినాలి.   27 బలి మాంసానికి తగిలే ప్రతిదీ పవిత్రమవుతుంది, దాని రక్తంలో కొంచెమైనా సరే వస్త్రం మీద పడితే ఆ వస్త్రాన్ని మీరు పరిశుద్ధాలయ ప్రాంతంలో ఉతకాలి.   28 ఆ మాంసం వండిన మట్టికుండను పగులగొట్టాలి. ఒకవేళ ఇత్తడి పాత్రలో వండితే, దానిని తోమి నీళ్లతో కడగాలి.   29 యాజకుడి కుటుంబంలో ప్రతి పురుషుడు దానిని తినాలి. అది అతిపరిశుద్ధము.   30 కాని పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయటానికి సమావేశ గుడారంలోకి తేబడిన రక్తం ఏ పాపపరిహారబలిదైనాసరే తినకూడదు; దానిని కాల్చివేయాలి.