24
యెహోవా ఎదుట ఒలీవనూనె, రొట్టె ఏర్పాటు 
  1 యెహోవా మోషేతో ఇలా అన్నారు,   2 “వెలుగు కోసం దీపాలు నిరంతరం వెలుగుతూ ఉండేలా దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవ నూనెను మీ దగ్గరకు తీసుకురావాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.   3 సమావేశ గుడారంలో నిబంధన మందసాన్ని కప్పి ఉంచే తెర బయట అహరోను సాయంత్రం నుండి ఉదయం వరకు నిత్యం యెహోవా ఎదుట దీపాలను వెలిగించాలి. ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.   4 యెహోవా ఎదుట మేలిమి బంగారు దీపస్తంభంపై ఉన్న దీపాలు ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి.   
 5 “నాణ్యమైన పిండి తీసుకుని ఒక్కొక్క రొట్టెకు రెండు ఓమెర్ల*అంటే సుమారు 3.2 కి. గ్రా. లు చొప్పున పన్నెండు రొట్టెలు చేయాలి.   6 యెహోవా ఎదుట మేలిమి బంగారు బల్లపై, వాటిని ఒక వరుసకు ఆరు చొప్పున రెండు వరుసల్లో అమర్చాలి.   7 రొట్టెను సూచించడానికి యెహోవాకు అర్పించే హోమబలిగా ఉండడానికి ప్రతి వరుస దగ్గర జ్ఞాపక భాగంగా కొంత స్వచ్ఛమైన ధూపం ఏర్పాటు చేయాలి.   8 నిత్య నిబంధనగా, ఇశ్రాయేలు పక్షాన ప్రతి సబ్బాతు దినాన యెహోవా ఎదుట ఆ రొట్టెలను బల్లపై పెడుతూ ఉండాలి.   9 అది అహరోను అతని కుమారులకు చెందినది, వారు దీనిని పరిశుద్ధాలయ ప్రాంతంలో తినాలి, ఎందుకంటే ఇది యెహోవాకు సమర్పించిన హోమబలులలో వారి శాశ్వత వాటాలో అతిపరిశుద్ధమైన భాగము.”   
దైవదూషకుడు చంపబడుట 
  10 ఒక రోజు ఇశ్రాయేలు తల్లికి ఈజిప్టు తండ్రికి పుట్టిన కుమారుడు ఇశ్రాయేలీయుల మధ్యకు వెళ్లాడు, అక్కడ శిబిరంలో అతనికి, ఒక ఇశ్రాయేలీయునికి మధ్య గొడవ జరిగింది.   11 ఇశ్రాయేలు స్త్రీ కుమారుడు యెహోవా నామాన్ని దూషిస్తూ శపించాడు; కాబట్టి వారు అతన్ని మోషే దగ్గరకు తీసుకువచ్చారు. (అతని తల్లి పేరు షెలోమీతు, దాను గోత్రానికి చెందిన దిబ్రీ కుమార్తె.)   12 యెహోవా చిత్తం వారికి తెలిసే వరకు వారు అతన్ని అదుపులో ఉంచారు.   
 13 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు,   14 “ఆ దైవదూషకున్ని శిబిరం బయటకు తీసుకెళ్లు. అతని మాటలు విన్న వారంతా అతని తలపై చేతులుంచగానే సమాజమంతా రాళ్లతో అతన్ని కొట్టి చంపాలి.   15 ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఎవరైనా తమ దేవున్ని శపిస్తే, తమ పాపశిక్షను భరించాలి;   16 యెహోవా నామాన్ని ఎవరైనా దూషిస్తే, వారు మరణశిక్షకు గురి అవుతారు. సమాజమంత వారిని రాళ్లతో కొట్టి చంపాలి. విదేశీయులైనా, స్వదేశీయులైనా, యెహోవా నామాన్ని దూషిస్తే, వారికి మరణశిక్ష విధించాలి.   
 17 “ ‘ఎవరైనా మనుష్యుని చంపితే వారికి మరణశిక్ష విధించాలి.   18 ఎవరైనా జంతువును చంపితే ప్రాణానికి బదులుగా ప్రాణమిచ్చి నష్టపరిహారం చెల్లించాలి.   19 పొరుగువారిని ఎవరైనా గాయపరిస్తే, వారిని కూడా అలాగే గాయపరచాలి:   20 ఎముక విరగ్గొడితే ఎముక విరగ్గొట్టాలి, కంటికి కన్ను, పంటికి పన్ను. గాయం చేసిన మనుష్యునికి గాయం చేయాలి.   21 ఎవరైనా జంతువును చంపితే నష్టపరిహారం చెల్లించాలి కాని ఎవరైనా మనిషిని చంపితే, వారికి మరణశిక్ష విధించాలి.   22 విదేశీయులకు స్వదేశీయులకు ఒకే చట్టం ఉండాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.’ ”   
 23 అప్పుడు మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడిన తర్వాత వారు దైవదూషకున్ని శిబిరం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేశారు.