23
వేషధారణకు వ్యతిరేకంగా హెచ్చరిక 
  1 అప్పుడు యేసు జనసమూహాలతో తన శిష్యులతో,   2 “ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు మోషే అధికార పీఠం మీద కూర్చున్నారు.   3 కాబట్టి వారు మీతో చెప్పేవాటన్నిటిని జాగ్రత్తగా అనుసరించండి. కాని వారు చేసే క్రియలను చేయకండి, ఎందుకంటే వారు బోధించే వాటిని పాటించరు.   4 వారు మోయలేనంత బరువులను కట్టి, మనుష్యుల భుజాల మీద పెడతారు, కాని తమ ఒక చేతి వ్రేలితో కూడా వాటిని కదిలించడానికి ఇష్టపడరు.   
 5 “వారు చేసే ప్రతిదీ మనుష్యులకు చూపించడానికే చేస్తారు: అనగా వారు తమ నొసటి మీద కట్టుకునే దేవుని వాక్యం కలిగిన రక్షకరేకులను వెడల్పుగాను వస్త్రాలకుండే కుచ్చులు పొడవుగాను చేసుకుంటారు.   6 వారు విందుల్లో గౌరవప్రదమైన స్థలాన్ని, సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాలను,   7 సంత వీధుల్లో గౌరవ వందనం పొందాలని ‘రబ్బీ’ అని పిలువబడానికి ఇష్టపడతారు.   
 8 “కానీ మీరు ‘రబ్బీ’ అని పిలిపించుకోవద్దు, ఎందుకంటే మీరందరు అన్నదమ్ములు, మీకు ఒక్కడే బోధకుడున్నాడు.   9 మీరు భూమి మీద ఎవరిని ‘తండ్రి’ అని పిలువద్దు ఎందుకంటే మీకు ఒక్కరే తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు.   10 మీరు ‘గురువులు’ అని పిలువబడవద్దు, మీకు ఒక్కడే గురువు, ఆయన క్రీస్తు.   11 మీలో గొప్పవాడు మీకు దాసునిగా ఉండాలి.   12 ఎందుకంటే తనను తాను హెచ్చించుకొనేవారు తగ్గించబడతారు, తనను తాను తగ్గించుకునేవారు హెచ్చింపబడతారు.   
పరిసయ్యులకు, ధర్మశాస్త్ర ఉపదేశకులకు కలిగే ఏడు శ్రమలు 
  13 “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా పరిసయ్యులారా మీకు శ్రమ! కాబట్టి మీకు మీరు పరలోకరాజ్యంలో ప్రవేశించే మనుష్యులను ప్రవేశించకుండా వారి ముఖం మీదనే తలుపు వేసేస్తున్నారు. మీరు దానిలో ప్రవేశించడంలేదు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వడంలేదు.   
 14 “వారు విధవరాండ్ర గృహాలను దోచుకుంటూ, ప్రజల ముందు చూపించుకోడానికి ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తారు. ఇలాంటివారు తీవ్రంగా శిక్షింపబడతారు.*కొన్ని ప్రతులలో మార్కు 12:40 అలాగే లూకా 20:47లో ఉన్న పదాలు ఇక్కడ చేర్చబడ్డాయి   
 15 “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా పరిసయ్యులారా మీకు శ్రమ! ఒక్కడిని మీ మతంలో కలుపుకోడానికి, మీరు సముద్రాన్ని భూమిని చుట్టి వస్తారు, వాడు మీ మతంలో కలిసిన తర్వాత, వానిని మీకంటే రెండంతలు ఎక్కువ నరకానికి పాత్రునిగా చేస్తారు.   
 16 “వివేచనలేని గ్రుడ్డి మార్గదర్శకులారా మీకు శ్రమ! మీరంటున్నారు, ‘ఒకడు దేవాలయం తోడు అని ఒట్టు పెట్టుకొంటే, అందులో ఏమి లేదు; కాని దేవాలయ బంగారం తోడు అని ఒట్టు పెట్టుకొంటే వాడు దానికి కట్టుబడి ఉండాలి’ అని.   17 గ్రుడ్డి మూర్ఖులారా! ఏది గొప్పది? బంగారమా, లేదా బంగారాన్ని పరిశుద్ధపరచే దేవాలయమా?   18 అలాగే, ‘ఒకడు బలిపీఠం తోడు అని ఒట్టు పెట్టుకొంటే, అందులో ఏమి లేదు, కాని బలిపీఠం మీది అర్పణ తోడని ఒట్టు పెట్టుకొంటే దానికి కట్టుబడి ఉండాలి’ అని మీరు చెప్తారు.   19 గ్రుడ్డివారా! ఏది గొప్పది? అర్పణా లేదా అర్పణను పవిత్రపరిచే బలిపీఠమా?   20 కాబట్టి, ఎవడైనను బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొంటే దాని మీద ఉన్న వాటన్నిటి తోడు అని ఒట్టు పెట్టుకొంటున్నాడు.   21 ఎవడైన దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొంటే అందులో నివసించే వాటన్నిటి తోడని ఒట్టు పెట్టుకొంటున్నాడు.   22 అలాగే పరలోకం తోడని ఒట్టు పెట్టుకొనే వాడు దేవుని సింహాసనం తోడని దాని మీద కూర్చున్న వాని తోడని ఒట్టు పెట్టుకొంటున్నాడు.   
 23 “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను పదవ భాగం ఇస్తున్నారు. కాని ధర్మశాస్త్రంలోని చాలా ముఖ్యమైన విషయాలు అనగా న్యాయం, కనికరం, విశ్వాసం వంటి వాటిని నిర్లక్ష్యం చేశారు. మీరు మొదటివాటిని నిర్లక్ష్యం చేయకుండ, వెనుకటివాటిని పాటించాల్సింది.   24 గ్రుడ్డి మార్గదర్శకులారా! మీరు చిన్న దోమను వడగడతారు కాని ఒంటెను మ్రింగుతారు.   
 25 “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు గిన్నెను, పాత్రను బయట శుభ్రం చేస్తారు, కాని లోపల అత్యాశతో, స్వీయ సంతృప్తితో నిండి ఉన్నారు.   26 గ్రుడ్డి పరిసయ్యుడా! మొదట గిన్నె, పాత్ర లోపల శుద్ధిచేయాలి అప్పుడు బయట కూడా శుద్ధిగా ఉంటుంది.   
 27 “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు సున్నం కొట్టిన సమాధుల్లా ఉన్నారు. అవి బయటకు అందంగా కనిపించినా లోపల మృతుల ఎముకలతోను అపవిత్రమైన దానితో నిండి ఉన్నాయి.   28 అలాగే మీరు బయట మనుష్యులకు నీతిమంతులుగా కనబడతారు కాని, లోపల వేషధారణ దుష్టత్వంతో నిండి ఉన్నారు.   
 29 “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు ప్రవక్తలకు సమాధులు కట్టిస్తున్నారు, నీతిమంతుల సమాధులను అలంకరిస్తున్నారు.   30 ఇంకా మీరు, ‘మేము మా పితరుల దినాల్లో ఉండి ఉంటే, ప్రవక్తల రక్తాన్ని చిందించడంలో వారితో పాలివారం కాదని’ చెప్పుకుంటారు.   31 ఈ విధంగా మీరు ప్రవక్తలను చంపిన మీరూ వారి సంతానమే అని మీకు మీరే సాక్ష్యం ఇస్తున్నారు.   32 కాబట్టి, ఇక మీ పితరులు ఆరంభించిన పనిని పూర్తి చేయండి.   
 33 “సర్పాల్లారా! సర్పసంతానమా! మీరు నరకానికి పోయే శిక్షను ఎలా తప్పించుకుంటారు?   34 అందుకే నేను మీ దగ్గరకు ప్రవక్తలను, జ్ఞానులను, బోధకులను పంపిస్తున్నాను. వారిలో కొందరిని మీరు చంపి సిలువ వేస్తారు; ఇంకొందరిని ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి తరిమి మీ సమాజమందిరాల్లో కొరడాలతో కొట్టిస్తారు.   35 నీతిమంతుడు హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠం దేవాలయానికి మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జెకర్యా రక్తం వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల నిరపరాధ రక్తదోషం అంతా మీ మీదికి వస్తుంది.   36 ఇవన్నీ ఈ తరం వారి మీదికే వస్తాయి అని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.   
 37 “యెరూషలేమా, యెరూషలేమా, నీవు ప్రవక్తలను చంపావు నీ దగ్గరకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టినదానా, ఒక కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను ఎలా చేర్చుకొంటుందో అలాగే నేను నీ పిల్లలను ఎన్నోసార్లు చేర్చుకోవాలని అనుకున్నాను కాని నీవు అంగీకరించలేదు.   38 చూడు, నీ ఇల్లు నిర్జనమైనదిగా నీకే విడిచిపెట్టబడుతుంది.   39 ‘ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!’†కీర్తన 118:26 అని మీరు చెప్పే వరకు నన్ను చూడరని మీతో చెప్తున్నాను” అన్నారు.