2
మానవ ప్రణాళికలు, దేవుని ప్రణాళికలు 
  1 తమ పడకల మీద పాపపు ఆలోచనలు చేసేవారికి,  
కీడును తలంచే వారికి శ్రమ!  
వారికి అధికారం ఉంది కాబట్టి,  
ఉదయకాల వెలుగులో వారు చెడు చేస్తారు.   
 2 వారు భూములను ఆశించి ఆక్రమించుకుంటారు,  
ఇళ్ళను ఆశించి తీసుకుంటారు.  
వారు ప్రజలను మోసం చేసి వారి ఇళ్ళను లాక్కుంటారు,  
ప్రజల నుండి వారి స్వాస్థ్యాన్ని దోచుకుంటారు.   
 3 కాబట్టి యెహోవా చెప్పే మాట ఇదే:  
“నేను ఈ వంశం మీదికి విపత్తు రప్పించబోతున్నాను,  
దాని నుండి మీరు మిమ్మల్ని కాపాడుకోలేరు.  
అది విపత్తు కాలం కాబట్టి  
మీరు ఇక ఎన్నడు గర్వంగా నడవలేరు.   
 4 ఆ రోజు ప్రజలు మీ గురించి ఒక సామెత చెప్తారు;  
మీ గురించి ఈ విషాద గీతం పాడుతూ ఎగతాళి చేస్తారు:  
‘మేము పూర్తిగా పాడైపోయాం;  
నా ప్రజల ఆస్తి విభజింపబడింది  
ఆయన దాన్ని నా నుండి తీసుకుంటారు!  
ఆయన మా భూములను దేశద్రోహులకు అప్పగించారు.’ ”   
 5 అందువల్ల చీట్లువేసి భూమిని కొలమానం ప్రకారం పంచడానికి  
యెహోవా సమాజంలో ఎవరూ ఉండరు.   
అబద్ధ ప్రవక్తలు 
  6 “ప్రవచించకండి” అని వారి ప్రవక్తలు అంటారు,  
“వీటి గురించి ప్రవచించకండి;  
మనకు అవమానం కలుగకూడదు.”   
 7 యాకోబు వారసులారా,  
“యెహోవా సహనం కోల్పోయారా?  
ఆయన ఇలాంటి పనులు చేస్తారా?” అని అనవచ్చా?  
“యథార్థంగా ప్రవర్తించే వారికి  
నా మాటలు క్షేమం కలిగించవా?   
 8 ఇటీవల నా ప్రజలే  
శత్రువుగా లేచారు.  
యుద్ధం నుండి తిరిగి వచ్చే మనుష్యుల్లా,  
నిర్భయంగా దారిన పోతూ ఉన్న వారి నుండి  
సంపన్న వస్త్రాన్ని మీరు లాగివేస్తారు.   
 9 నా ప్రజల స్త్రీలను  
వారికిష్టమైన గృహాలలో నుండి వెళ్లగొడతారు.  
వారి పిల్లల మీద ఎప్పటికీ  
నా ఆశీర్వాదం ఉండకుండా చేస్తున్నారు.   
 10 మీరు లేచి వెళ్లిపోండి!  
ఇది మీ విశ్రాంతి స్థలం కాదు,  
ఎందుకంటే అది అపవిత్రమైంది,  
అది పూర్తిగా నిర్మూలమైంది.   
 11 ఒకవేళ అబద్ధికుడు మోసగాడు వచ్చి,  
‘ద్రాక్షరసం గురించి, మద్యం గురించి నేను మీకు ప్రవచిస్తాను’  
అంటే, వాడే ఈ ప్రజలకు తగిన ప్రవక్త!   
విమోచన వాగ్దానం 
  12 “యాకోబూ, నేను ఖచ్చితంగా మీ అందరిని సమకూరుస్తాను;  
నేను ఖచ్చితంగా మిగిలిన ఇశ్రాయేలీయులను పోగుచేస్తాను.  
నేను వారిని గొర్రెల దొడ్డిలోని గొర్రెల్లా,  
పచ్చిక బయళ్లలోని మందలా సమకూరుస్తాను,  
ఈ స్థలం మనుష్యులతో కిటకిటలాడుతుంది.   
 13 అడ్డును పడగొట్టేవాడు వారికి ముందుగా వెళ్తాడు;  
వారు గుమ్మాన్ని పడగొట్టి, దానిగుండా బయటకు వెళ్తారు.  
వారి రాజు వారికి ముందుగా వెళ్తాడు,  
యెహోవా వారికి నాయకునిగా ఉంటారు.”