3
నీనెవెకు శ్రమ 
  1 అబద్ధాలతో దోపిడీతో నిండి ఉన్న,  
హంతకుల పట్టణానికి శ్రమ!  
నిత్యం బాధితులు ఉండే,  
రక్తపు పట్టణానికి శ్రమ!   
 2 కొరడాల ధ్వని, చక్రాల మోత,  
పరుగెడుతున్న గుర్రపు డెక్కల శబ్దం  
వేగంగా పరుగెడుతున్న  
రథాల ధ్వని వినబడుతుంది!   
 3 రౌతులు ముందుకు దూసుకువెళ్తుండగా,  
వారి ఖడ్గాలు మెరుస్తున్నాయి,  
వారి ఈటెలు తళతళ మెరుస్తున్నాయి!  
ఎంతో ప్రాణనష్టం జరుగుతుంది,  
మృతులు కుప్పలుగా పడి ఉన్నారు,  
మృతదేహాలకు లెక్క లేదు,  
మృతదేహాలు తగిలి ప్రజలు తడబడుతున్నారు.   
 4 తన మంత్రవిద్య ద్వారా ప్రజలను,  
తన వ్యభిచారం ద్వారా దేశాలను  
బానిసలుగా మార్చిన వేశ్య;  
మంత్రగత్తెల యజమానురాలు ఇదంతా చేసింది.   
 5 సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు,  
“నేను నీకు వ్యతిరేకిని,  
నేను నీ వస్త్రాలను నీ ముఖం మీదుగా ఎత్తి,  
దేశాలకు నీ నగ్నత్వాన్ని  
రాజ్యాలకు నీ అవమానాన్ని చూపిస్తాను.   
 6 నీ మీదికి హేయమైనది విసిరి,  
అందరి ముందు,  
నిన్ను అవమానిస్తాను.   
 7 నిన్ను చూసేవారందరూ నీ నుండి పారిపోయి,  
‘నీనెవె శిథిలావస్థలో ఉంది, ఆమె కోసం ఎవరు దుఃఖిస్తారు?’  
నిన్ను ఓదార్చేవారిని నేను ఎక్కడి నుండి తీసుకురాగలం?” అని అంటారు.   
 8 నైలు నది దగ్గర ఉండి,  
చుట్టూ నీళ్లు ఉన్న,  
తేబేసు కంటే మేలైనదానివా?  
ఆ నది ఆమెకు రక్షణ,  
ఆ నీళ్లు ఆమెకు గోడ.   
 9 కూషు,*అంటే, నైలు ఉపరితల ప్రాంతం ఈజిప్టు ఆమెకు అపరిమితమైన బలం;  
పూతు, లిబియా ఆమెకు మిత్రరాజ్యాలు.   
 10 అయినప్పటికీ ఆమెను  
బందీగా తీసుకెళ్లారు.  
ప్రతి వీధి మూలలో దాని పసిపిల్లల్ని  
ముక్కలు చేశారు.  
దాని అధిపతుల కోసం చీట్లు వేశారు,  
దాని ఘనులందరిని సంకెళ్ళతో బంధించారు.   
 11 నీకు కూడా మత్తు ఎక్కుతుంది;  
నీవు వెళ్లి దాక్కుని  
శత్రువు నుండి కాపాడుకోడానికి ఆశ్రయాన్ని వెదకుతావు.   
 12 నీ కోటలన్నీ మొదట పండిన పండ్లతో ఉన్న  
అంజూరపు చెట్లలా ఉన్నాయి;  
అవి కదిలించబడినప్పుడు,  
తినే వారి నోటిలో అంజూరపు పండ్లు పడతాయి.   
 13 నీ సైన్యాన్ని చూడు,  
వారంతా బలహీనులు.  
నీ దేశపు ద్వారాలు  
నీ శత్రువులకు విశాలంగా తెరిచి ఉన్నాయి;  
అగ్ని నీ ద్వారబంధాలను కాల్చివేసింది.   
 14 ముట్టడివేసే సమయానికి నీళ్లు తోడుకో,  
నీ కోటలను బలపరచుకో!  
బురదలోకి దిగు,  
ఇటుకలు తయారుచేయడానికి బురదను త్రొక్కు,  
ఇటుక బట్టీలను సిద్ధపరచు.   
 15 అక్కడ అగ్ని నిన్ను కాల్చివేస్తుంది;  
ఖడ్గం నిన్ను నరికివేస్తుంది,  
మిడతల గుంపులా అవి నిన్ను మ్రింగివేస్తాయి.  
గొంగళిపురుగుల్లా విస్తరించు,  
మిడతలంత విస్తారంగా నీ సంఖ్యను పెంచుకో!   
 16 ఆకాశంలోని నక్షత్రాల కంటే  
మీ వ్యాపారుల సంఖ్యను ఎక్కువగా ఉన్నప్పటికీ,  
మిడతల్లా వారు దేశాన్ని  
దోచుకుని ఎగిరిపోతారు.   
 17 మీ కావలివారు మిడతల్లా ఉన్నారు,  
మీ అధికారులు మిడతల గుంపులా ఉన్నారు.  
అవి చలికాలంలో గోడల మీద ఉండి  
ఎండ రాగానే ఎగిరిపోతాయి.  
అవి ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు.   
 18 అష్షూరు రాజా, మీ కాపరులు†అంటే, పాలకులు నిద్రపోతున్నారు;  
మీ అధిపతులు విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నారు.  
మీ ప్రజలు  
పర్వతాలమీద చెదరిపోయారు.   
 19 ఏదీ నిన్ను స్వస్థపరచలేదు;  
మీ గాయం ప్రాణాంతకమైనది.  
మీ గురించిన వార్త విన్నవారందరు  
మీ పతనాన్ని చూసి చప్పట్లు కొడతారు,  
ఎందుకంటే ప్రజలందరూ మీ అంతులేని క్రూరత్వాన్ని  
నీ క్రూరమైన హింసను అనుభవించిన వారే.