2
గోత్రాలవారిగా శిబిరాల ఏర్పాటు
1 యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు: 2 “ఇశ్రాయేలీయులు సమావేశ గుడారం చుట్టూ దానికి కొంత దూరంలో, వారిలో ప్రతి ఒక్కరు తమ తమ స్థలంలో తమ గోత్రపు జెండాలను పట్టుకుని శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలి.”
3 తూర్పున, సూర్యుడు ఉదయించే వైపు:
యూదా శిబిరానికి చెందిన దళాలవారు తమ జెండాల దగ్గర దిగాలి. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా ప్రజల నాయకుడు. 4 అతని దళంలో ఉన్నవారు 74,600.
5 వారి ప్రక్కన ఇశ్శాఖారు గోత్రం వారు దిగాలి. సూయరు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు ప్రజల నాయకుడు. 6 అతని దళంలో ఉన్నవారు 54,400.
7 వారి ప్రక్కన జెబూలూను గోత్రము. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూను ప్రజల నాయకుడు. 8 అతని విభజనలో ఉన్నవారు 57,400.
9 యూదా శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన పురుషులందరు, 1,86,400. వారు ముందుగా వెళ్తారు.
10 దక్షిణం వైపు:
రూబేను గోత్రం వారు వారి జెండా క్రింద ఉండాలి. షెదేయూరు కుమారుడైన ఎలీసూరు రూబేను ప్రజల నాయకుడు. 11 అతని దళంలో ఉన్నవారు 46,500.
12 వారి ప్రక్కన షిమ్యోను గోత్రం వారు దిగాలి. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను ప్రజల నాయకుడు. 13 అతని దళంలో ఉన్నవారు 59,300.
14 వారి ప్రక్కన గాదు గోత్రం వారు దిగాలి. రగూయేలు*కొ.ప్ర.లలో డెయుయేలు అని వాడబడింది కుమారుడైన ఎలీయాసాపు గాదు ప్రజల నాయకుడు. 15 అతని దళంలో ఉన్నవారు 45,650.
16 రూబేను శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన వారందరు, 1,51,450. వీళ్ళు రెండవ గుంపుగా వెళ్తారు.
17 తర్వాత సమావేశ గుడారం, శిబిరాల మధ్యలో లేవీయుల శిబిరం ఉంటుంది. వారు ఉన్న ఈ క్రమంలోనే, ప్రతి ఒక్కరూ తమ జెండా క్రింద తమ స్థలంలో ఉంటారు.
18 పడమర వైపు:
ఎఫ్రాయిం గోత్రం వారి జెండా ప్రకారం ఉండాలి. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిం ప్రజల నాయకుడు. 19 అతని దళంలో ఉన్నవారు 40,500.
20 మనష్షే గోత్రం వారు వారి ప్రక్కన దిగాలి. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే ప్రజల నాయకుడు 21 అతని దళంలో ఉన్నవారు 32,200.
22 వారి ప్రక్కన బెన్యామీను గోత్రం వారు దిగాలి. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను ప్రజల నాయకుడు. 23 అతని దళంలో ఉన్నవారు 35,400.
24 ఎఫ్రాయిం శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన వారందరు, 1,08,100. వీరు మూడవ గుంపుగా వెళ్తారు.
25 ఉత్తరం వైపున:
దాను గోత్రం వారు వారి జెండా దగ్గర ఉండాలి. అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు దాను ప్రజల నాయకుడు. 26 అతని దళంలో ఉన్న వారి సంఖ్య 62,700.
27 ఆషేరు గోత్రం వారు వారి ప్రక్కన దిగాలి. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు ప్రజల నాయకుడు. 28 అతని దళంలో ఉన్నవారు 41,500.
29 వారి ప్రక్కన నఫ్తాలి గోత్రం వారు దిగాలి. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి ప్రజల నాయకుడు. 30 అతని దళంలో ఉన్నవారు 53,400.
31 దాను శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన వారందరు, 1,57,600. వీళ్ళు తమ ధ్వజాల ప్రకారం చివరి గుంపుగా జెండాల క్రింద వెళ్తారు.
32 వారి వారి కుటుంబాల పరంగా లెక్కించబడినవారు ఇశ్రాయేలీయులు వీరు. విభజనల ప్రకారం శిబిరాలలో ఉన్న పురుషులు 6,03,550. 33 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులను ఇతర ఇశ్రాయేలీయులతో లెక్కించలేదు.
34 కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా ఇశ్రాయేలీయులు చేశారు; ఆ ప్రకారం వారు గుడారాలు వేసుకున్నారు, ఆ విధంగా వారి వారి వంశం, కుటుంబంతో ప్రయాణిస్తారు.