23
బిలాము యొక్క మొదటి సందేశము 
  1 బిలాము బాలాకుతో అన్నాడు, “నాకు ఇక్కడ ఏడు బలిపీఠాలు కట్టాలి, ఏడు కోడెలను, ఏడు పొట్టేళ్లను నా కోసం సిద్ధం చేయాలి.”   2 బాలాకు బిలాము చెప్పినట్లు చేశాడు, వారిద్దరు ఒక కోడెను, ఇద్దరు ఒక్కో బలిపీఠం మీద ఒక కోడెను, ఒక పొట్టేలును అర్పించారు.   
 3 అప్పుడు బిలాము బాలాకుతో, “నీవు నీ దహనబలి దగ్గర ఉండు. బహుశ యెహోవా నన్ను కలుసుకోడానికి రావొచ్చు. ఆయన నాకు ఏమి బయలుపరుస్తారో అది నీకు చెప్తాను” అని అన్నాడు. తర్వాత అతడు ఖాళీ కొండపైకి వెళ్లాడు.   
 4 దేవుడు అతన్ని కలుసుకున్నారు, బిలాము, “నేను ఏడు బలిపీఠాలు సిద్ధపరచి ఒక్కొక్క బలిపీఠం మీద ఒక కోడెను, ఒక పొట్టేలును అర్పించాను” అని అన్నాడు.   
 5 యెహోవా బిలాము నోటిలో ఒక సందేశం పెట్టి, “బాలాకు దగ్గరకు వెళ్లి ఈ మాటలు చెప్పు” అని అన్నారు.   
 6 కాబట్టి బిలాము తిరిగివెళ్లి రాజు, తన మోయాబు అధికారులతో దహనబలి దగ్గర నిలిచియుండడం చూశాడు.   7 అప్పుడు బిలాము తన సందేశాన్ని ఇచ్చాడు:  
“బాలాకు నన్ను అరాము నుండి తీసుకువచ్చాడు,  
మోయాబు రాజు తూర్పు పర్వతాల నుండి తెచ్చాడు.  
‘రా, నా కోసం యాకోబును శపించు’ అని అన్నాడు;  
‘రా, ఇశ్రాయేలును శపించు.’   
 8 దేవుడు శపించని వారిని  
నేనెలా శపించగలను?  
యెహోవా శపించని వారిని  
నేనెలా శపించగలను?   
 9 ఎత్తైన కొండ శిఖరాల నుండి నేను వారిని చూడగలను,  
ఎత్తైన స్థలాల నుండి నేను వారిని వీక్షించగలను.  
విడివిడిగా నివసించే ప్రజలను నేను చూస్తున్నాను  
తమను తాము దేశాల్లో ఒకటిగా పరిగణించని వారు.   
 10 యాకోబు ధూళిని ఎవరు లెక్కించగలరు?  
ఇశ్రాయేలు ప్రజల్లో కనీసం నాలుగవ వంతు ఎవరు లెక్కించగలరు?  
నేను యథార్థవంతుల మరణం పొందుదును గాక,  
నా అంతం వారి అంతంలా ఉండును గాక!”   
 11 బాలాకు బిలాముతో, “నీవు నాకు ఏమి చేశావు? నా శత్రువులను శపిస్తావని నిన్ను తీసుకువచ్చాను, కానీ నీవు వారిని ఆశీర్వదించడం తప్ప ఏమి చేయలేదు!”   
 12 బిలాము, “యెహోవా నా నోట పెట్టిన మాటను నేను మాట్లాడకూడదా?” అని అన్నాడు.   
బిలాము యొక్క రెండవ సందేశం 
  13 అప్పుడు బాలాకు అతనితో, “వారు కనిపించే మరో చోటికి నాతో రా; వారందరిని చూడవు కానీ, వారి శిబిరం సరిహద్దులు చూస్తావు. అక్కడినుండి నా కోసం వారిని శపించు” అని అన్నాడు.   14 బాలాకు బిలామును సోఫీము పొలములో ఉన్న పిస్గా శిఖరం మీదికి తీసుకెళ్లాడు. అక్కడ ఏడు బలిపీఠాలు కట్టి, ఒక్కో దాని మీద ఒక కోడెను, ఒక పొట్టేలును అర్పించాడు.   
 15 బిలాము బాలాకుతో, “నీవు ఇక్కడ నీ బలిపీఠం దగ్గర ఉండు, నేను అక్కడ దేవున్ని కలుస్తాను” అని అన్నాడు.   
 16 యెహోవా బిలామును కలుసుకొని, అతని నోటిలో మాట ఉంచి, “బాలాకు దగ్గరకు వెళ్లి ఈ మాటను చెప్పు” అని అన్నారు.   
 17 బిలాము తిరిగివెళ్లి రాజు, తన మోయాబు అధికారులతో దహనబలి దగ్గర నిలిచియుండడం చూశాడు. బాలాకు అతన్ని, “యెహోవా ఏమి చెప్పారు?” అని అడిగాడు.   
 18 అప్పుడు బిలాము తన సందేశాన్ని ఇచ్చాడు:  
“బాలాకు! లేచి, విను;  
సిప్పోరు కుమారుడా! నా మాట విను.   
 19 అబద్ధమాడడానికి దేవుడు మనుష్యుడు కాదు,  
మనస్సు మార్చుకోవడానికి ఆయన నరపుత్రుడు కాదు.  
ఆయన మాట్లాడి క్రియ చేయరా?  
ఆయన వాగ్దానం చేసి నెరవేర్చరా?   
 20 ఆశీర్వదించమని నేను ఆజ్ఞ పొందుకున్నాను;  
ఆయన వారిని ఆశీర్వదించారు, దాన్ని నేను మార్చలేను.   
 21 “యాకోబులో ఎటువంటి దోషం కనిపించలేదు,  
ఇశ్రాయేలులో ఏ చెడు కనిపించలేదు.  
వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నారు;  
రాజు యొక్క కేక వారి మధ్య ఉన్నది.   
 22 దేవుడు వారిని ఈజిప్టు నుండి బయటకు తెచ్చారు;  
వారికి అడవి ఎద్దుకు ఉన్న బలం ఉంది.   
 23 యాకోబుకు వ్యతిరేకంగా ఏ భవిష్యవాణి లేదు,  
ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఏ శకునాలు లేవు.  
ఇప్పుడు యాకోబు గురించి,  
ఇశ్రాయేలు గురించి, ‘దేవుడు ఏమి చేశారో చూడండి!’   
 24 ప్రజలు ఆడ సింహంలా లేస్తారు;  
వారు తమకు తాము సింహంలా లేస్తారు  
అది తన వేట మాంసాన్ని మ్రింగివేసే వరకు  
దాని బాధితుల రక్తం త్రాగే వరకు విశ్రాంతి తీసుకోదు”  
అని చెప్పబడుతుంది.   
 25 బాలాకు బిలాముతో, “వారిని అసలు శపించకు వారిని దీవించకు!” అని అన్నాడు.   
 26 బిలాము బాలాకుతో, “యెహోవా ఏది చెప్తే నేను అదే చేయాలని నేను చెప్పలేదా?” అని జవాబిచ్చాడు.   
బిలాము యొక్క మూడవ సందేశం 
  27 అప్పుడు బాలాకు బిలాముతో, “అయితే నిన్ను మరో స్థలానికి తీసుకెళ్తాను. బహుశ అక్కడినుండి నీవు నా కోసం వారిని శపించడం దేవునికి ఇష్టం కావచ్చు” అని అన్నాడు.   28 బాలాకు, బిలామును నిర్మానుష్య స్థలానికి ఎదురుగా ఉన్న పెయోరు కొండ శిఖరం పైకి తీసుకెళ్లాడు.   
 29 బిలాము బాలాకుతో, “నా కోసం ఇక్కడ ఏడు బలిపీఠాలు కట్టించు, ఏడు కోడెలను, ఏడు పొట్టేళ్ళను సిద్ధం చేయించు” అని అన్నాడు.   30 బాలాకు బిలాము చెప్పినట్టు చేశాడు, ప్రతి బలిపీఠం మీద కోడెను, పొట్టేలును అర్పించాడు.