30
మ్రొక్కుబడులు
మోషే ఇశ్రాయేలు గోత్ర పెద్దలతో ఇలా చెప్పాడు: “యెహోవా ఆజ్ఞాపించింది ఇదే: ఒక వ్యక్తి యెహోవాకు మ్రొక్కుబడి చేస్తే లేదా ప్రతిజ్ఞ ద్వారా ప్రమాణం చేస్తే, ఆ వ్యక్తి మాట తప్పకుండా, తాను చెప్పినదంతా చేయాలి.
“ఒక యువతి తండ్రి ఇంట ఉన్నప్పుడు యెహోవాకు మ్రొక్కుబడి చేస్తే లేదా ప్రతిజ్ఞ చేస్తే, తన తండ్రి దాన్ని గురించి వినిన తర్వాత తనను ఏమి అనకపోతే అప్పుడు ఆ యువతి మ్రొక్కుబళ్ళు లేదా తాను చేసిన ప్రతి ప్రతిజ్ఞ నిలుస్తుంది. అయితే, తన తండ్రి దాని గురించి విని ఒప్పుకోకపోతే, అప్పుడు ఆ యువతి చేసిన మ్రొక్కుబళ్ళు లేదా ప్రతిజ్ఞలు ఏవి కూడా నిలువవు; తన తండ్రి ఒప్పుకోలేదు కాబట్టి యెహోవా ఆమెను క్షమిస్తారు.
“ఆమె మ్రొక్కుబడి చేసుకున్న తర్వాత లేదా అవివేకంగా ప్రమాణం చేసిన తర్వాత ఆమె పెళ్ళి చేసుకుంటే, ఆమె భర్తకు ఈ సంగతి తెలుసుకుని అతడు మౌనంగా ఉంటే ఆమె మ్రొక్కుబళ్ళు లేదా ప్రతిజ్ఞలు నిలుస్తాయి. కానీ ఆమె భర్త ఈ సంగతి తెలుసుకుని, అతడు ఆ మ్రొక్కుబడిని లేదా ఆమె అవివేకంగా చేసిన ప్రమాణాన్ని కానీ ఒప్పుకోక రద్దు చేస్తే యెహోవా ఆమెను క్షమిస్తారు.
“విధవరాలు లేదా విడాకులు తీసుకున్న స్త్రీ చేసే మ్రొక్కుబడి కానీ ప్రమాణం తప్పనిసరిగా చెల్లించాలి.
10 “ఒక స్త్రీ తన భర్తతో నివసిస్తూ మ్రొక్కుబడి చేస్తే లేదా ప్రతిజ్ఞ చేస్తే, 11 తన భర్త దాన్ని గురించి వినిన తర్వాత తనను ఏమి అనకపోతే అప్పుడు ఆ యువతి మ్రొక్కుబళ్ళు లేదా తాను చేసిన ప్రతి ప్రతిజ్ఞ నిలుస్తుంది. 12 కానీ ఆమె భర్త వాటి గురించి విన్నప్పుడు వాటిని రద్దు చేస్తే, అప్పుడు ఆమె చేసిన మ్రొక్కుబళ్ళు లేదా తన పెదవులతో చేసిన ప్రమాణాలు ఏవి కూడా నిలువవు, యెహోవా ఆమెను క్షమిస్తారు. 13 స్త్రీ తాను ఉపవాసం ఉంటానని చేసుకున్న మ్రొక్కుబడి లేదా ప్రతిజ్ఞను ఆమె భర్త ఒప్పుకోవచ్చు లేదా రద్దు చేయవచ్చు. 14 కానీ ఆమె భర్త కొన్ని రోజుల వరకు కూడా ఏమి అనకుండా ఉంటే, అప్పుడు ఆమె చేసిన మ్రొక్కుబళ్ళు లేదా ప్రతిజ్ఞలు ఒప్పుకుంటున్నాడు. వాటి గురించి విన్నప్పుడు మౌనంగా ఉండడం ద్వారా అతడు వాటిని అంగీకరించాడు. 15 అయితే అతడు వినిన కొద్ది కాలం తర్వాత వాటిని రద్దు చేస్తే అతడు చేసిన తప్పుకు ప్రతిఫలం భరించాలి.”
16 ఇవి భార్యా భర్తల సంబంధం, యవ్వన కుమార్తె తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు తండ్రికి తనకు మధ్య ఉండవలసిన సంబంధం గురించి యెహోవా మోషేకు ఇచ్చిన నియమాలు.