2
క్రీస్తు వినయాన్ని అనుకరించుట
అయితే మీకు క్రీస్తులో ప్రోత్సాహం గాని, ఆయన ప్రేమ వలన ఆదరణ గాని, ఆత్మలో ఏ సహవాసం గాని, దయ, కనికరం గాని కలిగినచో, మీరు ఏక మనస్సు, ఒకే ప్రేమ కలిగి, ఆత్మలో ఒక్కటిగా ఉంటూ ఒకే భావం కలవారిగా ఉండి, నా సంతోషాన్ని పరిపూర్ణం చేయండి. స్వార్థపూరిత ఆశలతో లేదా వ్యర్థమైన గర్వంతో ఏమి చేయకండి. దానికి బదులు, వినయంతో ఇతరులకు మీకంటే ఎక్కువ విలువను ఇస్తూ, మీ సొంత పనులపై మాత్రమే ఆసక్తి చూపక, మీలో ప్రతి ఒక్కరు ఇతరుల పనులపై కూడా ఆసక్తి చూపించాలి.
మీలో ఒకరితో ఒకరికి గల మీ సంబంధాల్లో క్రీస్తు యేసు కలిగి ఉన్న స్వభావాన్నే మీరు కూడా కలిగి ఉండండి:
ఆయన దేవుని స్వరూపాన్ని పూర్తిగా కలిగినవాడై ఉండి,
దేవునితో సమానంగా ఉండడాన్ని విడిచి పెట్టకూడని భాగ్యమని భావించలేదు;
కాని దాసుని స్వరూపాన్ని ధరించుకొని
తనను తాను ఏమీ లేనివానిగా చేసికొని
మనుష్యుని పోలికగా పుట్టారు.
మనుష్యునిగా కనబడి
మరణానికి విధేయత చూపించడం ద్వారా
అనగా సిలువ మరణం పొందేంతగా
తనను తాను తగ్గించుకున్నారు!
 
అందువల్ల దేవుడు ఆయనను ఉన్నత స్థానానికి హెచ్చించి
అన్ని నామముల కంటే పై నామాన్ని ఆయనకిచ్చారు,
10 యేసు నామమున ప్రతివారి మోకాలు వంగునట్లు,
పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను,
11 ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకుంటుంది,
తండ్రియైన దేవునికి మహిమ కలుగును గాక.
నక్షత్రాల్లా ప్రకాశించుట
12 కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, మీరు ఎప్పుడు లోబడి ఉన్నట్లుగానే నేను ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, నేను మీతో లేనప్పుడు మరి ఎక్కువ లోబడి భయంతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించండి. 13 ఎందుకంటే దేవుని మంచి ఉద్దేశాలను నెరవేర్చడానికి మీరు ఇష్టపడడానికి, వాటిని చేయడానికి, మీలో కార్యాన్ని జరిగించేది దేవుడే.
14 సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదాన్ని చేయండి. 15-16 తద్వారా మీరు నిందలేనివారిగా, శుద్ధులుగా, “చెడిపోయిన వక్రమైన ఈ తరం మధ్యలో, మీరు దోషంలేని*ద్వితీ 32:5 దేవుని బిడ్డలు” అవుతారు. మీరు జీవవాక్యాన్ని స్థిరంగా పట్టుకుని ఉన్నప్పుడు, మీరు ఆకాశంలోని నక్షత్రాల్లా వారి మధ్యలో ప్రకాశిస్తారు. అప్పుడు నేను వృధాగా పరుగు పెట్టలేదు లేదా శ్రమపడలేదని క్రీస్తు దినాన నేను అతిశయించగలను. 17 మీ విశ్వాస యాగంలో దానికి సంబంధించిన సేవలో నేను పానార్పణంగా పోయబడినప్పటికి, మీతో కలిసి సంతోషించి ఆనందిస్తాను. 18 కాబట్టి మీరు కూడా నాతో కలిసి సంతోషించి ఆనందించండి.
తిమోతి ఎపఫ్రొదితు
19 మీరు ఎలా ఉన్నారో నేను కూడా తెలుసుకుని సంతోషించాలని, ప్రభువైన యేసులో తిమోతిని త్వరలో మీ దగ్గరకు పంపాలని నేను అనుకుంటున్నాను. 20 అతనిలా మీ క్షేమం గురించి నిజమైన ఆసక్తి కలిగినవారు నా దగ్గర ఎవరు లేరు. 21 ప్రతి ఒక్కరు తమ సొంత పనులపైనే ఆసక్తి చూపిస్తున్నారు, కాని యేసు క్రీస్తు పనులపై కాదు. 22 తిమోతి యోగ్యుడని మీకు తెలుసు, ఎందుకంటే ఒక కుమారుడు తన తండ్రికి సేవ చేసినట్లుగా సువార్త పనిలో అతడు నాతో కలిసి సేవ చేశాడు. 23 కాబట్టి నాకు ఏమి జరుగబోతుందో నేను చూసిన వెంటనే, అతన్ని పంపాలని అనుకుంటున్నాను. 24 నేనూ త్వరలోనే వస్తానని ప్రభువులో నాకు నమ్మకం ఉంది.
25 నా సహోదరుడు, జతపనివాడు, నా తోటి యోధుడు, నా అవసరాలను చూసుకోవడాని మీరు పంపిన మీ దూతయైన ఎపఫ్రొదితును తిరిగి మీ దగ్గరకు పంపవలసిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. 26 అతడు అనారోగ్యంగా ఉన్నాడని మీరు విన్నారు, కాబట్టి మీ అందరిని చూడాలని ఆశపడుతూ దుఃఖపడుతున్నాడు. 27 అతడు అనారోగ్యంతో చనిపోయే స్థితిలో ఉన్నాడు కాని దేవుడు అతన్ని కనికరించారు. అతన్నే కాదు నాకు దుఃఖం మీద దుఃఖం కలుగకుండా నన్ను కూడా కనికరించారు. 28 మీరు అతన్ని మరలా చూసినప్పుడు మీరు సంతోషిస్తారు, అలాగే నా వేదన కొంత తగ్గుతుంది, కాబట్టి అతన్ని పంపాలని అందరికంటే నేనే ఎక్కువ ఆశపడుతున్నాను. 29 గొప్ప సంతోషంతో ప్రభువులో అతన్ని ఆదరించండి, అతనిలాంటి వారిని గౌరవించండి. 30 ఎందుకంటే క్రీస్తు పని కోసం అతడు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. మీరు నాకు చేయలేని సహాయాన్ని చేయడానికి అతడు తన ప్రాణాన్ని సైతం లెక్కచేయలేదు.

*2:15-16 ద్వితీ 32:5