3
జ్ఞానం క్షేమాన్ని కలిగిస్తుంది 
  1 నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరచిపోవద్దు,  
నా ఆజ్ఞలను నీ హృదయంలో భద్రపరచుకో,   
 2 అవి నీ జీవితకాలాన్ని అనేక సంవత్సరాలు పొడిగిస్తాయి,  
నీకు సమాధానాన్ని వృద్ధిని కలిగిస్తాయి.   
 3 ప్రేమ, నమ్మకత్వం ఎన్నడు నిన్ను విడచిపోనివ్వకు;  
నీ మెడలో వాటిని ధరించుకో,  
నీ హృదయమనే పలక మీద వాటిని వ్రాసుకో.   
 4 అప్పుడు నీవు దేవుని దృష్టిలోను మనుష్యుల దృష్టిలోను  
దయపొంది మంచివాడవని అనిపించుకుంటావు.   
 5 నీ హృదయమంతటితో యెహోవాపై నమ్మకముంచు  
నీ సొంత తెలివిని ఆధారం చేసుకోవద్దు;   
 6 నీ మార్గాలన్నిటిలో ఆయనను గుర్తించు,  
అప్పుడు ఆయన నీ త్రోవలను తిన్నగా చేస్తారు.   
 7 నీకు నీవే తెలివైన వానినని అనుకోవద్దు;  
యెహోవా పట్ల భయభక్తులు కలిగి చెడును విడిచిపెట్టు.   
 8 అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం,  
నీ ఎముకలకు బలం కలుగుతుంది.   
 9 నీ ధనముతో,  
నీ పంటలో ప్రథమ ఫలముతో యెహోవాను ఘనపరచు;   
 10 అప్పుడు నీ ధాన్యాగారాలు నిండి సమృద్ధిగా ఉంటాయి,  
నీ గానుగ తొట్టెలు క్రొత్త ద్రాక్షరసంతో పొంగిపొర్లుతాయి.   
 11 నా కుమారుడా, యెహోవా క్రమశిక్షణను తృణీకరించవద్దు  
ఆయన గద్దింపును అసహ్యించుకోవద్దు.   
 12 ఎందుకంటే తండ్రి తన కుమారునిలో ఆనందించునట్లు,  
యెహోవా తాను ప్రేమించేవారిని క్రమశిక్షణలో ఉంచుతారు.   
 13 జ్ఞానాన్ని కనుగొన్న మనుష్యులు,  
వివేచన కలిగినవారు ధన్యులు.   
 14 ఎందుకంటే ఆమె*ఆమె జ్ఞానాన్ని సూచిస్తుంది వెండి కంటే ఎక్కువ ప్రయోజనకరం,  
ఆమె బంగారం కంటే ఎక్కువ లాభం తెస్తుంది.   
 15 ఆమె పగడాలకంటే శ్రేష్ఠమైనది;  
నీకు ఇష్టమైనవేవి ఆమెతో సమానం కావు.   
 16 దాని కుడి చేతిలో దీర్ఘాయువు;  
ఎడమ చేతిలో ఐశ్వర్యం ఘనతలు ఉన్నాయి.   
 17 దాని మార్గాలు ఎంతో అనుకూలమైనవి  
దాని త్రోవలన్ని సమాధానకరమైనవి.   
 18 ఆమెను కలిగి ఉన్నవారికి అది జీవవృక్షం వంటిది;  
దానిని స్థిరంగా పట్టుకుని ఉన్నవారు ధన్యులు.   
 19 యెహోవా జ్ఞానం వలన భూమికి పునాదులు వేశారు,  
ఆయన తెలివి వలన ఆకాశ విశాలాన్ని ఏర్పరిచారు;   
 20 ఆయన తెలివి వలన అగాధజలాలు విభజించబడ్డాయి.  
మేఘాల నుండి మంచు బిందువులు కురుస్తున్నాయి.   
 21 నా కుమారుడా, జ్ఞానాన్ని వివేకాన్ని నీ దగ్గర భద్రంగా చూచుకో,  
వాటిని నీ కళ్ళెదుట నుండి తొలగిపోనివ్వకు;   
 22 అవి నీకు జీవంగా,  
నీ మెడకు అలంకార ఆభరణంగా ఉంటాయి.   
 23 అప్పుడు నీ మార్గంలో నీవు క్షేమంగా నడుస్తావు,  
నీ పాదం తడబడదు.   
 24 నీవు పడుకున్నప్పుడు, భయపడవు;  
నీవు పడుకున్నప్పుడు, నీ నిద్ర మధురంగా ఉంటుంది.   
 25 హఠాత్తుగా భయం కలిగినప్పుడు,  
దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవు.   
 26 యెహోవా నీ ప్రక్కన ఉంటారు,  
నీ పాదాలు వలలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతారు.   
 27 నీవు క్రియ చేయగల అధికారం నీవు కలిగి ఉన్నప్పుడు,  
అవసరంలో ఉన్నవారికి సహాయం చేయకుండా ఉండవద్దు.   
 28 నీవు నీ పొరుగువానికి ఇప్పుడు సహాయం చేయ కలిగి ఉండి,  
“రేపు రా నేను ప్రయత్నిస్తాను”  
అని నీ పొరుగువానితో అనవద్దు.   
 29 నీ పొరుగువారు నమ్మకంగా నీ దగ్గర జీవిస్తున్నప్పుడు  
వారికి హాని తలపెట్టవద్దు.   
 30 నీకు హాని చేయని మనుష్యులతో,  
కారణం లేకుండా వాదించవద్దు.   
 31 హింసాత్మకమైనవారిని అసూయ పడకు,  
వారి మార్గాల్లో వేటిని నీవు ఎంచుకోవద్దు.   
 32 మూర్ఖులు యెహోవాకు అసహ్యులు  
కాని యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటారు.   
 33 దుర్మార్గుల ఇంటి మీదికి యెహోవా శాపం వస్తుంది,  
కాని నీతిమంతుల ఇంటిని ఆయన ఆశీర్వదిస్తారు.   
 34 ఎగతాళి చేసేవారిని ఆయన ఎగతాళి చేస్తారు  
కాని దీనులకు అణగారిన వారికి దయ చూపిస్తారు.   
 35 జ్ఞానులు ఘనతను పొందుతారు,  
మూర్ఖులు అవమానాన్ని పొందుతారు.