7
వ్యభిచార స్త్రీకి వ్యతిరేకంగా హెచ్చరిక 
  1 నా కుమారుడా, నా మాటలు పాటించు,  
నా ఆజ్ఞలను నీలో భద్రపరచుకో.   
 2 నా ఆజ్ఞలు నీవు పాటిస్తే నీవు బ్రతుకుతావు;  
నా బోధనలను నీ కనుపాపలా కాపాడు.   
 3 నీ వ్రేళ్ళకు వాటిని కట్టుకో;  
నీ హృదయ పలక మీద వ్రాసుకో.   
 4 జ్ఞానంతో, “నీవు నా సోదరివి”  
అంతరార్థంతో, “నీవు నాకు బంధువువనియు చెప్పు.”   
 5 అవి నిన్ను వ్యభిచారిణి నుండి కాపాడతాయి,  
దారితప్పిన స్త్రీ యొక్క మోహపు మాటల నుండి నిన్ను కాపాడతాయి.   
 6 నేను నా ఇంటి కిటికీ దగ్గర  
జాలి గుండా బయటకు చూశాను.   
 7 బుద్ధిహీనుల మధ్య,  
యువకుల మధ్య,  
వివేచనలేని ఒక యువకుని నేను చూశాను.   
 8 అతడు వ్యభిచారి మూలన ఉండే సందు దగ్గరకు వెళ్తున్నాడు,  
దాని ఇంటి వైపే నడుస్తున్నాడు   
 9 అది సాయంత్రం ముగిసి,  
చిమ్మచీకటి కమ్ముతున్న రాత్రి.   
 10 అంతలో వేశ్యలా ముస్తాబై జిత్తులమారి ఉద్దేశంతో,  
ఒక స్త్రీ అతన్ని కలవడానికి వచ్చింది.   
 11 (ఆమె కట్టుబాట్లు లేనిది తిరుగుబాటు చేసేది,  
దాని కాళ్లు దాని ఇంట్లో నిలువవు;   
 12 అది వీధుల్లో తిరుగుతుంది,  
ఎవరైనా దొరుకుతారేమోనని ప్రతి సందు దగ్గర అది పొంచి ఉంటుంది.)   
 13 అది ఆ యవ్వనస్థుని పట్టుకుని ముద్దు పెట్టుకుంది  
సిగ్గులేని ముఖం పెట్టుకొని ఇలా అన్నది:   
 14 “నేడు నేను నా మ్రొక్కుబడులు చెల్లించాను,  
ఇంటి దగ్గర నా సమాధానబలి అర్పణలోని ఆహారం ఉంది.   
 15 కాబట్టి నేను నిన్ను కలుసుకోవాలని వచ్చాను;  
నిన్ను వెదుకుతూ బయలుదేరగా నీవే కనబడ్డావు!   
 16 నా మంచం మీద ఈజిప్టు నుండి తెచ్చిన  
రంగుల నార దుప్పట్లు పరిచాను.   
 17 నా పరుపు మీద నేను మంచి సువాసనగల  
గోపరసం, అగరు, దాల్చిన చెక్కను చల్లాను.   
 18 తెల్లవారే వరకు వలపు తీర తృప్తి పొందుదాం;  
మనం హాయిగా అనుభవించుదాం!   
 19 నా భర్త ఇంట్లో లేడు;  
దూర ప్రయాణం వెళ్లాడు.   
 20 అతడు దూర ప్రయాణానికి సరిపడేంత డబ్బు సంచి చేతిలో పట్టుకుని వెళ్లాడు.  
రెండు వారాల వరకు తిరిగి రాడు.”   
 21 ఆ యువకుని వశపరచుకోవడానికి ఆ వేశ్య శతవిధాల ప్రయత్నించింది;  
దాని మృదువైన మాటలు అతన్ని మాయ చేశాయి.   
 22 అతడు మూర్ఖునిలా ఒక్కసారిగా  
వధకు వెళ్లే ఎద్దులా,  
ఉచ్చులోకి దిగిన జింకలా*హెబ్రీలో బుద్ధిహీనుని దాని వెంటపడ్డాడు,   
 23 తన ప్రాణానికి అపాయం ఉందని తెలియక,  
ఉరి దగ్గరకు పక్షి త్వరపడునట్లు,  
వాని గుండెను బాణంతో చీల్చే వరకు వాడు దాని వెంట వెళ్లాడు.   
 24 కాబట్టి ఇప్పుడు నా కుమారుడా, చెవియొగ్గి;  
నా మాటలు విను.   
 25 వేశ్య మార్గాల తట్టు నీ హృదయాన్ని వెళ్లనీయకు  
దారి తప్పి అది వెళ్లే దారిలో వెళ్లకు.   
 26 అది గాయపరచి చంపినవారు లెక్కలేనంత మంది;  
అది పడద్రోసిన వారు అనేకులు.   
 27 దాని ఇల్లు సమాధికే దారి తీస్తుంది,  
దాని తిన్నగా మరణానికే మార్గాన్ని చూపిస్తుంది.