9
జ్ఞానం, బుద్ధిహీనత 
  1 జ్ఞానము తన ఇంటిని నిర్మించుకొని;  
దానికి ఏడు స్తంభాలు చెక్కుకొనినది.   
 2 ఆమె మాంసాహారం తయారుచేసి తన ద్రాక్షరసాన్ని కలిపింది;  
తన భోజనబల్లను సిద్ధము చేసి ఉన్నది.   
 3 ఆమె తన దాసులను బయటకు పంపి,  
పట్టణంలోని ఎత్తైన స్థలము మీద నిలువబడి,   
 4 “సామాన్యమైన వారలారా, ఇక్కడకు రండి!” అని పిలుస్తుంది!  
బుద్ధిలేనివారితో అది ఇలా అంటుంది:   
 5 “రండి, నేను సిద్ధం చేసిన ఆహారం తినండి.  
నేను కలిపిన ద్రాక్షరసం త్రాగండి.   
 6 ఇకపై తెలివి లేనివారిగా ఉండకుండా బ్రతుకండి;  
తెలివిని కలిగించు దారిలో చక్కగా నడపండి.”   
 7 వెక్కిరించు వానికి బుద్ధి చెప్పు వాడు తనకు అవమానాన్ని తెచ్చుకుంటాడు;  
దుష్టులు వానిని గద్దించు వారు నిందను తెచ్చుకుంటారు.   
 8 హేళనగా మాట్లాడు వానిని గద్దించకు లేకపోతే వాడు నిన్ను ద్వేషిస్తాడు;  
తెలివిగల వానిని గద్దిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు.   
 9 జ్ఞానం గలవానికి బోధించగా వాడు మరింత జ్ఞానంగలవానిగా ఉంటారు;  
మంచివానికి బోధ చేయగా వాడు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాడు.   
 10 యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం,  
పవిత్రమైన దేవుని గురించిన తెలివియే మంచి చెడులను గురించి తెలుసుకొనుటకు ఆధారం.   
 11 జ్ఞానం వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది,  
నీవు జీవించే ఎక్కువవుతాయి.   
 12 నీవు తెలివి కలిగిన వానివైతే నీ తెలివి వలన నీకే లాభము;  
జ్ఞానమును ఎగతాళి చేసిన ఎడల దానిని నీవే భరించవలెను.   
 13 బుద్ధిహీనత అనే స్త్రీ గగ్గోలు పెట్టేది;  
ఆమె తెలివితక్కువది దానికి ఏమీ తెలియదు.   
 14 ఆ స్త్రీ తన ఇంటి వాకిటిలో కూర్చుండును,  
ఊరి ప్రధాన వీధుల్లో కుర్చీమీద అది కూర్చుండును,   
 15 ఆ దారిలో వెళ్లు వారిని చూసి,  
తమ మార్గములో చక్కగా వెళ్లు వారిని చూసి,   
 16 “సామాన్యమైన వారలారా, ఇక్కడకు రండి!” అని పిలుస్తుంది!  
బుద్ధిలేనివారితో అది ఇలా అంటుంది:   
 17 “దొంగతనం చేసిన నీళ్లు తీపి,  
రహస్యంగా చేసిన భోజనం రుచి!”   
 18 అయితే అక్కడ మృతులు ఉన్నారని,  
దాని అతిథులు పాతాళంలో ఉన్నారని వారికి కొంతవరకే తెలుసు.