18
 1 స్నేహం లేని వ్యక్తి స్వార్థ ప్రయోజనాలను వెంటాడుతాడు,  
అన్ని మంచి తీర్పులకు వ్యతిరేకంగా గొడవలు ప్రారంభిస్తాడు.   
 2 మూర్ఖులు అర్థం చేసుకోవడంలో ఆనందం పొందరు  
కాని వారి సొంత అభిప్రాయాలను ప్రసారం చేయడంలో ఆనందం పొందుతారు.   
 3 దుష్టత్వం వచ్చినప్పుడు ధిక్కారం కూడా వస్తుంది,  
అవమానముతో నింద వస్తుంది.   
 4 నోటి మాటలు అగాధజలాలు,  
కాని జ్ఞానం యొక్క ఊట పరుగెత్తే ప్రవాహము.   
 5 తీర్పుతీర్చుటలో దుష్టుని ఎడల పక్షపాతము చూపుటయు,  
అమాయకులకు న్యాయం తప్పించుటయు సరికాదు.   
 6 మూర్ఖుల మాటలు తగాదాకు సిద్ధముగా ఉన్నది,  
వారి నోళ్ళు దెబ్బలు ఆహ్వానిస్తాయి.   
 7 మూర్ఖుని నోరు వానికి నాశనము తెచ్చును,  
వాని పెదవులు వాని ప్రాణాలకు ఉరి.   
 8 పనికిమాలిన మాటలు రుచిగల పదార్థాల్లాంటివి  
అవి అంతరంగం లోనికి దిగిపోతాయి.   
 9 పనిలో అలసత్వం ప్రదర్శించేవాడు,  
వినాశకునికి సోదరుడు.   
 10 యెహోవా నామం బలమైన కోట,  
నీతిమంతుడు అందులోకి పరుగెత్తి క్షేమంగా ఉంటాడు.   
 11 ధనవంతుల ఆస్తి వారి యొక్క కోటగోడలు గల పట్టణం;  
వాని కళ్ళకు అది ఎక్కలేనంత ఎత్తైన గోడ.   
 12 నాశనానికి ముందు హృదయం గర్విస్తుంది,  
ఘనతకు ముందు వినయం ఉంటుంది.   
 13 సంగతి వినక ముందే జవాబిచ్చేవాడు  
తన బుద్ధిహీనతను బయటపెట్టి అవమానం పాలవుతాడు.   
 14 నరుని ఆత్మ వాని రోగాన్ని సహిస్తుంది,  
కానీ నలిగిన హృదయాన్ని ఎవరు భరించగలరు?   
 15 వివేచన గలవారి హృదయం తెలివిని సంపాదిస్తుంది,  
జ్ఞానం గలవారి చెవులు దాన్ని తెరుచుకుంటాయి.   
 16 ఒక బహుమతి మార్గం తెరుస్తుంది  
అది ఇచ్చిన వ్యక్తిని గొప్పవారి ఎదుటకు రప్పిస్తుంది.   
 17 ప్రతివాది వచ్చి ప్రతివాదన చేసే వరకు,  
వాదోపవాదాలలో మొదట మాట్లాడేది న్యాయంగా అనిపిస్తుంది.   
 18 చీట్లు వేయడం వివాదాలను పరిష్కరిస్తుంది  
బలమైన ప్రత్యర్థులను వేరుగా ఉంచుతుంది.   
 19 కోటగోడలు గల పట్టణం కంటే అభ్యంతరం చెందిన సహోదరుని తిరిగి గెలవడం కష్టము.  
వివాదాలు కోటకు అడ్డుగా ఉండే ద్వారాల్లాంటివి.   
 20 నోటి ఫలం చేత ఒక వ్యక్తి కడుపు నిండుతుంది,  
తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తినొందుతాడు.   
 21 చావు బ్రతుకులు నాలుక వశంలో ఉన్నాయి,  
దానిని ప్రేమించేవారు దాని ఫలాన్ని తింటారు.   
 22 భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది,  
వాడు యెహోవా నుండి దయ పొందుతాడు.   
 23 పేదవాడు దయ కోసం విజ్ఞప్తి చేస్తాడు,  
కాని ధనికుడు కఠినంగా సమాధానం ఇస్తారు.   
 24 నమ్మదగని స్నేహితులను కలిగి ఉన్నవాడు త్వరలోనే పతనానికి సమీపిస్తాడు,  
కాని ఒక స్నేహితుడు ఉన్నాడు సోదరుడి కంటే దగ్గరగా అంటిపెట్టుకుని ఉండేవాడు.