కీర్తన 12
సంగీత దర్శకునికి. షెమినీతు*షెమినీతు బహుశ సంగీత పదం కావచ్చు వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన. 
  1 యెహోవా, సహాయం చేయండి, ఎందుకంటే ఒక్కరైన నమ్మకమైనవారు లేరు;  
నమ్మకమైనవారు మనుష్యజాతి నుండి గతించిపోయారు.   
 2 ప్రతి ఒక్కరు తమ పొరుగువారితో అబద్ధమాడుతున్నారు;  
వారు తమ హృదయాల్లో మోసం పెట్టుకుని  
తమ పెదవులతో పొగడుతారు.   
 3 పొగిడే ప్రతి పెదవిని  
గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకను యెహోవా మౌనం చేయును గాక.   
 4 “మా నాలుకలతో మేము గెలుస్తాం;  
మా పెదవులు మమ్మల్ని కాపాడతాయి; మామీద ప్రభువెవరు?”  
అని వారంటారు.   
 5 “దీనులు దోపిడికి గురవుతున్నారు,  
అవసరంలో ఉన్నవారు మూల్గుతున్నారు కనుక,  
నేను ఇప్పుడే లేచి దుర్భాషలాడే వారి నుండి నేను వారిని రక్షిస్తాను”  
అని యెహోవా అంటున్నారు.   
 6 యెహోవా మాటలు నిర్దోషమైనవి,  
అవి మట్టి మూసలో శుద్ధి చేసిన వెండిలా పవిత్రమైనవి,  
ఏడుసార్లు శుద్ధి చేయబడిన బంగారం లాంటివి.   
 7 యెహోవా, అవసరంలో ఉన్నవారిని మీరు క్షేమంగా ఉంచుతారు  
ఈ చెడ్డతరం వారి నుండి నిత్యం కాపాడతారు,   
 8 మానవులలో నీచ ప్రవర్తన ఎక్కువైనప్పుడు,  
దుష్టులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు.