కీర్తన 22
సంగీత దర్శకునికి. “ఉదయకాలపు జింక పిల్ల” అనే రాగం మీద పాడదగినది. దావీదు కీర్తన 
  1 నా దేవా, నా దేవా! నన్ను ఎందుకు విడిచిపెట్టారు?  
నన్ను రక్షించకుండ ఎందుకంత దూరంగా ఉన్నారు,  
వేదనతో కూడిన నా మొరలకు ఎందుకు దూరంగా ఉన్నారు?   
 2 నా దేవా, పగలు నేను మొరపెడుతున్నాను,  
కాని మీరు జవాబివ్వడం లేదు,  
రాత్రి నేను మౌనంగా ఉండడం లేదు.   
 3 మీరు పరిశుద్ధులు;  
ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆసీనులై ఉన్నారు.   
 4 మా పూర్వికులు మిమ్మల్ని విశ్వసించారు;  
వారి నమ్మకాన్ని బట్టి మీరు వారిని విడిపించారు.   
 5 వారు మీకు మొరపెట్టి విడుదల పొందారు;  
మీపట్ల వారు నమ్మకముంచి సిగ్గుపడలేదు.   
 6 నేను మనిషిని కాను ఒక పురుగును,  
మనుష్యుల చేత తిరస్కరించబడి, ప్రజలచే అవమానించబడ్డాను.   
 7 నన్ను చూసినవారందరు నన్ను ఎగతాళి చేస్తారు;  
వారు వెక్కిరిస్తూ, తలలు ఊపుతూ ఎగతాళి చేస్తారు.   
 8 “వాడు యెహోవాను నమ్మాడు,  
యెహోవా వాన్ని విడిపించనివ్వండి.  
అతడు ఆయనలో ఆనందిస్తాడు కాబట్టి,  
ఆయనే వాన్ని విడిపించనివ్వండి” అని వారంటున్నారు.   
 9 నా తల్లి గర్భం నుండి మీరే నన్ను బయటకు తెచ్చారు;  
నా తల్లి రొమ్మున ఉన్నప్పుడే మీపై నమ్మకం పుట్టించారు.   
 10 నేను పుట్టినప్పుడే మీమీద ఆధారపడ్డాను;  
నా తల్లి గర్భంలో ఉన్నప్పటినుండే మీరే నా దేవుడు.   
 11 శ్రమ నాకు సమీపంగా ఉంది,  
నాకు సహాయం చేయడానికి ఒక్కరు లేరు,  
నాకు దూరంగా ఉండవద్దు.   
 12 ఎన్నో ఎద్దులు నన్ను చుట్టుముట్టాయి;  
బాషాను బలమైన ఎద్దులు నన్ను చుట్టూ మూగాయి.   
 13 గర్జిస్తూ ఎరను చీల్చే సింహాల్లా  
వారు తమ నోరు పెద్దగా తెరిచారు.   
 14 నేను నీటిలా పారబోయబడ్డాను,  
నా ఎముకలు కీళ్ళ నుండి తప్పాయి.  
నా హృదయం మైనంలా;  
నాలో కరిగిపోయింది.   
 15 నా బలం ఎండిన కుండపెంకులా అయింది,  
నా నాలుక నా అంగిలికి అంటుకుపోయింది;  
మీరు నన్ను మరణ ధూళిలో పడవేశారు.   
 16 కుక్కలు నా చుట్టూ గుమికూడాయి,  
దుష్టుల మూక నా చుట్టూ మూగింది;  
వారు నా చేతుల్లో నా పాదాల్లో పొడిచారు.*కొ.ప్రా.ప్ర.లలో సింహం చేసినట్టు   
 17 నా ఎముకలన్నీ బయటకు కనబడుతున్నాయి;  
ప్రజలు నన్ను చూస్తూ ఎగతాళిగా నవ్వుతున్నారు.   
 18 నా వస్త్రాలు పంచుకుని  
నా అంగీ కోసం చీట్లు వేస్తారు.   
 19 అయితే, యెహోవా మీరు నాకు దూరంగా ఉండకండి.  
మీరే నాకు బలం; నాకు సాయం చేయడానికి త్వరగా రండి.   
 20 ఖడ్గం నుండి నన్ను విడిపించండి,  
కుక్కల బలం నుండి నా విలువైన ప్రాణాన్ని కాపాడండి.   
 21 సింహాల నోటి నుండి నన్ను కాపాడండి;  
అడవి దున్నల కొమ్ముల నుండి నన్ను విడిపించండి.   
 22 నేను మీ నామాన్ని నా ప్రజలకు ప్రకటిస్తాను;  
సమాజంలో మిమ్మల్ని స్తుతిస్తాను.   
 23 యెహోవాకు భయపడేవారలారా, ఆయనను స్తుతించండి.  
యాకోబు సర్వ వంశస్థులారా, ఆయనను ఘనపరచండి!  
ఇశ్రాయేలు సర్వ వంశస్థులారా, ఆయనను పూజించండి.   
 24 బాధితుల శ్రమను ఆయన తృణీకరించలేదు  
వారిని చూసి అసహ్యపడలేదు;  
ఆయన ముఖం వారి నుండి దాచలేదు.  
ఆయన వారి మొర ఆలకించారు.   
 25 మహా సమాజంలో మీకే నేను స్తుతి చెల్లిస్తాను;  
మీకు భయపడు వారి ఎదుట నా మ్రొక్కుబడులు చెలిస్తాను.   
 26 దీనులు తృప్తిగా భోజనం చేస్తారు;  
యెహోవాను వెదికేవారు ఆయనను స్తుతిస్తారు,  
మీ హృదయాలు నిత్యం ఆనందిస్తాయి.   
 27 భూనివాసులందరూ యెహోవాను జ్ఞాపకం చేసుకుని  
ఆయన వైపు తిరుగుతారు,  
దేశాల్లోని కుటుంబాలన్నీ  
ఆయనకు నమస్కారం చేస్తాయి.   
 28 రాజ్యాధికారం యెహోవాదే  
ఆయనే దేశాలను పరిపాలిస్తారు.   
 29 లోకంలోని ధనికులంతా విందు చేస్తూ ఆరాధిస్తారు;  
తమ ప్రాణాలు కాపాడుకోలేక  
మట్టిలో కలిసిపోయే వారంతా ఆయన ఎదుట మోకరిస్తారు.   
 30 ఒక తరం వారు ఆయనను సేవిస్తారు;  
రాబోయే తరాలకు ప్రభువు గురించి చెబుతారు.   
 31 వారు వచ్చి ఆయన చేసిన కార్యాల గురించి,  
ఇంకా పుట్టని ప్రజలకు చెప్పి  
ఆయన నీతిని తెలియజేస్తారు!