కీర్తన 24
దావీదు కీర్తన.
భూమి, దానిలో ఉండే సమస్తం,
లోకం, దానిలో నివసించేవారు యెహోవా సొత్తు.
ఆయన సముద్రంపై భూమికి పునాది వేశారు.
జలాల మీద ఆయన దాన్ని స్థాపించారు.
 
యెహోవా పర్వతాన్ని అధిరోహించగల వారెవరు?
ఆయన పవిత్ర స్థలంలో నిలువగలవారెవరు?
ఎవరి చేతులు నిర్దోషమైనవో ఎవరి హృదయం శుద్ధమైనదో,
ఎవరు విగ్రహాల మీద నమ్మిక ఉంచరో,
ఎవరు మోసపూరితంగా ప్రమాణాలు*లేదా తప్పుడు దేవుళ్ళు చేయరో, వారే కదా!
 
వారు యెహోవా నుండి దీవెన పొందుతారు
వారి రక్షకుడైన దేవునిచే నీతిమంతులుగా తీర్చబడతారు.
ఆయనను వెదికే తరం ఇదే,
యాకోబు దేవా, మీ ముఖకాంతిని వెదకేవారు అలాంటివారే.
సెలా
 
గుమ్మాల్లారా! మీ తలలు పైకెత్తండి;
మహిమగల రాజు ప్రవేశించేలా
పురాతన ద్వారాల్లారా! పైకి లేవండి.
ఈ మహిమగల రాజు ఎవరు?
శక్తిమంతుడు బలశాలియైన యెహోవా,
యుద్ధ శూరుడైన యెహోవా.
గుమ్మాల్లారా! మీ తలలు పైకెత్తండి;
మహిమగల రాజు ప్రవేశించేలా
పురాతన ద్వారాల్లారా! పైకి లేవండి.
10 ఈ మహిమగల రాజు ఎవరు?
సైన్యాలకు అధిపతియైన యెహోవాయే
ఆయనే ఈ మహిమగల రాజు.
సెలా

*కీర్తన 24:4 లేదా తప్పుడు దేవుళ్ళు