కీర్తన 26
దావీదు కీర్తన. 
  1 యెహోవా, నేను నిందారహితునిగా జీవించాను,  
నాకు న్యాయం తీర్చండి;  
నేను ఏ సందేహం లేకుండ  
యెహోవాను నమ్మాను.   
 2 యెహోవా, నన్ను పరిశీలించండి, నన్ను పరీక్షించండి,  
నా హృదయాన్ని నా మనస్సును పరీక్షించండి;   
 3 నేను నిరంతరం మీ మారని ప్రేమను జ్ఞాపకముంచుకుంటాను  
మీ సత్యానికి అనుగుణంగా నడుచుకుంటాను.   
 4 నేను మోసగాళ్ళతో కూర్చోను,  
వేషధారులతో నేను సహవాసం చేయను.   
 5 కీడుచేసేవారి గుంపు నాకు అసహ్యం  
దుష్టులతో నేను కూర్చోను.   
 6-7 యెహోవా, నిర్దోషినని నా చేతులు కడుక్కుని,  
బిగ్గరగా మీ స్తుతిని ప్రకటిస్తూ  
మీ అద్భుత క్రియలన్నిటిని గురించి చెబుతూ  
మీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తాను.   
 8 యెహోవా, మీరు నివసించే ఆవరణం,  
మీ మహిమ నివసించే స్థలం అంటే నాకు ఇష్టము.   
 9 పాపులతో పాటు నా ప్రాణాన్ని  
నరహంతకులతో పాటు నా బ్రతుకును తుడిచివేయకండి.   
 10 వారి చేతుల్లో దుష్ట పన్నాగాలు ఉన్నాయి,  
వారి కుడి చేతులు లంచాలతో నిండి ఉన్నాయి.   
 11 నేను నిందారహితంగా బ్రతుకుతాను;  
నన్ను విమోచించండి నన్ను కరుణించండి.   
 12 నా పాదాలను సమతలమైన నేల మీద నిలిపాను;  
గొప్ప సమాజాలలో నేను యెహోవాను స్తుతిస్తాను.