కీర్తన 28
దావీదు కీర్తన. 
  1 యెహోవా, నేను మీకు మొరపెట్టుకుంటున్నాను;  
మీరు నా కొండయై ఉన్నారు,  
నా మొరను నిర్లక్ష్యం చేయకండి.  
ఒకవేళ మీరు మౌనంగా ఉంటే,  
నేను గుంటలోకి దిగిపోయే వారిలా అవుతాను.   
 2 నీ పరిశుద్ధాలయం వైపు  
నా చేతులెత్తి,  
కరుణ కొరకై నేను చేసే మొర  
సహాయం కొరకై నేను చేసే ప్రార్థన ఆలకించండి.   
 3 దుష్టులతో, చెడు చేసేవారితో పాటు  
నన్ను లాక్కు వెళ్లకండి.  
వారు పొరుగువారితో స్నేహపూర్వకంగా మాట్లాడతారు కాని,  
వారి హృదయాల్లో దుర్మార్గం పెట్టుకుంటారు.   
 4 వారి క్రియలకు  
వారి చెడు పనికి తగ్గట్టుగా చెల్లించండి.  
చేతులార వారు చేసిందానికి ప్రతీకారం చేయండి;  
వారికి తగిన ప్రతిఫలమివ్వండి.   
 5 యెహోవా క్రియలను గాని  
ఆయన తన చేతులతో చేసిన వాటిని గాని వారు గ్రహించరు,  
కాబట్టి ఆయన వారిని పడగొడతారు  
మరలా వారిని నిలబెట్టరు.   
 6 యెహోవా నా విజ్ఞాపన మొర విన్నారు  
కాబట్టి ఆయనకు స్తుతి కలుగును గాక.   
 7 యెహోవాయే నా బలం నా డాలు;  
హృదయపూర్వకంగా ఆయనను నమ్మాను, నాకు సాయం దొరికింది.  
నా హృదయం సంతోషంతో ఉప్పొంగి పోతుంది.  
నా పాటతో నేను ఆయనను స్తుతిస్తాను.   
 8 యెహోవాయే తన ప్రజలకు బలము.  
తన అభిషిక్తుడికి ఆయనే రక్షణ దుర్గము.   
 9 మీ ప్రజలను రక్షించండి మీ వారసత్వాన్ని దీవించండి;  
వారికి కాపరివై ఎల్లప్పుడూ వారిని మోయండి.