కీర్తన 36
సంగీత దర్శకునికి. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. 
  1 దుష్టుల పాప స్వభావాన్ని గురించి  
నా హృదయంలో నేను దేవుని నుండి వర్తమానం పొందుకున్నాను;  
వారి కళ్లలో  
దేవుని భయం లేదు.   
 2 తమ పాపం బయటపడి దాన్ని ద్వేషించే వరకు  
వారు తమను తాము పొగడుకొంటారు.   
 3 వారి నోటి మాటల్లో దుష్టత్వం, మోసం నిండి ఉన్నాయి;  
వారు తెలివిగా వ్యవహరించడంలో, మంచి చేయడంలో విఫలమవుతారు.   
 4 వారి పడకలపై ఉండగానే చెడుకు కుట్ర చేస్తారు;  
వారు తమ పాప మార్గాల్లో వెళ్తారు  
తప్పును తిరస్కరించరు.   
 5 యెహోవా! మీ మారని ప్రేమ ఆకాశాన్ని  
మీ విశ్వాస్యత అంతరిక్షాన్ని తాకుతుంది.   
 6 మీ నీతి దేవుని ఉన్నత పర్వతాల్లా,  
మీ న్యాయం అగాధ సముద్రంలా ఉన్నాయి.  
యెహోవా! మీరు మనుష్యులను జంతువులను సంరక్షిస్తున్నారు.   
 7 దేవా! మీ మారని ప్రేమ ఎంత అమూల్యమైనది!  
నరులు మీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు.   
 8 మీ మందిరంలోని సమృద్ధి వల్ల వారు సంతృప్తి పొందుతున్నారు;  
మీ ఆనంద నది నుండి మీరు వారికి త్రాగడానికి ఇస్తారు.   
 9 ఎందుకంటే మీ దగ్గర జీవపుఊట ఉంది;  
మీ వెలుగులోనే మేము వెలుగును చూడగలము.   
 10 మిమ్మల్ని ఎరిగిన వారిపైన మీ మారని ప్రేమను,  
యథార్థ హృదయులపై మీ నీతిని కొనసాగించండి.   
 11 గర్విష్ఠుల పాదం నాపైకి రానివ్వకండి,  
దుష్టుల చేతులు నన్ను తరుమనివ్వకండి.   
 12 కీడుచేసేవారు ఎలా కూలిపోయారో,  
క్రిందకు త్రోయబడి, మళ్ళీ లేవలేకుండ ఎలా ఉన్నారో చూడండి!