కీర్తన 41
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. 
  1 పేదవారిపై శ్రద్ధచూపువారు ధన్యులు;  
అలాంటి వారిని యెహోవా కష్ట దినాన విడిపిస్తారు.   
 2 యెహోవా వారిని కాపాడి సజీవంగా ఉంచుతారు,  
వారు దేశంలో ఆశీర్వదింపబడిన వారుగా పిలువబడతారు.  
ఆయన వారిని తమ శత్రువుల కోరికకు అప్పగించరు.   
 3 యెహోవా వారి రోగ పడక మీద వారికి స్వస్థత కలిగిస్తారు;  
వారి అనారోగ్యం నుండి మీరు వారికి స్వస్థత కలుగ చేస్తారు.   
 4 “యెహోవా, నన్ను కరుణించండి;  
నన్ను స్వస్థపరచండి, మీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను.”   
 5 నా శత్రువులు,  
“వీడెప్పుడు చస్తాడు, వీని పేరు ఎప్పుడు చెరిగిపోతుంది?”  
అని నా గురించి చెప్పుకుంటున్నారు.   
 6 నన్ను చూడటానికి వచ్చి అబద్ధాలాడతారు,  
వారు తమ హృదయంలో దుష్టత్వం నింపుకొని వస్తారు;  
వారు బయటకు వెళ్లినప్పుడు దానిని చెప్తారు.   
 7 నా శత్రువులంతా ఏకమై నాకు వ్యతిరేకంగా గుసగుసలాడుతున్నారు;  
నాకు కీడును తలపెడుతున్నారు.   
 8 “దుష్టమైన వ్యాధి అతనికి కలిగింది;  
కాబట్టి వాడు పడక నుండి మళ్ళీ లేవడు” అంటున్నారు.   
 9 నేను నమ్మిన  
నా దగ్గరి స్నేహితుడు,  
నా ఆహారం తిన్నవాడే,  
నాకు వ్యతిరేకంగా మడిమ ఎత్తాడు.   
 10 యెహోవా, నన్ను కరుణించి;  
వారి మీద ప్రతీకారం తీర్చుకొనేలా నన్ను పైకి లేవనెత్తండి.   
 11 నా శత్రువు నాపై విజయం సాధించలేదు కాబట్టి,  
నేనంటే మీకు ఇష్టమని నేను తెలుసుకున్నాను.   
 12 నా నిజాయితీని బట్టి మీరు నన్ను నిలబెట్టారు,  
మీరు నన్ను నిత్యం మీ సన్నిధిలో స్థిరపరిచారు.   
 13 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయే  
నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు స్తుతింపబడును గాక!   
ఆమేన్. ఆమేన్.