కీర్తన 63
దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన.
దేవా, మీరు నా దేవుడు,
నేను ఆశగా మిమ్మల్ని వెదకుతున్నాను;
నీరు లేక ఎండిపోయి పొడిగా ఉన్న దేశంలో,
నేను మీ కోసం దప్పిగొన్నాను,
నా శరీరమంతా
మీ కోసం ఆశపడుతుంది.
 
పరిశుద్ధాలయంలో నేను మిమ్మల్ని చూశాను.
మీ ఘనతా మహిమను తేరి చూశాను
మీ మారని ప్రేమ జీవం కంటే ఉత్తమం
నా పెదవులు మిమ్మల్ని స్తుతిస్తాయి.
నా జీవితకాలమంతా నేను మిమ్మల్ని స్తుతిస్తాను.
మీ పేరును బట్టి నా చేతులు ఎత్తుతాను.
శ్రేష్ఠమైన ఆహారం*లేదా క్రొవ్వు, మూలిగ దొరికినట్లు నేను సంతృప్తి పొందుతాను;
సంతోషించే పెదవులతో నా నోరు మిమ్మల్ని స్తుతిస్తుంది.
 
పడక మీద నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను;
రాత్రి జాముల్లో నేను మీ గురించి ఆలోచిస్తాను.
మీరు నాకు సహాయం కాబట్టి
మీ రెక్కల నీడలో నేను ఆనందంతో పాడతాను.
నేను మీకు అంటిపెట్టుకుని ఉంటాను;
మీ కుడిచేయి నన్ను ఆదుకుంటుంది.
 
నన్ను ఎవరు చంపాలని చూస్తారో వారే నాశనం అవుతారు;
వారు భూమి అగాధ స్థలాలకు దిగిపోతారు.
10 వారు ఖడ్గానికి అప్పగించబడి
నక్కలకు ఆహారం అవుతారు.
 
11 కాని రాజు దేవునియందే ఆనందిస్తాడు;
దేవుని మీద ప్రమాణం చేసే వారందరు ఆయనయందు అతిశయిస్తారు.
కాని అబద్ధికుల నోళ్ళు మౌనంగా ఉంటాయి.

*కీర్తన 63:5 లేదా క్రొవ్వు, మూలిగ