కీర్తన 71
 1 యెహోవా, నేను మీలో ఆశ్రయం పొందాను;  
నన్ను ఎప్పటికీ సిగ్గుపడనీయకండి.   
 2 మీ నీతిని బట్టి నన్ను రక్షించి విడిపించండి;  
నా వైపు చెవి ఉంచి నన్ను రక్షించండి.   
 3 నేను ఎల్లప్పుడూ వెళ్లగలిగే,  
నా ఆశ్రయదుర్గంగా ఉండండి;  
మీరు నా కొండ నా కోట కాబట్టి,  
నన్ను రక్షించేందుకు ఆజ్ఞ ఇవ్వండి.   
 4 నా దేవా, దుష్టుల చేతి నుండి,  
చెడ్డవారు, క్రూరుల పట్టు నుండి నన్ను విడిపించండి.   
 5 ప్రభువైన యెహోవా, మీరే నా నిరీక్షణ,  
నా యవ్వనం నుండి మీరే నా ధైర్యం.   
 6 పుట్టినప్పటి నుండి నేను మీమీద ఆధారపడ్డాను;  
నన్ను తల్లి గర్భం నుండి బయటకు తెచ్చింది మీరే.  
నేను నిత్యం మిమ్మల్ని స్తుతిస్తాను.   
 7 అనేకులకు నేనొక సూచనగా ఉన్నాను;  
మీరే నాకు బలమైన ఆశ్రయం.   
 8 నా నోరు మీ స్తుతితో నిండి ఉంది;  
నేను రోజంతా మీ వైభవాన్ని ప్రకటిస్తాను.   
 9 నేను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నన్ను త్రోసివేయకండి;  
నా బలం తగ్గిపోయినప్పుడు నన్ను విడిచిపెట్టకండి.   
 10 నా శత్రువులు నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు;  
నన్ను చంపాలని చూసేవారంతా కలిసి కుట్ర చేస్తున్నారు.   
 11 “దేవుడు అతన్ని విడిచిపెట్టారు;  
అతన్ని విడిపించడానికి ఒక్కరు లేరు,  
అతన్ని వెంటాడి పట్టుకోండి” అని వారంటారు.   
 12 నా దేవా, నాకు దూరంగా ఉండకండి;  
దేవా, సాయం చేయడానికి త్వరగా రండి.   
 13 నాపై నేరం మోపేవారు సిగ్గుతో నశించుదురు గాక;  
నాకు హాని చేయాలని కోరేవారు  
ఎగతాళిచేయబడి అవమానపరచబడుదురు గాక.   
 14 నా మట్టుకైతే, నేనెల్లప్పుడు నిరీక్షణ కలిగి ఉంటాను;  
నేను ఇంకా ఎక్కువగా మిమ్మల్ని స్తుతిస్తాను.   
 15 రోజంతా నా నోరు మీ నీతిక్రియలను గురించి,  
రక్షణక్రియలను గురించి చెప్తుంది.  
అవి నా గ్రహింపుకు అందనివి.   
 16 ప్రభువైన యెహోవా, నేను వచ్చి మీ గొప్ప కార్యాలను ప్రకటిస్తాను;  
కేవలం మీ నీతిక్రియలను మాత్రమే నేను ప్రకటిస్తాను.   
 17 దేవా! నా యవ్వనం నుండి మీరు నాకు బోధించారు,  
ఈ రోజు వరకు నేను మీ అద్భుత క్రియలను ప్రకటిస్తున్నాను.   
 18 నేను వృద్ధుడనై తల నెరసినప్పటికి,  
నా దేవా, తర్వాత తరానికి మీ శక్తిని,  
రాబోయే వారందరికి మీ గొప్ప కార్యాలను ప్రకటించే వరకు  
నన్ను విడిచిపెట్టకండి.   
 19 దేవా, మీ నీతి ఎత్తయిన ఆకాశాలకు ఉన్నతమైనది,  
మీరు గొప్ప వాటిని చేశారు.  
దేవా, మీలాంటి వారెవరు?   
 20 మీరు నన్ను అనేకమైన ఇబ్బందులు,  
చేదైన వాటిని చూసేలా చేసినప్పటికీ,  
మీరు నన్ను మళ్ళీ జీవించేలా చేస్తారు;  
భూమి యొక్క లోతుల నుండి  
మీరు నన్ను మళ్ళీ పైకి తెస్తారు.   
 21 మీరు నా గౌరవాన్ని పెంచుతారు  
మరోసారి నన్ను ఓదార్చుతారు.   
 22 నా దేవా, మీ నమ్మకత్వాన్ని బట్టి  
నేను సితారాతో మిమ్మల్ని స్తుతిస్తాను;  
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడా,  
నేను వీణతో మిమ్మల్ని స్తుతిస్తాను.   
 23 మీరు విడిపించిన నేను  
మీకు స్తుతి పాడినప్పుడు  
నా పెదవులు ఆనందంతో కేకలు వేస్తాయి.   
 24 రోజంతా నా నాలుక  
మీ నీతిక్రియలను గురించి చెప్తుంది,  
ఎందుకంటే నాకు హాని చేయాలని కోరుకున్నవారు  
అవమానం పొంది గందరగోళానికి గురి అయ్యారు.