కీర్తన 89
ఎజ్రాహీయుడైన ఏతాను ధ్యానకీర్తన. 
  1 యెహోవా యొక్క మారని ప్రేమను గురించి నేను ఎల్లప్పుడూ పాడతాను;  
నా నోటితో మీ నమ్మకత్వాన్ని  
అన్ని తరాలకు తెలియజేస్తాను.   
 2 మీ ప్రేమ ఎల్లప్పుడు దృఢంగా నిలిచి ఉంటుందని,  
మీ నమ్మకత్వాన్ని మీరు పరలోకంలోనే స్థాపించారని నేను ప్రకటిస్తాను.   
 3 “నేను ఏర్పరచుకున్న వానితో నేను ఒడంబడిక చేశాను,  
నా సేవకుడైన దావీదుకు ప్రమాణం చేశాను.   
 4 ‘మీ వంశాన్ని శాశ్వతంగా స్థాపిస్తాను  
మీ సింహాసనాన్ని అన్ని తరాలకు స్థిరపరుస్తాను’ ” అని మీరన్నారు. 
సెలా
    5 యెహోవా, ఆకాశాలు మీ అద్భుతాలను స్తుతిస్తున్నాయి,  
అలాగే పరిశుద్ధుల సభలో మీ నమ్మకత్వం స్తుతించబడుతుంది.   
 6 అంతరిక్షాల్లో యెహోవాతో పోల్చదగిన వారు ఎవరు?  
దైవపుత్రులలో ఆయనకు సాటి ఎవరు?   
 7 పరిశుద్ధుల సభలో దేవుడు మహా భీకరుడు;  
తన చుట్టూ ఉన్న వారందరికంటే ఆయన అధిక గౌరవనీయుడు.   
 8 సైన్యాల యెహోవా దేవా, మీలాంటి వారెవరు?  
యెహోవా మీరు మహా బలాఢ్యులు,  
మీ నమ్మకత్వం మీ చుట్టూ ఆవరించి ఉంది.   
 9 పొంగే సముద్రాన్ని మీరు అదుపులో ఉంచుతారు;  
అలలను మీరు అణచివేస్తారు.   
 10 చచ్చిన దానితో సమానంగా మీరు రాహాబును*కీర్తన 74:13 చూడండి. నలగ్గొట్టారు;  
మీ బలమైన బాహువు శత్రువులను చెదరగొట్టింది.   
 11 ఆకాశాలు మీవే, భూమి కూడ మీదే;  
లోకాన్ని దానిలో ఉన్నదంతా మీరే స్థాపించారు.   
 12 ఉత్తర దక్షిణ దిక్కులను మీరే సృజించారు;  
తాబోరు హెర్మోను పర్వతాలు మీ నామాన్ని బట్టి ఆనంద గానం చేస్తున్నాయి.   
 13 మీ బాహువు శక్తి కలది;  
మీ చేయి బలమైనది, మీ కుడిచేయి ఘనమైనది.   
 14 నీతి న్యాయం మీ సింహాసనానికి పునాదులు;  
మారని ప్రేమ, నమ్మకత్వం మీ ఎదుట నడుస్తాయి.   
 15 యెహోవా, మీ గురించి ఆనంద కేకలు వేసేవారు ధన్యులు,  
మీ సన్నిధి కాంతిలో వారు నడుస్తారు.   
 16 రోజంతా మీ నామాన్ని బట్టి వారు ఆనందిస్తారు;  
మీ నీతిని బట్టి వారు హర్షిస్తారు.   
 17 ఎందుకంటే వారి మహిమ వారి బలం మీరే,  
మీ దయతో మా కొమ్మును†కొమ్ము ఇక్కడ బలానికి సూచిస్తుంది హెచ్చిస్తారు.   
 18 నిజానికి, మా డాలు యెహోవాకు చెందినది,  
మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధునికి చెందిన వాడు.   
 19 ఒకనాడు మీరు దర్శనంలో మాట్లాడుతూ,  
మీకు నమ్మకమైన వారితో మీరిలా అన్నారు:  
“నేను వీరుడికి సాయం చేశాను.  
ఒక యువకుడిని ప్రజల్లో నుండి లేవనెత్తాను.   
 20 నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను;  
నా పవిత్ర తైలంతో అతన్ని అభిషేకించాను.   
 21 అతనికి నా చేయి తోడుగా ఉంది;  
నా బాహువు అతన్ని బలపరుస్తుంది.   
 22 శత్రువు అతని నుండి పన్ను వసూలు చేయలేడు;  
దుష్టులు అతన్ని అణచివేయలేరు.   
 23 అతని ఎదుటనే అతని పగవారిని పడగొడతాను,  
అతన్ని ద్వేషించేవారిని మొత్తుతాను.   
 24 నా నమ్మకత్వం నా మారని ప్రేమ అతనితో ఉంటాయి,  
నా నామాన్ని బట్టి అతని కొమ్ము‡కొమ్ము ఇక్కడ బలాన్ని సూచిస్తుంది హెచ్చంపబడుతుంది.   
 25 నేను అతని చేతిని సముద్రం మీద,  
అతని కుడి హస్తాన్ని నదుల మీద ఉంచుతాను.   
 26 ‘మీరు నా తండ్రి, నా దేవుడు  
నా కొండ, నా రక్షకుడు’ అని అతడు నాకు మొరపెడతాడు.   
 27 అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చూసుకుంటాను,  
భూరాజులందరిలో అతన్ని మహా ఉన్నతమైనవానిగా చేస్తాను.   
 28 నేను అతని పట్ల నా మారని ప్రేమను నిత్యం కొనసాగిస్తాను,  
అతనితో నా నిబంధన స్థిరమైనది.   
 29 అతని వంశాన్ని నిత్యం స్థాపిస్తాను,  
అతని సింహాసనం ఆకాశాలు ఉన్నంత వరకు ఉంటుంది.   
 30 “అతని కుమారులు నా న్యాయవిధుల నుండి తొలగిపోయినా  
నా చట్టాలను పాటించకపోయినా   
 31 ఒకవేళ వారు నా శాసనాలను ఉల్లంఘించినా  
నా ఆజ్ఞలను గైకొనకపోయినా,   
 32 నేను వారి పాపాన్ని దండంతో,  
వారి దోషాన్ని దెబ్బలతోను శిక్షిస్తాను;   
 33 అయితే వారికి నా ప్రేమను పూర్తిగా దూరం చేయను,  
నా నమ్మకత్వాన్ని ఎన్నటికి విడిచిపెట్టను.   
 34 నా నిబంధనను నేను భంగం కానివ్వను.  
నేను చెప్పినదానిలో ఒక మాట కూడా తప్పిపోదు.   
 35 నా పరిశుద్ధత తోడని ప్రమాణం చేశాను,  
నేను దావీదుతో అబద్ధం చెప్పను.   
 36 అతని వంశం నిత్యం ఉంటుందని,  
సూర్యుడు ఉన్నంత వరకు అతని సింహాసనం నా ఎదుట ఉంటుందని;   
 37 ఆకాశంలో విశ్వసనీయమైన సాక్ష్యంగా ఉన్న చంద్రునిలా,  
అది శాశ్వతంగా స్థిరపరచబడి ఉంటుంది” అని అన్నాను. 
సెలా
    38 కాని మీరు నన్ను తిరస్కరించి త్రోసివేశారు,  
మీరు అభిషేకించిన వానిపై మీరు చాలా కోపంగా ఉన్నారు.   
 39 మీరు మీ సేవకునితో చేసిన ఒడంబడికను విడిచిపెట్టి,  
అతని కిరీటాన్ని ధూళిలో పడవేసి అపవిత్రం చేశారు.   
 40 మీరు అతని ప్రాకారపు గోడలు పడగొట్టారు  
అతని బలమైన కోటలను పాడుచేశారు.   
 41 దారిన వెళ్లే వారందరూ అతన్ని దోచుకున్నారు;  
అతని పొరుగువారు అతడిని అపహాస్యం చేశారు.   
 42 మీరు అతని శత్రువుల కుడిచేతిని బలపరిచారు;  
అతని శత్రువులందరు ఆనందించేలా చేశారు.   
 43 నిజానికి, మీరు అతని ఖడ్గం అంచును వెనుకకు తిప్పారు  
యుద్ధంలో అతనికి సాయం చేయలేదు.   
 44 మీరు అతని వైభవాన్ని అంతం చేశారు  
అతని సింహాసనాన్ని నేలమీద పడవేశారు.   
 45 అతని యవ్వన దినాలను తగ్గించారు;  
అవమానంతో అతన్ని కప్పారు. 
సెలా
    46 ఎంతకాలం, యెహోవా? ఎప్పటికీ మీరు మరుగై ఉంటారా?  
ఎంతకాలం మీ ఉగ్రత అగ్నిలా మండుతూ ఉంటుంది?   
 47 నా ఆయుష్షు ఎంత నిలకడలేనిదో జ్ఞాపకం చేసుకోండి,  
వ్యర్థంగా మీరు మనుష్యులందరిని సృష్టించారు కదా!   
 48 మరణం చూడకుండ ఎవరు బ్రతకగలరు?  
సమాధి బలం నుండి మనిషిని ఎవరు రక్షించగలరు? 
సెలా
    49 ప్రభువా, మీ నమ్మకత్వంతో మీరు దావీదుకు వాగ్దానం చేసి  
మీరు మొదట చూపిన ఆ మారని ప్రేమ ఎక్కడ?   
 50 ప్రభువా, మీ సేవకులు ఎలా ఎగతాళి చేయబడ్డారో,  
అన్ని దేశాల నిందలను నేను నా హృదయంలో ఎలా భరిస్తున్నానో   
 51 యెహోవా, అవి మీ శత్రువులు ఎగతాళిగా చేసిన నిందలు,  
అడుగడుగునా మీ అభిషిక్తుని వారు చేసిన ఎగతాళి జ్ఞాపకం తెచ్చుకోండి.   
 52 యెహోవాకే నిత్యం స్తుతి కలుగును గాక!   
ఆమేన్ ఆమేన్.  
*కీర్తన 89:10 కీర్తన 74:13 చూడండి.
†కీర్తన 89:17 కొమ్ము ఇక్కడ బలానికి సూచిస్తుంది
‡కీర్తన 89:24 కొమ్ము ఇక్కడ బలాన్ని సూచిస్తుంది