కీర్తన 101
దావీదు కీర్తన.
యెహోవా మీకు స్తుతిగానం చేస్తాను;
మీ మారని ప్రేమను న్యాయాన్ని గురించి పాడతాను.
నేను నింద లేకుండ జీవించేలా వివేకంతో ప్రవర్తిస్తాను,
మీరు నా దగ్గరకు ఎప్పుడు వస్తారు?
 
నేను నిందారహితమైన హృదయంతో
నా ఇంటి వ్యవహారాలను నిర్వహిస్తాను.
నీచమైన దేనినైనా సరే
నేను నా కళ్లెదుట ఉంచను.
 
విశ్వాసం లేనివారు చేసేది నాకు అసహ్యం;
అందులో నేను పాలుపంచుకోను.
కుటిల హృదయం నాకు దూరమై పోవాలి;
చెడుతో నాకు ఎటువంటి సంబంధం ఉండదు.
 
రహస్యంగా తమ పొరుగువారిపై అభాండాలు వేసేవారిని,
నేను నాశనం చేస్తాను.
అహంకారపు కళ్లు, గర్వించే హృదయం గలవారిని
నేను సహించను.
 
నా కళ్లు దేశంలోని నమ్మకస్థులపై ఉంటాయి,
వారు నాతో నివసించాలని;
నిందారహితంగా జీవించేవారు
నాకు సేవ చేస్తారని.
 
మోసం చేసే వారెవరూ
నా భవనంలో నివసించరు;
అబద్ధాలాడే వారెవరూ
నా ఎదుట నిలబడరు.
 
ప్రతి ఉదయం దేశంలోని దుష్టులందరిని
నేను మౌనంగా ఉంచుతాను;
యెహోవా పట్టణంలో నుండి
కీడు చేసేవారిని పంపివేస్తాను.