కీర్తన 137
 1 బబులోను నదుల దగ్గర మనం కూర్చుని  
సీయోను పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చాము.   
 2 దాని మధ్యన ఉన్న నిరవంజి చెట్లకు  
మన సితారాలు తగిలించాము.   
 3 మనల్ని పట్టుకున్నవారు పాటలు పాడమని మనల్ని అడిగారు,  
మనల్ని బాధించినవారు సంతోష గానాలు కోరారు;  
“సీయోను పాటల్లో ఒకటి పాడండి” అని అన్నారు.   
 4 పరాయి దేశంలో ఉండగా  
యెహోవా పాటలు మనం ఎలా పాడగలము?   
 5 యెరూషలేమా! నేను నిన్ను మరచిపోతే,  
నా కుడిచేయి దాని నేర్పును మరచిపోవాలి.   
 6 నేను నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే,  
యెరూషలేము నాకు ఎక్కువ సంతోషం కలిగించేది  
అని నేను భావించకపోతే  
నా నాలుక నా అంగిలికి అంటుకుపోవాలి.   
 7 యెహోవా, యెరూషలేము పడిపోయిన రోజున  
ఎదోము ప్రజలు ఏమి చేశారో జ్ఞాపకం చేసుకోండి.  
“దానిని నాశనం చేయండి.  
పునాదుల వరకు దానిని ధ్వంసం చేయండి!” అని వారు అరిచారు.   
 8 త్వరలో నాశనమవ్వబోతున్న బబులోను కుమారీ,  
నీవు మాకు చేసిన కీడును బట్టి  
నీకు ప్రతీకారం చేసేవాడు ధన్యుడు.   
 9 మీ పసిపిల్లల్ని పట్టుకుని  
వారిని బండకువేసి కొట్టేవాడు ధన్యుడు.