కీర్తన 148
యెహోవాను స్తుతించండి.*హెబ్రీలో హల్లెలూయా; 14 వచనంలో కూడ చూడండి
 
పరలోకము నుండి యెహోవాను స్తుతించండి;
ఉన్నత స్థలాల్లో ఆయనను స్తుతించండి.
యెహోవా యొక్క సమస్త దేవదూతలారా, ఆయనను స్తుతించండి;
పరలోక సైన్యములారా, ఆయనను స్తుతించండి.
సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించండి.
మెరిసే నక్షత్రాల్లారా, మీరంతా ఆయనను స్తుతించండి.
ఉన్నత ఆకాశాల్లారా, అంతరిక్షానికి పైన ఉన్న జలాల్లారా
ఆయనను స్తుతించండి.
 
అవి యెహోవా నామాన్ని స్తుతించును గాక,
ఎందుకంటే ఆయన ఆజ్ఞమేరకు అవి సృజించబడ్డాయి,
ఆయన వాటిని నిత్యం నుండి నిత్యం వరకు స్థాపించారు,
ఆయన ఎన్నటికీ రద్దు చేయబడని శాసనం జారీ చేశారు.
 
భూమి మీద ఉన్న గొప్ప సముద్ర జీవులారా యెహోవాను స్తుతించండి,
సమస్త సముద్రపు అగాధాల్లారా,
మెరుపులు, వడగళ్ళు, మంచు, మేఘాలు,
ఈదురు గాలులు,
పర్వతాల్లారా, సమస్తమైన కొండలారా,
ఫలమిచ్చే చెట్లు, సమస్త దేవదారు వృక్షాల్లారా,
10 మృగాలు, సమస్త పశువులారా,
నేలపై ప్రాకే జీవులు ఎగిరే పక్షులారా,
11 భూరాజులారా సమస్త దేశ ప్రజలారా,
రాకుమారులారా, పాలకులారా,
12 యువకులారా, కన్యలారా,
వృద్ధులారా, పిల్లలారా, యెహోవాను స్తుతించండి.
 
13 వారు యెహోవా నామాన్ని స్తుతించుదురు గాక.
ఆయన నామము మాత్రమే మహోన్నతం;
ఆయన వైభవం భూమిపై ఆకాశంపై ఉన్నది.
14 ఆయన తన ప్రజల కోసం ఒక కొమ్మును లేపారు,కొమ్ము ఇక్కడ బలాన్ని సూచిస్తుంది
అది ఇశ్రాయేలులో ఆయనకు నమ్మకమైన సమస్త సేవకులు,
ఆయనకు సన్నిహితంగా ఉన్న ప్రజలు యొక్క స్తుతి.
 
యెహోవాను స్తుతించండి.

*కీర్తన 148:1 హెబ్రీలో హల్లెలూయా; 14 వచనంలో కూడ చూడండి

కీర్తన 148:14 కొమ్ము ఇక్కడ బలాన్ని సూచిస్తుంది