7
ముద్రింపబడినవారు 1,44,000
ఈ సంగతుల తర్వాత నలుగురు దూతలు భూమి నాలుగు మూలల్లో నిలబడి భూమిమీద గాని సముద్రం మీద గాని ఏ చెట్టు మీద గాని గాలి వీచకుండా నలుదిక్కుల నుండి గాలులను అడ్డగిస్తున్నారు. అప్పుడు నేను మరొక దేవదూత జీవంగల దేవుని ముద్రను కలిగి తూర్పుదిక్కు నుండి పైకి రావడం చూశాను. ఆ దేవదూత భూమికి సముద్రానికి హాని కలిగించడానికి అనుమతిని పొందిన ఆ నలుగురు దూతలతో బిగ్గరగా, “మేము మన దేవుని సేవకుల నుదుటి మీద దేవుని ముద్రను వేసే వరకు భూమికి కాని, సముద్రానికి కాని చెట్లకు కాని హాని చేయవద్దు” అని చెప్పడం నేను విన్నాను. ఆ తర్వాత నేను వారి సంఖ్య చెప్తుంటే విన్నాను. ఇశ్రాయేలు ప్రజల గోత్రాలు అన్నిటిలో ముద్రింపబడినవారు 1,44,000:
 
యూదా గోత్రంలో 12,000;
రూబేను గోత్రంలో 12,000;
గాదు గోత్రంలో 12,000;
ఆషేరు గోత్రంలో 12,000;
నఫ్తాలి గోత్రంలో 12,000;
మనష్షే గోత్రంలో 12,000;
షిమ్యోను గోత్రంలో 12,000;
లేవీ గోత్రంలో 12,000;
ఇశ్శాఖారు గోత్రంలో 12,000;
జెబూలూను గోత్రంలో 12,000;
యోసేపు గోత్రంలో 12,000;
బెన్యామీను గోత్రంలో 12,000 ముద్రించబడ్డారు.
తెల్లని వస్త్రాలు ధరించిన గొప్ప సమూహం
ఈ సంగతుల తర్వాత ఒక గొప్ప జనసమూహం లెక్కపెట్టడానికి అసాధ్యమైనంత మంది ప్రజలు ప్రతి దేశం నుండి, ప్రతి గోత్రం నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి వచ్చారు. వారు తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూర మట్టలు చేతపట్టుకుని సింహాసనం ముందు వధించబడిన గొర్రెపిల్ల ముందు నిలబడి ఉండడం నేను చూశాను. 10 వారు తమ స్వరాలను ఎత్తి బిగ్గరగా ఇలా అన్నారు:
“సింహాసనం మీద ఆసీనుడైన మా దేవునికి,
వధించబడిన గొర్రెపిల్లకే,
రక్షణ చెందుతుంది.”
11 అప్పుడు దేవదూతలు అందరు సింహాసనం చుట్టూ పెద్దల చుట్టూ నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడ్డారు; వారు సింహాసనం ముందు తమ ముఖాలను నేలకు ఆనిస్తూ సాగిలపడి దేవుని ఆరాధిస్తూ, 12 ఇలా అన్నారు:
“ఆమేన్!
మా దేవునికి స్తుతి, మహిమ,
జ్ఞానం, కృతజ్ఞతాస్తుతులు,
ఘనత, శక్తి,
ప్రభావం నిరంతరం కలుగును గాక
ఆమేన్.”
13 అప్పుడు పెద్దలలో ఒకడు, “తెల్లని వస్త్రాలను ధరించుకొన్న వీరు ఎవరు? వీరు ఎక్కడ నుండి వచ్చారు?” అని నన్ను అడిగాడు.
14 అప్పుడు నేను, “అయ్యా, అది మీకే తెలుసు కదా” అని చెప్పాను.
అతడు నాతో ఇలా అన్నాడు, “వీరు మహా హింసలలో నుండి వచ్చినవారు. వీరు వధించబడిన గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కుని తెల్లగా చేసుకున్నారు. 15 అందుకే,
“వీరు దేవుని సింహాసనం ముందు ఉండి,
ఆయన మందిరంలో రాత్రింబగళ్ళు ఆయనను ఆరాధిస్తున్నారు,
కాబట్టి ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు
తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు.
16 ‘మరి ఎన్నడు వారికి ఆకలి ఉండదు
దాహం ఉండదు;
సూర్యుని తీవ్రమైన వేడి కూడా వారికి తగలదు’*యెషయా 49:10
ఏ వేడి వారిని కాల్చదు.
17 ఎందుకంటే, సింహాసనం మధ్యలో ఉన్న వధించబడిన గొర్రెపిల్ల
వారికి కాపరిగా ఉండి
‘జీవజలాల ఊటల దగ్గరకు వారిని నడిపిస్తాడు.’యెషయా 49:10
‘దేవుడు వారి కళ్లలో నుండి కారే ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేస్తారు.’యెషయా 25:8

*7:16 యెషయా 49:10

7:17 యెషయా 49:10

7:17 యెషయా 25:8