12
స్త్రీ, మహా ఘటసర్పం 
  1 అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సూచన కనిపించింది: ఒక స్త్రీ సూర్యుని ధరించుకొని, కాళ్లక్రింద చంద్రుని, తన తలమీద పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని పెట్టుకొని ఉంది.   2 ఆమె గర్భవతిగా ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేస్తుంది.   3 అంతలో పరలోకంలో మరొక సూచన కనిపించింది: ఒక ఎర్రని మహా ఘటసర్పానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి. దాని ఏడు తలల మీద ఏడు కిరీటాలు ఉన్నాయి.   4 దాని తోక ఆకాశంలో ఉన్న నక్షత్రాలలో మూడవ భాగాన్ని ఈడ్చి భూమి మీదికి విసిరివేసింది. బిడ్డకు జన్మ ఇవ్వబోతున్న స్త్రీ బిడ్డకు జన్మ ఇవ్వగానే ఆ బిడ్డను మ్రింగివేయాలని ఆ ఘటసర్పం ఆ స్త్రీ ముందు నిలబడింది.   5 ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు “ఇనుప దండాన్ని పట్టుకుని అన్ని దేశాలను పరిపాలిస్తాడు.*కీర్తన 2:9” ఆ శిశువు దేవుని దగ్గరకు ఆయన సింహాసనం దగ్గరకు తీసుకుపోబడ్డాడు.   6 ఆ స్త్రీ 1,260 రోజుల వరకు సంరక్షింపబడేలా దేవుడు ఆమె కోసం అరణ్యంలో సిద్ధం చేసిన స్థలానికి ఆమె పారిపోయింది.   
 7 అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలు, అతని దూతలు ఆ మహాఘటసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా ఘటసర్పం దాని సైన్యం కూడా యుద్ధంలో పోరాడాయి.   8 కాని వానికి తగినంత బలం లేకపోవడంతో గెలువలేక పరలోకంలో తమ స్థానాన్ని పోగొట్టుకొన్నారు.   9 ఆ తర్వాత లోకమంతటిని మోసం చేసే ఆ మహా ఘటసర్పం, అనగా సాతాను లేదా అపవాది అని పిలువబడే ఆదిసర్పాన్ని వానిని అనుసరించే దూతలందరు వానితో పాటు భూమి మీదకు పడత్రోయబడ్డారు.   
 10 అప్పుడు పరలోకంలో ఒక గొప్ప స్వరం,  
“ఇదిగో, రక్షణ, అధికారం,  
రాజ్యం మన దేవునివి అయ్యాయి.  
ఆయన క్రీస్తుకు అధికారం వచ్చింది.  
ఎలాగంటే మన సహోదరీ సహోదరుల మీద  
రాత్రింబగళ్ళు మన దేవుని ముందు నేరాలను మోపుతున్న  
అపవాది క్రిందికి పడద్రోయబడ్డాడు.   
 11 వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి,  
తాము ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి  
అపవాది మీద విజయం పొందారు;  
వారు చావడానికి వెనుకంజ వేయలేదు  
తమ ప్రాణాలను ప్రేమించలేదు.   
 12 కాబట్టి ఆకాశాల్లారా,  
వాటిలో నివసించేవారలారా ఆనందించండి!  
అయితే భూమికి సముద్రానికి శ్రమ!  
ఎందుకంటే, అపవాది మీ దగ్గరకు దిగివచ్చాడు!  
తనకు కొద్ది కాలమే మిగిలి ఉందని అతనికి తెలుసు  
కాబట్టి అతడు తీవ్రమైన కోపంతో ఉన్నాడు”  
అని ప్రకటించడం నేను విన్నాను.   
 13 తాను భూమి మీద పడద్రోయబడడాన్ని ఘటసర్పం చూసినప్పుడు, అతడు మగబిడ్డకు జన్మనిచ్చిన ఆ స్త్రీని వెంటాడు.   14 ఒక కాలం కాలాలు సగకాలం వరకు సర్పానికి అందకుండ తన ఆకలిదప్పులు తీర్చుకొనేలా అరణ్యంలో ఆమె కోసం సిద్ధపరచిన స్థలానికి ఎగిరి వెళ్లడానికి ఆమెకు గొప్ప పక్షిరాజు రెక్కలు ఇవ్వబడ్డాయి.   15 అప్పుడు, ఆ స్త్రీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవాలని ఆ సర్పం తన నోటి నుండి నీటిని నదిలా కుమ్మరించింది.   16 కాని ఆ స్త్రీకి సహాయం చేయడానికి భూమి తన నోరు తెరిచి ఆ ఘటసర్పం నోటి నుండి వచ్చిన నదిని మ్రింగివేసింది.   17 అందుకు ఆ ఘటసర్పం ఆ స్త్రీపై కోపంతో మండిపడి ఆమె మిగిలిన సంతానంతో అనగా నమ్మకంగా దేవుని ఆజ్ఞలకు లోబడుతూ యేసు క్రీస్తు కోసం సాక్షులుగా జీవిస్తున్న వారితో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్లింది.