14
బలహీనుడు, బలవంతుడు
వివాదాస్పదమైన అంశాలపై వాదన పెట్టుకోక విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారిని చేర్చుకోండి. ఒకరేమో తన విశ్వాసాన్నిబట్టి అన్నీ తినవచ్చు అని నమ్ముతున్నారు, మరొకరు తన బలహీనమైన విశ్వాసాన్నిబట్టి కేవలం కూరగాయలే తింటున్నారు. అన్నిటిని తినేవారు అలా తినని వారిని చులకనగా చూడకూడదు, అలాగే అన్నిటిని తిననివారు తినేవారి మీద నింద వేయకూడదు. ఎందుకంటే దేవుడు వారిని అంగీకరించారు. వేరేవాళ్ళ సేవకునికి తీర్పు తీర్చడానికి నీవెవరవు? అతడు నిలబడినా పడిపోయినా అది అతని యజమాని చూసుకుంటాడు. ప్రభువు వారిని నిలబెట్టడానికి శక్తిగలవాడు కాబట్టి వారు నిలబడతారు.
ఒకరు ఒక రోజును మరొక రోజు కన్నా మంచిదని భావిస్తారు. మరొకరు అన్ని రోజులు ఒకేలాంటివని భావిస్తారు. వారిరువురు తమ మనస్సుల్లో దానిని పూర్తిగా నమ్ముతారు. ఒక రోజును మంచి రోజుగా భావించేవారు ప్రభువు కొరకే భావిస్తున్నారు. మాంసాన్ని తినేవారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు కాబట్టి వారు ప్రభువు కొరకే తింటున్నారు. తిననివారు కూడా ప్రభువు కొరకే తినడం మాని, దేవునికి కృతజ్ఞతలను చెల్లిస్తున్నారు. మనలో ఎవరు కేవలం తన కోసం మాత్రమే జీవించరు, తన కోసం మాత్రమే చావరు. మనం జీవించినా ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే, కాబట్టి మనం జీవించినా మరణించినా ప్రభువుకు చెందినవారమే. ఈ కారణంగానే, చనిపోయినవారికి జీవించి ఉన్నవారికి ప్రభువుగా ఉండడానికి క్రీస్తు మరణించి తిరిగి సజీవంగా లేచారు.
10 అయితే మనమందరం దేవుని న్యాయసింహాసనం ఎదుట నిలబడవలసి ఉండగా మీరు మీ సహోదరీ సహోదరులకు ఎందుకు తీర్పు తీర్చుతున్నారు? మీరు వారిని ఎందుకు తిరస్కరిస్తున్నారు? 11 దీని కోసం లేఖనంలో,
“ప్రభువు ఇలా చెప్తున్నారు, ‘నా జీవం తోడని ప్రమాణం చేస్తున్నాను,
ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది,
ప్రతి నాలుక దేవుని స్తుతిస్తుంది’*యెషయా 45:23
అని వ్రాయబడి ఉంది.
12 కాబట్టి, మనలో ప్రతి ఒక్కరు మన గురించి మనం దేవునికి లెక్క అప్పగించాలి.
13 కాబట్టి ఒకరిపై ఒకరు తీర్పు తీర్చడం మాని సహోదరి లేదా సహోదరుని మార్గానికి ఆటంకం కలిగించము అని తీర్మానం చేసుకుందాం. 14 సహజంగా ఏదీ అపవిత్రమైనది కాదని యేసు ప్రభువులో నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అయితే ఎవరైనా ఒకదాన్ని అపవిత్రమైనదని భావిస్తే వానికి అది అపవిత్రమైనదే. 15 మీరు తినే దాన్ని బట్టి మీ సహోదరి గాని సహోదరుడు గాని బాధపడితే, మీలో ప్రేమ లేదన్నట్టే. ఎవరి కోసమైతే క్రీస్తు చనిపోయాడో వారిని మీరు తినే దాన్ని బట్టి పాడు చేయకు. 16 కాబట్టి మీకు మంచిదని తెలిసిన దాన్ని చెడ్డదని మాట్లాడుకునేలా చేయకు. 17 దేవుని రాజ్యం తినడం త్రాగడం కాదు. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం. 18 ఎందుకంటే క్రీస్తుకు సేవ చేసేవారు దేవునికి ఇష్టులును మానవుల దృష్టికి యోగ్యులుగా ఉన్నారు.
19 కాబట్టి మనకు సమాధానాన్ని, పరస్పర వృద్ధిని కలిగించే దానినే మనం చేద్దాం. 20 ఆహారం గురించి దేవుని పనిని నాశనం చేయవద్దు. ఆహారమంతా శుభ్రమైనదే, కాని ఒకరు తినేది మరొకరికి ఆటంకాన్ని కలిగిస్తే అది తప్పవుతుంది. 21 మాంసం తినడం గాని మద్యం త్రాగడం గాని లేదా మరేదైనా మీ సహోదరులకు సహోదరీలకు ఆటంకంగా ఉంటే అది చేయకపోవడమే మంచిది.
22 వీటి గురించి మీకున్న నమ్మకాన్ని మీకు దేవునికి మధ్యనే ఉండనివ్వండి. తాను అంగీకరించిన వాటిని బట్టి తనకు తాను తీర్పు తీర్చుకొననివారు దీవించబడినవారు. 23 అయితే సందేహంతో తినేవారు విశ్వాసం లేకుండా తింటారు కాబట్టి శిక్ష పొందుతారు. విశ్వాసం లేకుండా చేసే ప్రతిదీ పాపమే అవుతుంది.

*14:11 యెషయా 45:23