3
రాత్రంతా నేను పడుకుని
నా హృదయం ప్రేమించేవాని కోసం నేను చూశాను;
ఆయన కోసం చూశాను కాని ఆయన రాలేదు.
నేను ఇప్పుడే లేచి పట్టణం వైపు వెళ్తాను,
పట్టణ వీధుల్లో రహదారుల్లో వెదకుతాను;
నా హృదయం ప్రేమిస్తున్నవాని కోసం నేను వెదకుతాను.
కాబట్టి నేను ఆయన కోసం వెదికాను కాని ఆయన కనపడలేదు.
పట్టణంలో గస్తీ తిరుగుతున్న కావలివారు నాకు ఎదురుపడితే
“మీరు నా ప్రాణప్రియుని చూశారా?” అని వారినడిగాను.
నేను దాదాపుగా వారిని దాటి వెళ్లాను
అప్పుడు నా ప్రేమికుడు నాకు కనిపించాడు.
ఆయనను గట్టిగా పట్టుకున్నాను
ఆయనను నా తల్లి గృహానికి,
నన్ను కనిన గది లోనికి తెచ్చే వరకు నేను వదల్లేదు.
యెరూషలేము కుమార్తెలారా! పొలములోని జింకలను బట్టి
లేళ్లను బట్టి మీతో ప్రమాణము చేయిస్తున్నాను:
సరియైన సమయం వచ్చేవరకు
ప్రేమను లేపకండి, మేల్కొల్పకండి.
 
ధూమ స్తంభాకరంలో
వర్తకుల దగ్గర సుగంధ చూర్ణాలన్నిటితో తయారుచేయబడిన
బోళం పరిమళ వాసనతో
అరణ్య మార్గాన నడిచి వస్తున్నదేంటి?
చూడండి! ఆ వచ్చేది సొలొమోను పల్లకి,
అరవైమంది శూరుల భద్రతలో
ఇశ్రాయేలీయులలో అతి జ్ఞానముగల యోధులు,
వారిలో అందరు ఖడ్గమును ధరించిన వారు,
యుద్ధంలో అనుభవం కలవారు,
ప్రతి ఒక్కరు రాత్రి కలిగే దాడులకు సిద్ధపడి,
ఖడ్గం ధరించి సన్నద్ధులై వస్తున్నారు.
సొలొమోను రాజు చేయించిన పల్లకి అది;
లెబానోను మ్రానుతో తయారైన పల్లకి.
10 దాని స్తంభాలు వెండివి,
అడుగుభాగం బంగారం,
దాని ఆసనం ఊదా రంగు బట్టతో అలంకరించబడింది,
దాని లోపలి భాగం యెరూషలేము కుమార్తెల ద్వార ప్రేమతో
అలంకరించబడింది. 11 బయటకు రండి,
సీయోను కుమార్తెలారా, చూడండి,
చూడండి, సొలొమోను రాజు కిరీటాన్ని ధరించారు,
ఆ కిరీటం ఆయన పెళ్ళి రోజున
ఆయన హృదయం ఆనందించిన దినాన
ఆయన తల్లి ఆయనకు ధరింపజేసిన కిరీటము.