5
ఎగిరే గ్రంథం
1 నేను మళ్ళీ చూసినప్పుడు ఎగురుతున్న గ్రంథపుచుట్ట ఒకటి కనిపించింది.
2 అతడు నన్ను, “నీకేం కనిపిస్తోంది?” అని అడిగాడు.
నేను, “ఇరవై మూరల పొడవు, పది మూరల*అంటే సుమారు 4.5 మీ. వెడల్పు కలిగి ఎగురుతున్న గ్రంథపుచుట్టను చూస్తున్నాను” అని జవాబిచ్చాను.
3 అందుకతడు నాతో ఇలా అన్నాడు, “ఇది భూమి అంతటి మీదికీ బయలుదేరి వెళ్తున్న శాపం; దానికి ఒకవైపు వ్రాసి ఉన్న ప్రకారం దొంగలు నాశనమవుతారు, రెండవ వైపు వ్రాసి ఉన్న ప్రకారం అబద్ధ ప్రమాణం చేసేవారంతా దేశ బహిష్కరణ శిక్ష పొందుతారు. 4 సైన్యాల యెహోవా చెప్తున్న మాట ఇదే, ‘నేను దానిని బయటకు పంపుతాను, అది దొంగల ఇంట్లోకి, నా పేరిట అబద్ధ ప్రమాణం చెప్పే అందరి ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో ఉంటూ దాని దూలాలు, రాళ్లతో సహా సమస్తాన్ని నాశనం చేస్తుంది.’ ”
బుట్టలో స్త్రీ
5 అప్పుడు నాతో మాట్లాడుతున్న దేవదూత ముందుకు వచ్చి, “నీ కళ్లు పైకెత్తి ఏమి కనిపిస్తుందో చూడు” అన్నాడు.
6 “అది ఏమిటి?” అని నేను అడిగాను.
అందుకతడు, “అది ఓ బుట్ట, అది దేశమంతటిలో ఉన్న ప్రజల దోషం” అని చెప్పాడు.
7 తర్వాత సీసంతో చేసిన మూత తీసినప్పుడు ఆ బుట్టలో ఒక స్త్రీ కూర్చుని కనబడింది. 8 అతడు, “ఇది దుర్మార్గం” అని చెప్పి బుట్టలోనికి దానిని నెట్టి సీసం మూత మూసి వేశాడు.
9 నేను మరలా పైకి చూడగా నా ఎదుట ఇద్దరు స్త్రీలు కనిపించారు, వారికున్న రెక్కలు గాలికి కదులుతున్నాయి. కొంగ రెక్కలవంటి రెక్కలు వారికున్నాయి, అవి ఆకాశానికి భూమికి మధ్యలో ఆ బుట్టను ఎత్తాయి.
10 నాతో మాట్లాడుతున్న దూతను, “బుట్టను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అని అడిగాను.
11 అతడు జవాబిస్తూ, “దానికి ఇల్లు కట్టడానికి బబులోను†హెబ్రీలో షీనారు దేశానికి తీసుకెళ్తున్నారు. ఇల్లు సిద్ధమైనప్పుడు ఆ బుట్ట అక్కడ దాని స్థానంలో ఉంచుతారు” అన్నాడు.