3
యెరూషలేము 
  1 అణచివేత, తిరుగుబాటుతనం,  
అపవిత్రత నిండిన పట్టణానికి శ్రమ!   
 2 ఆమె ఎవరికీ లోబడదు,  
ఆమె దిద్దుబాటును అంగీకరించదు.  
ఆమె యెహోవా మీద నమ్మకముంచదు,  
ఆమె తన దేవున్ని సమీపించదు.   
 3 దానిలో ఉన్న అధికారులు  
గర్జించే సింహాలు;  
దాని పాలకులు రాత్రివేళ తిరుగుతూ,  
ఉదయానికి ఏమీ మిగల్చకుండా తినే తోడేళ్లు.   
 4 దాని ప్రవక్తలు నీతిలేనివారు;  
వారు నమ్మకద్రోహులు.  
దాని యాజకులు పరిశుద్ధస్థలాన్ని అపవిత్రం చేస్తారు  
ధర్మశాస్త్రాన్ని హింసిస్తారు.   
 5 అయితే యెహోవా నీతిమంతుడు;  
ఆయన తప్పు చేయరు.  
అనుదినం ఆయన మానకుండా,  
ఉదయాన్నే తన న్యాయాన్ని అమలుచేస్తారు,  
అయినప్పటికీ నీతిలేని వానికి సిగ్గు తెలియదు.   
పశ్చాత్తాపపడని యెరూషలేము 
  6 “నేను దేశాలను నాశనం చేశాను;  
వాటి కోటలు పడగొట్టబడ్డాయి.  
నేను వాటి వీధులను ఎడారిగా వదిలేశాను,  
ఎవరూ వాటి గుండా వెళ్లరు.  
వాటిలో ఎవరూ నివసించకుండా  
వారి పట్టణాలను నిర్జనంగా చేశాను.   
 7 నేను యెరూషలేము గురించి,  
‘ఖచ్చితంగా నీవు నాకు భయపడి  
దిద్దుబాటును అంగీకరిస్తావు!  
అప్పుడు దాని ఆశ్రయ స్థలం*లేదా పరిశుద్ధాలయం నాశనం చేయబడదు,  
నా శిక్షలేవీ దాని మీదికి†లేదా నేను దాని మీదికి నియమించినవన్నీ రావు’ అని అనుకున్నాను.  
కాని వారు అన్ని రకాల  
చెడుపనులు చేయాలని ఆతృతగా ఉన్నారు.   
 8 కాబట్టి నా కోసం వేచి ఉండండి,”  
అని యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు.  
“నేను సాక్ష్యం చెప్పడానికి నిలబడే రోజు కోసం వేచి ఉండండి.‡కొ.ప్ర.లలో దోచుకోడానికి లేస్తాను  
నేను దేశాలను పోగుచేయాలని,  
రాజ్యాలను సమకూర్చాలని  
వాటి మీద నా ఉగ్రతను  
నా కోపాగ్ని అంతటిని కుమ్మరించాలని నిర్ణయించుకున్నాను.  
రోషంతో కూడిన నా కోపానికి  
లోకమంతా దహించబడుతుంది.   
మిగిలి ఉన్న ఇశ్రాయేలును పునరుద్ధరించుట 
  9 “నేను ప్రజల పెదవులను శుద్ధి చేస్తాను,  
అప్పుడు వారంతా యెహోవా నామానికి మొరపెట్టి  
ఏక మనసుతో ఆయనను సేవిస్తారు.   
 10 చెదిరిపోయిన నన్ను ఆరాధించే నా ప్రజలు  
కూషు§అంటే, నైలు ఉపరితల ప్రాంతం నదుల అవతల నుండి  
నాకు అర్పణలు తెస్తారు.   
 11 ఆ దినాన యెరూషలేమా,  
నీవు నా మీద తిరుగబడి చేసిన పనుల గురించి నీవు సిగ్గుపడవు,  
ఎందుకంటే నీ గర్వాన్ని బట్టి సంతోషించేవారిని  
నేను నీలో నుండి తొలగిస్తాను.  
నా పరిశుద్ధ కొండపై  
ఇంకెప్పుడు నీవు గర్వపడవు.   
 12 అయితే నేను మీలో  
సాత్వికులను, దీనులను వదిలివేస్తాను.  
ఇశ్రాయేలులో మిగిలినవారు  
యెహోవా నామాన్ని నమ్ముతారు.   
 13 ఇశ్రాయేలులో మిగిలినవారు ఏ తప్పు చేయరు;  
వారు అబద్ధాలు చెప్పరు.  
మోసపూరిత నాలుక  
వారి నోళ్లలో ఉండదు.  
వారు తిని పడుకుంటారు  
వారికి ఎవరి భయం ఉండదు.”   
 14 సీయోను కుమారీ, పాట పాడు;  
ఇశ్రాయేలూ, బిగ్గరగా కేకవేయి!  
యెరూషలేము కుమారీ,  
నీ పూర్ణహృదయంతో సంతోషించి ఆనందించు!   
 15 యెహోవా నీ శిక్షను తొలగించారు,  
నీ శత్రువును తిప్పికొట్టారు.  
ఇశ్రాయేలు రాజైన యెహోవా నీకు తోడుగా ఉన్నారు;  
ఇంకెప్పుడు ఏ హానికి నీవు భయపడవు.   
 16 ఆ రోజున  
వారు యెరూషలేముతో,  
“సీయోనూ, భయపడకు;  
నీ చేతులను బలహీన పడనివ్వవద్దు.   
 17 నీ దేవుడైన యెహోవా,  
రక్షించే పరాక్రమశాలి నీకు తోడుగా ఉన్నారు.  
ఆయన నిన్ను చూసి చాలా సంతోషిస్తారు;  
ఆయన తన ప్రేమను బట్టి ఆయన ఇకపై నిన్ను గద్దించరు,  
పాడుతూ నిన్ను చూసి సంతోషిస్తారు.”   
 18 “నీ నియమించబడిన పండుగలకు రాలేక దుఃఖించే వారందరినీ  
నేను మీ మధ్య నుండి తొలగిస్తాను.  
వారు మీకు భారంగా నిందగా ఉన్నారు.   
 19 ఆ సమయంలో  
నిన్ను హింసించిన వారందరిని నేను శిక్షిస్తాను.  
కుంటివారిని నేను రక్షిస్తాను;  
చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను.  
వారు అవమానానికి గురైన ప్రతి దేశంలో  
నేను వారికి కీర్తిని, ఘనతను ఇస్తాను.   
 20 ఆ సమయంలో నేను మిమ్మల్ని సమకూర్చుతాను;  
ఆ సమయంలో నేను మిమ్మల్ని ఇంటికి తీసుకువస్తాను.  
నేను మిమ్మల్ని  
చెరలో నుండి తిరిగి తీసుకువచ్చినప్పుడు  
భూమ్మీద ఉన్న ప్రజలందరిలో  
నేను మీకు కీర్తిని, ఘనతను ఇస్తాను”  
అని యెహోవా అంటున్నారు.