47
ఫిలిప్తీయుల గురించిన సందేశం
1 ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా నుండి ఈ సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఫిలిష్తీయులను గురించినది. గాజా నగరంపై ఫరో దాడి చేయటానికి ముందుగా ఈ వర్తమానం వచ్చింది.
2 యెహోవా ఇలా చెపుతున్నాడు,
“చూడు, శత్రుసైనికులు ఉత్తరాన సమకూడుతున్నారు.
శరవేగంతో పొంగి ప్రవహించే నదిలా వారు వస్తారు.
దేశాన్నంతా ఒక మహా వెల్లువలా వారు ఆవరిస్తారు.
వారు అన్ని పట్టణాలను, వాటి ప్రజలను చుట్టుముడతారు. దేశంలో ప్రతి పౌరుడూ సహాయంకొరకు ఆక్రందిస్తాడు.
3 పరుగెత్తే గుర్రపు డెక్కల చప్పుడు వారు వింటారు.
రథాల చప్పుడు వారు వింటారు. కదిలే చక్రాల రణగొణ ధ్వని వారు వింటారు.
తండ్రులు తమ పిల్లలను రక్షణ కల్పించలేరు.
ఆ తండ్రులు సహాయం చేయలేనంత బలహీనులవుతారు.
4 ఫిలిష్తీయులనందరినీ యెహోవా
త్వరలో నాశనం చేస్తాడు!
తూరు, సీదోనులకు సహాయపడే మిగిలిన
వారందరినీ నాశనం చేస్తాడు.
ఫిలిష్తీయులను యెహోవా అతి త్వరలో నాశనం చేస్తాడు.
క్రేతు ద్వీపవాసులలో మిగిలిన వారందరినీ ఆయన నాశనం చేస్తాడు.
5 గాజా ప్రజలు ధుఃఖంతో తమ తలలు గొరిగించుకుంటారు.
ఆష్కెలోను ప్రజల నోరు నొక్కబడుతుంది.
లోయలో మిగిలిన ప్రజలారా, ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపర్చుకుంటారు?
6 “ఓ యెహోవా ఖడ్గమా, నీవు ఎంతకాలము పోరాడెదవు.
నీ ఒరలోనికి నీవు వెళ్లుము!
ఆగిపో! శాంతించు, అని మీరంటారు.
7 కాని యెహోవా ఖడ్గం ఏ విధంగావిశ్రాంతి తీసికుంటుంది?
యెహోవా దానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు.
అష్కెలోను నగరాన్ని, సముద్ర తీరాన్ని
ఎదుర్కొనమని యెహోవా దానికి ఆజ్ఞ ఇచ్చాడు.”