48
మోయాబును గురించిన వర్తమానం ఈ వర్తమానం మోయాబు దేశాన్ని గురించినది. ఇశ్రాయేలు దేవుడు, సర్వ శక్తిమంతుడు అయిన యోహవా ఇలా చెపుతున్నాడు,
 
 
“నెబో పర్వతానికి* చేటు కులుగుతుంది.
నెబో పర్వతం నాశనమవుతుంది.
కిర్యతాయిము పట్టణం అణగ దొక్కబడుతుంది.
అది పట్టుబడుతుంది.
బలమైన దుర్గం అణగ దొక్కబడుతుంది.
అది పడగొట్టబడి చిందర వందర చేయబడుతుంది.
మోయాబు మరెన్నడూ ప్రశంసించబడడు.
మోయాబును ఓడించటానికి హెష్బోను పట్టణవాసులు కుట్రపన్నుతారు.
‘రండి. మనమా దేశాన్ని రూపుమాపుదాము’ అని వారంటారు.
మద్మేనా, నీవు కూడ మాట్లాడకుండా చేయబడతావు.
కత్తి నిన్ను వెంటాడుతుంది.
హొరొనయీము నుండి వచ్చే ఆక్రందనలువిను.
అవి కలవరపాటుకు, వినాశనానికి సంబంధించిన కేకలు.
మోయాబు ధ్వంసం చేయబడుతుంది.
దాని చిన్న పిల్లలు సహాయం కొరకు విలపిస్తారు.
మోయాబు ప్రజలు లూహీతు మార్గంలో వెళ్తున్నారు.
వారు మార్గమధ్యంలో మిక్కిలిగా విలపిస్తున్నారు.
హొరొనయీము పట్టణ మార్గంలో ప్రయాసతోను,
బాధతోను కూడిన రోదన వినిపించగలదు.
పారిపొండి! మీ ప్రాణరక్షణకై పారిపొండి!
ఎడారిలో అరుహ వృక్షం వీచినట్లు మీరు పారిపొండి.
 
“మీరు చేసిన వస్తువులలోను, మీ భాగ్యంలోనే మీరు విశ్వసిస్తారు.
కావున మీరు పట్టుబడతారు.
కెమోషు దైవం బందీగా కొనిపోబడతాడు.
అతనితో పాటు అతని యాజకులు, అధికారులు కూడ తీసికొని పోబడతారు.
వినాశనకారుడు ప్రతి పట్టణం మీదికి వస్తాడు.
ఒక్క పట్టణం కూడ తప్పించుకోలేదు.
లోయశిథిలము చేయబడుతుంది.
ఉన్నత మైదానం నాశనము చేయబడుతుంది.
యెహోవా ఇది జరుగుతుందని చెప్పినాడుగాన
ఇది జరిగి తీరుతుంది.
మోయాబు పొలాలపైన ఉప్పు§ చల్లుము.
దేశంవట్టి ఎడారి అయిపోతుంది.
మోయాబు పట్టణాలు ఖాళీ అవుతాయి.
వాటిలో ఎవ్వరూ నివసించరు.
10 ఎవ్వరేగాని యెహోవా చెప్పినట్లు చేయకపోయినా,
వారిని చంపటానికి తన కత్తిని వినియోగించకపోయినా, ఆ వ్యక్తికి కీడు మూడుతుంది.*
 
11 “మోయాబు ఇప్పటి వరకు ఆపద ఎరుగదు.
కుదురుకోడానికి నిలకడగా పెట్టిన ద్రాక్షరసంవలె మోయాబు ఉంది.
మోయాబు ఇంతవరకు ఒక జాడీనుండి మరొక దానిలోకి పోయబడలేదు అది.
నిర్బంధించబడి ఇతర దేశానికి కొని పోబడలేదు.
పూర్వంవలెనే అది ఇప్పుడూ రుచిగానే వున్నాడు.
అతని సువాసన మారలేదు.”
12 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు.
“కాని మిమ్మల్ని మీ జాడీలలో నుంచి బయట పోయుటకు
అతి త్వరలోనే నేను మనుష్యులను పంపుతాను.
ఆ మనుష్యులు మోయాబు యొక్క జాడీలను ఖాళీ చేస్తారు.
తరువాత ఆ జాడీలను వారు పగులగొడతారు.”
 
13 పిమ్మట మోయాబు ప్రజలు తమ బూటకపు దైవం కెమోషు పట్ల సిగ్గు చెందుతారు. ఇశ్రాయేలు ప్రజలు బేతేలు నందు ఆ బూటకపు దైవాన్ని నమ్మారు. కాని ఆ బూటకపు దైవం వారికి సహాయం చేయనప్పుడు ఇశ్రాయేలీయులు చాలా కలతచెందారు. మోయాబు కూడా అలా అవుతాడు.
 
14 “ ‘మేము మంచి సైనికులం. మేము యుద్ధవీరులం’
అని మీరు చెప్పుకోలేరు.
15 శత్రువు మోయాబును ఎదుర్కొంటాడు.
శత్రువు ఆ పట్టణాలలో చొరబడి నాశనం చేస్తాడు.
మోయాబు యువ వీరులంతా నరకబడతారు.”
ఈ వర్తమానం రాజునుండి వచ్చినది.
ఆ రాజు పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.
16 “మోయాబు అంతం దగ్గర పడింది.
మోయాబు త్వరలో నాశనమైపోతుంది.
17 మోయాబు చుట్టుపట్ల నివసించు ప్రజలారా ఆ దేశంకొరకు విలపించండి.
మోయాబు ఎంత ప్రసిద్ధి గాంచినవాడో మీకు తెలుసు.
అందువల్ల వానికొరకు మీరు విచారించండి.
‘అధిపతుల అధికారం విరిగిపోయింది.
మోయాబు కీర్తి ప్రతిష్ఠలు పోయాయి’
అని మీరు చెప్పండి.
 
18 “దీబోను వాసులారా
గొప్పవైన మీ స్థానాలనుండి దిగిరండి.
నేలమీద మట్టిలో కూర్చోండి.
ఎందువల్లనంటే, మోయాబును నాశనం చేసిన శత్రువు వస్తున్నాడు.
అతడు మీ బలమైన నగరాలను నాశనం చేస్తాడు.
 
19 “అరోయేరు నివాసులారా,
దారి పక్కన నిలబడి కనిపెట్టుకొని ఉండండి.
పారిపోయే మనిషిని చూడండి.
పారిపోయే స్త్రీని చూడండి.
ఏమి జరిగినందో వారిని అడగండి.
 
20 “మోయాబు పాడుపడి,
అవమానముతో నిండి పోతుంది.
మోయాబు ఏకరీతిగా విలపిస్తుంది.
మోయాబు పాడుపడిపోయిందని అర్నోను నది§ వద్ద ప్రకటించండి.
21 ఉన్నత మైదానంలోని ప్రజలు శిక్షింపబడ్డారు.
తీర్పు హోలోనుకు వచ్చింది. యాహసు, మేఫాతు,
22 దీబోను, నెబో, బేత్‌ దిబ్లాతయీము,
23 కిర్యతాయిము, బేత్గామూలు, బేత్మెయోను,
24 కెరీయోతు మరియు బొస్రా పట్టణాలకు తీర్పు ఇవ్వబడింది.
మోయాబుకు సమీపాన, దూరాన వున్న పట్టణాలన్నిటికి శిక్ష విధించబడింది.
25 మోయాబు బలం తగ్గిపోయింది.
మోయాబు చేయి విరిగిపోయింది.”
ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
 
26 “యెహోవా కంటె తానే ముఖ్యమైనట్లు మోయాబు భావించటం జరిగింది.
కావున, తాగినవాని మాదిరి తూలిపోయే వరకు మోయాబును శిక్షించండి.
మోయాబు తాను కక్కిన పదార్థంలోపడి దొర్లుతాడు.
ప్రజలు మోయాబును చూచి హేళన చేస్తారు.
 
27 “మోయాబూ, నీవు ఇశ్రాయేలును చూచి హేళన చేశావు.
ఇశ్రాయేలు ఒక దొంగల గుంపు చేతికి చిక్కింది.
నీవు ఇశ్రాయేలును గురించి మాట్లాడిన ప్రతిసారీ నీవు తలపంకించి,
ఇశ్రాయేలు కంటె నీవే మెరుగైనట్లు ప్రవర్తించావు.
28 మోయాబు ప్రజలారా,
మీ పట్టణాలను వదిలిపెట్టండి.
వెళ్లి గుట్టల్లో నివసించండి.
గుహద్వారంలో గూడు చేసికొనే గువ్వల్లా ఉండండి.”
 
29 “మోయాబు గర్వాన్ని గురించి విన్నాము.
అతడు మిక్కిలి గర్విష్ఠి.
తాను చాలా ముఖ్యమైన వానిలా అతడు తలంచినాడు.
అతడు ఎల్లప్పుడూ గొప్పలు చెప్పుకొనేవాడు.
అతడు మహా గర్విష్ఠి.”
 
30 యోహోవా ఇలా చెపుతున్నాడు, “మోయాబు ఏ కారణమూ లేకుండానే కోపం తెచ్చుకొంటాడు, స్వంత గొప్పలు చెప్పుకుంటాడని నాకు తెలుసు.
కాని అతని గొప్పలన్నీ అబద్ధాలు.
అతను చెప్పేవి చేయలేడు.
31 కావున, మోయాబు కొరకు నేను ఏడుస్తున్నాను.
మోయాబులో ప్రతి పౌరుని కొరకు విచారిస్తున్నాను.
కీర్హరెశు మనుష్యుల నిమిత్తం నేను బాధపడుతున్నాను.
32 యాజెరు ప్రజలతో కలిసి నేను కూడ యాజెరు కొరకై దుఃఖిస్తున్నాను!
సిబ్మా, గతంలో నీ ద్రాక్షలతలు సముద్ర తీరం వరకు వ్యాపించాయి.
అవి యాజెరు పట్టణం వరకు వ్యాపించాయి.
కాని వినాశనకారుడు నీ పంటను, ద్రాక్ష పండ్లను తీసికొన్నాడు.
33 మోయాబులో గల విశాలమైన ద్రాక్ష తోటలనుండి సుఖసంతోషాలు మాయమైనాయి.
గానుగల నుండి ద్రాక్షరసం కారకుండా ఆపాను.
రసం తీయటానికి ద్రాక్షకాయలను తొక్కే వారిలో ఆ పాటలు ఆగిపోయాయి
వారి అలరింతలు అంతమయ్యాయి.
 
34 “హెష్బోను మరియు ఎలాలే పట్టణవాసులు కేకలు పెడుతున్నారు. వారి రోదన దూరానగల యాహసు పట్టణం వరకు వినిపిస్తూ ఉంది. వారి కేక సోయారు నుండి దూరానగల హొరొనయీము, ఎగ్లాత్షాలిషా వరకు వినవచ్చింది. నిమ్రీములో నీరు సహితం ఇంకిపోయింది. 35 మోయాబు ఉన్నత స్థలాలలో దహన బలులు అర్పించటాన్ని నిలుపు చేస్తాను. వారు తమ దేవతలకు ధూపం వేయకుండా ఆపివేస్తాను.” ఇవి యెహోవా చెప్పిన విషయాలు.
36 “మోయాబు కొరకు నేను మిక్కిలి భిన్నుడనైయున్నాను. వేణువుపై విషాద గీతం ఆలపించినట్లు నా హృదయం విలపిస్తున్నది. కీర్హరెశు ప్రజల విషయంలో కూడా నేను విచారిస్తున్నాను. వారి ధన ధాన్యాలన్నీ తీసికొని పోబడ్డాయి. 37 ప్రతివాని తల గొరగబడింది. ప్రతివాని గడ్డం తీసివేయబడింది. గాయ పర్చబడటంతో ప్రతివాని చేతుల నుండి రక్తం కారుతున్నాయి.* ప్రతివాడూ తన మొలచుట్టూ విషాద సూచక బట్ట కట్టుకున్నాడు. 38 మోయాబులో ప్రతి చోట చనిపోయిన వారికోసం ప్రజలు దుఃఖిస్తున్నారు. వారు ప్రతి ఇంటిపైనా, జన సమ్మర్ద ప్రదేశాలలోనూ అలా విలపించారు. ఒక ఖాళీ జాడీని పగులగొట్టిన విధంగా నేను మోయాబును విచ్ఛిన్నం చేయటంతో విషాదం అలుముకున్నది.” యెహోవా ఈ మాటలు చెప్పాడు.
39 “మోయాబు విచ్ఛిన్న మవటంలో ప్రజలు ఏడుస్తున్నారు. మోయాబు లొంగిపోయాడు. మోయాబుకు తలవంపులయ్యాయి. మోయాబును చూచి ప్రజలు ఎగతాళి చేస్తారు. కాని అక్కడ జరిగిన విషయాలవల్ల ప్రజలు భయంతో నిండిపోతారు.”
 
40 యెహోవా ఇలా చెపుతున్నాడు, “చూడండి! ఆకాశం నుండి పక్షిరాజు (శత్రువు) దిగుతున్నాడు.
అతను తన రెక్కలను మోయాబు మీదికి చాపుతున్నాడు.
41 మోయాబు పట్టణాలు పట్టుబడతాయి.
బలమైన దుర్గాలు ఓడింపబడతాయి.
ఆ సమయంలో మోయాబు సైనికులు
ప్రసవించే స్త్రీలా భయాందోళనలు చెందుతారు.
42 మోయాబు రాజ్యం నాశనం చేయబడుతుంది.
ఎందువల్లనంటే వారు యెహోవా కంటె తమను ముఖ్యమైన వారిగా తలంచారు.”
 
43 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు,
“మోయాబు ప్రజలారా, మీ కొరకై భయం లోతైన గోతులు, ఉరులు పొంచివున్నాయి.
44 ప్రజలు భయపడి పారిపోతారు.
పరుగెత్తి లోతు గోతులల్లో పడిపోతారు.
ఎవడైనా ఆ లోతు గోతుల నుండి పైకివస్తే
అతడు ఉరిలో చిక్కుకుంటాడు.
మోయాబుకు శిక్షా సంవత్సరాన్ని తీసికొనివస్తాను.”
ఈ విషయాలన్నీ యెహోవా చెప్పాడు.
 
45 “బలవంతుడైన శత్రువునుండి జనం పారిపోయారు.
వారు రక్షణకై హెష్బోను పట్టణానికి పారిపోయారు.
అయినా అక్కడ రక్షణ దొరకలేదు.
హెష్బోనులో అగ్ని ప్రజ్వరిల్లింది.
సీహోను పట్టణంలో నిప్పు చెలరేగింది.
అది మోయాబు నాయకులను దహించివేస్తున్నది. అది గర్విష్ఠులను కాల్చివేస్తున్నది.
46 మోయాబూ, నీకు చెడు దాపురించింది.
కెమోషు ప్రజలు నాశనం చేయబడుతున్నారు.
నీ కుమారులు, కుమార్తెలు చెరపట్టబడి
బందీలుగా కొనిపోబడుతున్నారు.
 
47 “మోయాబు ప్రజలు బందీలుగా కొనిపోబడతారు. కాని రాబోయే కాలంలో మోయాబీయులను నేను వెనుకకు తీసికొని వస్తాను.” ఇది యెహోవా సందేశం.
ఇంతటితో మోయాబీయులపై తీర్పు సమాప్తం.
* 48:1 నెబో పర్వతం ఇశ్రాయేలుకు తూర్పునవున్న మోయాబు దేశంలో ఒక పర్వతం. 48:6 అరుహ వృక్షం ఇది ఒకరకం చెట్టు. మోయాబు దేశంలో ఒక నగరం పేరువలె ఇది ఉచ్చరింపబడుతుంది. ఇది ద్వంద్యార్థంగా వాడబడిన పదం. 48:7 కెమోషు కెమోషు మోయాబీయుల దైవం. ఆమ్మోనీయులు కూడా దీనిని ఆరాధించారు. ఈ దేవతారాధన రాజైన సొలొమోను ద్వారా యెరూషలేములోనికి వచ్చింది. కాని యోషీయా దానిని నిర్మూలించాడు. § 48:9 ఉప్పు ఇది కూడ ద్వంద్యార్థంగా వాడబడిన పదమే. హెబ్రీలో దీని సరియైన అర్థం మనకు తెలియదు. * 48:10 ఎవ్వరేగాని … మూడుతుంది మోయాబీయులను చంపమని యోహోవా చేత ఆజ్ఞాపించబడిన మోయాబీయుల శత్రువుల గురించి ప్రవక్త మాట్లాడు తున్నాడు. 48:12 జాడీలు బహుశాః దీని అర్థం మోయాబులోని పట్టణాలు కావచ్చు. 48:13 బేతేలు బేతేలు పట్టణమందు రాజైన యరొబాము నిర్మించిన గుడి అని దీని అర్థం. (చూడండి: రాజుల మొదటి గ్రంథం 12:28-33). అక్కడి ప్రజలు దేవునినింకా వక్రమార్గంలో పూజిస్తున్నారా అనేది స్పష్టంగా తెలియదు. లేదా కనానీయుల బూటకపు దేవత ఏల్ లేక బయలును పూజిస్తున్నదీ తెలియదు. § 48:20 అర్నోను నది మోయాబులో అర్నోను ఒక ముఖ్యమైన నది. * 48:37 ప్రతివాని … కారుతున్నాయి చనిపోయిన వారిపట్ల తమ దుఃఖం ప్రకటించటానికి ప్రజలివన్నీ చేస్తారు. 48:43 మీ కొరకై … ఉరులు హెబ్రీలో ఇవి ద్వంద్యార్థంగా వాడబడ్డాయి. పహాద్, పహాత్ అనునవి హెబ్రీ మాటలు. 48:45 సీహోను పట్టణం హెష్బోనుకే సీహోనుని అని ఆలంకారికంగా పేరు పెట్టి పిలిచారు. చూడండి సంఖ్యా కాండము 21:25-30.