11
సొలొమోను మరియు అతని భార్యలు
రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులు కాని వారైన అనేక మంది స్త్రీలను ప్రేమించాడు. అలాంటి స్త్రీలలో ఫరో కుమారై, మెయాబీయులు, అమ్మెనీయులు, ఎదోమీయులు, సీదోనీయులు, హిత్తీయులు వున్నారు. గతంలో ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా దేవుడు ఇలా అన్నాడు: “ఇతర దేశాల వారిని మీరు వివాహం చేసుకోరాదు. ఒక వేళ మీరు అలా చేస్తే ఆ ప్రజలు వాళ్ల దేవుళ్లను మీరు కొలిచేలా చేస్తారు.” కాని సొలొమోను ఈ స్త్రీల వ్యామోహంలో పడ్డాడు. సొలొమోనుకు ఏడు వందల మంది భార్యలున్నారు. (వీరంతా ఇతర దేశాల రాజుల కుమారైలే) అతనికి ఇంకను మూడు వందల మంది బానిస స్త్రీలు ఉపపత్నులుగ ఉన్నారు. అతని భార్యలు అతనిని తప్పుదారి పట్టించి దేవునికి దూరం చేశారు. సొలొమోను వృద్దుడయ్యే సరికి అతని భార్యలు అతడు ఇతర దేవుళ్లను మొక్కేలా చేశారు. తన తండ్రియగు దావీదు యెహోవా పట్ల చూపిన వినయ విధేయతలు, భక్తి శ్రద్ధలు సొలొమోను చూపలేకపొయాడు. సొలొమోను అష్ఠారోతును ఆరాధించాడు. ఇది ఒక సీదోనీయుల దేవత. మరియు సొలొమోను మిల్కోమును ఆరాధించాడు. ఇది అమ్మోనీయుల ఒక భయంకర విగ్రహం. ఈలాగున సొలొమోను యెహోవా పట్ల అపచారం చేశాడు. తన తండ్రి దావీదువలె సొలొమోను సంపూర్ణంగా యెహోవాని అనుసరించలేదు.
కెమోషుకు ఒక ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. కెమోషు మోయాబీయుల ఒక ఘోరమైన విగ్రహం. యెరూషలేముకు తూర్పుదిశలో ఒక కొండపై ఆ ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. అదే కొండ మీద మొలెకునకు కూడా ఒక ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. మొలెకు అమ్మోనీయులకు చెందిన ఒక భయానక విగ్రహం. ఇతర దేశాలకు చెందిన తన భార్యలందరి నిమిత్తం సొలొమోను ఈ మాదిరి ఆరాధనా స్థలాలను నిర్మించాడు. అతని భార్యలు వారి వారి దేవుళ్లకు ధూపం వేసి, బలులు సమర్పించేవారు.
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నుండి సొలొమోను దూరమైనాడు. కావున యెహోవా సొలొమోను పట్ల కోపం వహించాడు. సొలొమోనుకు యెహోవా రెండు సార్లు ప్రత్యక్షమైనాడు. 10 చిల్లర దేవుళ్లను ఆరాధించరాదని యెహోవా సొలొమోనుకు చెప్పాడు: యెహోవా ఆజ్ఞను సొలొమోను పాటించ లేదు. 11 కావున యెహోవా సొలొమోనుతొ ఇలా అన్నాడు, “నాతో నీవు చేసుకొన్న ఒడంబడికను అనుసరించుటకు నీవిష్టపడలేదు. నీవు నా ఆజ్ఞలను శిరసావహించలేదు. కావున నీ రాజ్యాన్ని నీ నుండి వేరు చేస్తానని నిశ్చయంగా చెప్తున్నాను. దానిని నీ సేవకునికి ఇస్తాను. 12 కాని నీ తండ్రి దావీదును నేను మిక్కిలి ప్రేమించియున్నాను. అందువల్ల నీవు బతికియుండగా నీ రాజ్యం నీ నుండి తీసుకొనను. నీ కుమారుడు రాజు అయ్యే వరకు నేను వేచి వుంటాను. అప్పుడు వాని నుండి దానిని నేను తీసుకుంటాను. 13 అప్పుడు కూడ, రాజ్యాన్నంతా నీ కుమారుని వద్ద నుండి తీసుకోను. అతను పరిపాలించటానికి ఒక తెగను అతనికి వదిలి వేస్తాను. ఉన్నతుడైన నా సేవకుడగు దావీదు కొరకు నేనది చేయదలిచాను. నేను ఎంపిక చేసుకున్న యెరూషలేము నగరం కొరకు నేనలా చేస్తాను.”
సొలొమోను శత్రువులు
14 ఆ సమయంలో ఎదోమీయుడగు హదదు అను వానిని యెహోవా సొలొమోనుకు శత్రువయ్యేలా చేశాడు. అతడు ఎదోము వంశానికి చెందిన వారిలో ఒకడు. 15 అది ఇలా జరిగింది. ఇదివరలో దావీదు ఎదోము రాజ్యాన్ని ఓడించాడు. అప్పుడు దావీదు సైన్యాధిపతిగా యోవాబు వున్నాడు. చనిపోయిన వారిని పాతి పెట్టించేందుకు యోవాబు ఎదోములోకి వెళ్లాడు. కాని అతడు అక్కడవున్న మగవారినందరినీ చంపేశాడు. 16 యోవాబు, ఇశ్రాయేలీయులందరూ ఎదోములో ఆరు నెలలు వున్నారు. ఆ సమయంలోనే వారు ఎదోములో వున్న పురుషులనందరినీ చంపేశారు. 17 కాని అప్పటికి హదదు చాలా చిన్నవాడు. కావున హదదు ఈజిప్టుకు పారిపోయాడు. హదదు తండ్రి యొక్క సేవకులు కొందరు అతనితో కలిసి వెళ్లారు. 18 వారు మిద్యాను దేశము నుండి పారానుకు వెళ్లారు. పారాను దేశంలో వారితో మరి కొందరు కలిశారు. వారంతా కలిసి ఈజిప్టుకు వెళ్లారు. ఈజిప్టు రాజగు ఫరో వద్దకు వెళ్లి సహాయం అర్థించారు. హదదుకు ఒక ఇంటిని, కొంత భూమిని ఫరో ఇచ్చాడు. ఫరో అతనికి అన్ని అండ దండలు ఇచ్చి, ఆహారం కూడా ఏర్పాటు చేశాడు.
19 హదదును ఫరో మిక్కిలి అభిమానించాడు. హదదుకు ఫరో ఒక భార్యను కూడా ఇచ్చాడు. ఆమె ఫరో మరదలే! (ఫరో భార్య పేరు రాణి తహ్పెనేసు) 20 అనగా తహ్పెనేసు యొక్క సోదరి హదదును వివాహమాడింది. వారికి ఒక కుమారుడు పుట్టాడు. వాని పేరు గెనుబతు. రాణి తెహ్పెనేను గెనుబతును తన పిల్లలతో పాటు ఫరో ఇంటిలోనే పెరగనిచ్చింది.
21 దావీదు చనిపోయినట్లు ఈజిప్టులో వున్న హదదు విన్నాడు. సైన్యాధిపతి యోవాబు కూడ చనిపోయినట్లు అతడు విన్నాడు. అందువల్ల హదదు ఫరో వద్దకు వెళ్లి, “నన్ను నా స్వదేశానికి వెళ్ల నియ్యండి” అని అడిగాడు.
22 “నీకు ఇక్కడ కావలసినవనన్నీ సమకూర్చాను! మరి నీవెందుకు నీ స్వదేశానికి వెళ్లిపోవాలను కుంటున్నావు?” అని ఫరో అన్నాడు.
అయితే హదదు మాత్రం, “దయచేసి నన్ను మాత్రం ఇంటికి వెళ్లనీయండి” అని ప్రాధేయపడ్డాడు.
23 సొలొమోనుకు మరొక వ్యక్తి శత్రువయ్యేలా యెహోవా చేశాడు. అతడు ఎల్యాదా కుమారుడైన రెజోను. రెజోను తన యజమాని వద్ద నుండి పారిపోయాడు. సోబా రాజైన హదదెజరు ఇతని యజమాని. 24 దావీదు సోబా సైన్యాన్ని ఓడించిన పిమ్మట రెజోను కొంత మందిని చేరదీసి ఒక చిన్న సైన్యాన్ని తయారు చేశాడు. రెజోను దమస్కుకు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. తరువాత అతను దమస్కుకు రాజు అయ్యాడు. 25 రెజోను అరాము దేశమును పాలించాడు. రెజోను ఇశ్రాయేలును అనహ్యించు కొనేవాడు. కావున సొలొమోను బతికినంత కాలం రెజోను ఇశ్రాయేలుకు శత్రువుగానే వున్నాడు. రెజోను, హదదు ఇశ్రాయేలులో చాలా అలజడిని సృష్టించారు.
26 నెబాతు కుమారుడైన యరొబాము సొలొమోను సేవకులలో ఒకడు. యరొబాము ఎఫ్రాయీము ప్రజలవాడు. అతడు జెరేదా పట్టణానికి చెందినవాడు. యరొబాము తల్లి పేరు జెరూహా. అతని తండ్రి మరణించాడు. అతడు రాజుకు వ్యతిరేకి అయ్యాడు.
27 యరొబాము రాజుకు వ్యతిరేకం కావటానికి ఒక కారణం వుంది. సొలొమోను మిల్లో కట్టించి, తన తండ్రి దావీదు నగర గోడను సరిచేస్తూ వున్నాడు. 28 యరొబాము చాలా బలశాలి. అతడు మంచి పనివాడని సొలొమోను గమనించాడు. అందుచే అతనిని యోసేపు వంశంవారు* చేసే అతి కష్టమైన పనుల మీద అధికారిగా నియమించాడు. 29 ఒక రోజు యరొబాము యెరూషలేము నుండి ప్రయాణం చేస్తూ వున్నాడు. షిలోనీయుడైన ప్రవక్త అహీయా దారిలో యరొబామును కలిశాడు. అహీయా నూతన వస్త్రం ధరించియున్నాడు. పొలాల్లో వారిద్దరు తప్ప మరెవ్వరూ లేరు.
30 అహీయా తాను ధరించిన నూతన వస్త్రం తీసి దానిని పన్నెండు ముక్కలుగా చించాడు. 31 అప్పుడు అహీయా యరొబాముతో ఈ విధంగా చెప్పాడు: “ఈ వస్త్రంలో పది ముక్కలు నీవు తీసుకో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏమి చెప్పినాడనగా: ‘ఈ రాజ్యాన్ని సొలొమోను నుండి దూరం చేస్తాను. అప్పుడు నీకు పది గోత్రాలను ఇస్తాను. 32 కాని దావీదు కుటుంబం ఒక గోత్రపువారిని ఏలటానికి అనుమతి ఇస్తాను. ఇది నా సేవకుడైన దావీదు జ్ఞాపకార్థం, యెరూషలేము నగరం కొరకు నేను దీనిని చేస్తాను. ఇశ్రాయేలు వంశాలవారుండే నగరాలన్నింటిలో యెరూషలేమును నేను ఎన్నుకున్నాను. 33 సొలొమోను నన్ననుసరించటం మానివేసినందుకు నేను ఇదంతా చేయదలిచాను. నన్ను విడిచి అతను సీదోనీయుల దేవత అష్ఠారోతును, మోయాబీయుల దేవత కెమోషును, అమ్మోనీయుల దేవత మిల్కోమును మొక్కుతున్నాడు. ఉత్తమ కార్యాలను, ధర్మ మార్గాన్ని అనుసరించటం సొలొమోను మానివేశాడు. నా న్యాయసూత్రాలను, ఆజ్ఞలను శిరసావహించటం లేదు. తన తండ్రి దావీదు నడచిన మార్గాన అతడు నడుచుట లేదు. 34 కావున అతని నుండి రాజ్యాన్నంతా తీసుకుంటాను. అయినా అతను బతికినంత కాలం తాను రాజుగా వుండేలా చూస్తాను. నా సేవకుడైన దావీదు గౌరవార్థం నేనలా చేస్తాను. నేను దావీదును ఎందుకు ఎన్నుకున్నాననగా అతడు నా ఆజ్ఞలను, నా ధర్మసూత్రాలను అన్నిటినీ పాటించాడు. 35 ఈ రాజ్యాన్ని నేనతని కుమారుని వద్ద నుండి తీసుకుంటాను. మరియు యరొబామా, పది వంశాల వారిని పరిపాలించటానికి నీకు అనుమతి ఇస్తాను. 36 సొలొమోను కుమారుడు ఒక వంశం వారిపై పాలనాధికారం కలిగి వుండేలా చేస్తాను. నా సేవకుడైన దావీదు నా ముందు యెరూషలేములో ఎల్లప్పుడూ రాజ్యం కలిగి వుండేటందుకు ఆ విధంగా చేస్తాను. యెరూషలేమును నా స్వంత నగరంగా నేను ఎన్నుకున్నాను. 37 కాని నీవు కోరినంత మట్టుకు నీవు రాజ్యం చేయగలిగేలా చేస్తాను. ఇశ్రాయేలు నంతటినీ నీవు ఏలుబడి చేస్తావు. 38 నీవు గనుక నా న్యాయ సూత్రాలను, నా ఆజ్ఞలను పాటిస్తూ సన్మార్గంలో నడిస్తే ఇవన్నీ జరిగేలా నేను చేస్తాను. దావీదు నా ధర్మ సూత్రాలను, ఆజ్ఞలను పాటించినట్లు నీవు కూడ పాటిస్తే నేను నీకు తోడైవుంటాను. దావీదుకు చేసినట్లు, నీ వంశం కూడ రాజ వంశమయ్యేలా చేస్తాను. ఇశ్రాయేలును నీకిస్తాను. 39 ఆజ్ఞాపాలన చేయకపోయిన కారణంగా దావీదు సంతానాన్ని నేను శిక్షిస్తాను. కాని వారిని నేను శాశ్వతంగా శిక్షకు గురి చేయను.’ ”
సొలొమోను మరణం
40 సొలొమోను యరొబామును చంప ప్రయత్నించాడు. కాని యరొబాము ఈజిప్టుకు పారిపోయాడు. ఈజిప్టు రాజగు షీషకు వద్దకు అతను వెళ్లాడు. సొలొమోను చనిపోయేవరకు యరొబాము అక్కడేవున్నాడు.
41 తన పరిపాలనా కాలంలో సొలొమోను అనేకమైన ప్రజ్ఞాప్రాభవాలతో కూడిన పనులను చేశాడు. ఈ విషయాలన్నీ సొలొమోను చరిత్ర గ్రంథంలో పొందు పర్చబడ్డాయి. 42 యెరూషలేము నుండి ఇశ్రాయేలంతటిపైన సొలొమోను నలుబది సంవత్సరాలు పరిపాలన చేశాడు. 43 తరువాత సొలొమోను చనిపోయాడు. అతడు తన పూర్వీకులతో సమాధి చేయబడ్డాడు అతడు తన తండ్రియగు దావీదు పురములో సమాధి చేయబడ్డాడు.
* 11:28 యోసేపు వంశంవారు యోసేపు వంశంలో ఎఫ్రాయీము, మనష్షే వంశాల వారు చేరియున్నారు. యోసేపు కుమారుల పేరుతో ఆ వంశాలు వ్యవహరింపబడుతూ వుండేవి. 11:43 ఆతడు … చేయబడ్డాడు తన పితరులతో కలిసి నిద్రించెనని శబ్ధార్థం.