10
షేబ దేశపు రాణి సొలొమోనును దర్మించుట
1 షేబ దేశపు రాణి సొలొమోను ప్రజ్ఞా విశేషాలను గూర్చి విన్నది. జటిలమైన ప్రశ్నలు వేసి అతనిని పరీక్షించాలని ఆమె వచ్చింది.
2 అనేక మంది సేవకులు వెంటరాగా, ఆమె యెరూషలేముకు ప్రయాణమై వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు, బంగారం మొదలైన వాటిని అనేక ఒంటెల మీద ఎక్కించి తనతో తీసుకొని వచ్చింది. ఆమె సొలొమోనును కలిసి, ఆమె ఆలోచించ గలిగినన్ని చిక్కు ప్రశ్నలను వేసింది.
3 సొలొమోను అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పటానికి ఆమె వేసిన ప్రశ్నలలో ఏ ఒక్కటీ అతనికి కష్టమైనదిగా కన్పించలేదు.
4 షేబ దేశపు రాణి సొలొమోను చాలా తెలివైనవాడని తెలుసుకున్నది. అతను నిర్మించిన అతి సుందరమైన రాజభవనాన్ని కూడ ఆమె తిలకించింది.
5 రాజు బల్లవద్ద విలువైన భోజన పదార్థాలను ఆమె చూసింది. రాజు కింది అధికారులు సమావేశమయ్యే తీరు తెన్నులు ఆమె గమనించింది. రాజభవనంలో సేవచేయుటకు, వారు ధరించే మంచి దుస్తులను ఆమె చూసింది. రాజు ఇచ్చే విందులు, ఆయన దేవాలయంలో అర్పించే బలులు కూడా చూసింది. ఇవన్నీ ఆమెకు ఆనందము ఆశ్చర్యము కలుగజేశాయి.
6 కావున రాజుతో రాణి ఇలా అన్నది, “నీవు చేసే పనుల గురించి, నీ ప్రజ్ఞా ప్రభావాల గురించి నేను నా దేశంలో చాలా విన్నాను. నేను విన్నవన్నీ నిజమని తేలింది!
7 నేనిక్కడికి వచ్చి స్వయంగా నా కళ్లతో నేను చూచే వరకు నేను విన్నవన్నీ నిజమని నమ్మలేదు. ఇప్పుడు నేను విన్న దానికంటె ఎక్కువ ఉన్నట్లు చూశాను. నీ తెలివి తేటలు, నీ సిరిసంపదలను గురించి ప్రజలు నాకు చెప్పినదాని కంటె అవి అతిశయించి వున్నాయి.
8 నీ భార్యలు, నీ సేవకులు చాలా అదృష్టవంతులు! వారికి ఎల్లప్పుడూ నిన్ను సేవించే భాగ్యము, నీ తెలివితేటలను వినే అదృష్టము లభించింది!
9 నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక! నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పట్ల నిరంతర ప్రేమగలిగి వున్నాడు. కావుననే ఆయన నిన్ను రాజుగా చేశాడు; నీవు న్యాయమార్గంలో రాజ్యపాలన చేస్తున్నావు.”
10 పిమ్మట షేబ దేశపు రాణి రెండు వందల నలభై మణుగుల బంగారాన్ని, చాలా సుగంధ ద్రవ్యాలను, రత్నాలను రాజుకు కానుకగా సమర్పించింది. ముందెన్నడూ ఎవ్వరూ ఇశ్రాయేలు రాజ్యాలలోకి తేనన్ని సుగంధ ద్రవ్యాలను షేబ దేశపు రాణి సొలొమోనుకు సమర్పించింది.
11 హీరాము యొక్క ఓడలు కూడ ఓఫీరు నుండి బంగారం తీసుకుని వచ్చాయి. ఆ ఓడలు చాలా కలప, వజ్రాలు కూడ తీసుకుని వచ్చాయి.
12 ఆ కలపను దేవాలయంలోను, రాజభవనంలోను స్తంభాలు చేయటానికి సొలొమోను ఉపయోగించాడు. గాయకులకు సితారను, స్వరమండలమును చేయటానికి కూడ ఆ కలపను అతడు ఉపయోగించాడు. ఇశ్రాయేలు లోనికి ఆ రకమైన కలపను ఎవ్వరూ తేలేదు. అప్పటినుండి మళ్లీ ఎవ్వరూ ఆ విధమైన కట్టెను చూడలేదు.
13 సాటి రాజ్యాధినేతకు ఒక రాజు ఎలాంటి కానుకలు ఇస్తాడో, ఆలాగున రాజైన సొలొమోను షేబ దేశపు రాణికి కానుకలు ఇచ్చాడు. పైగా ఆమె అడిగిన ఇతర వస్తువులను కూడా ఆమెకు సమర్పించాడు. ఆ తరువాత రాణి, ఆమె పరివారము తమ దేశానికి వెళ్లి పోయారు.
14 ప్రతి సంవత్సరం సొలొమోనుకు సుమారు ఒకవెయ్యి మూడు వందల ముప్పది రెండు మణుగుల బంగారం వచ్చేది.
15 ఇదిగాక తర్షీషునుండి వచ్చే ఓడలు బంగారం తెచ్చేవి. వ్యాపారస్తుల నుండి, అరబీ రాజులనుండి, మరియు రాజ్యంలో ఇతర ప్రాంతీయ పాలకుల నుండి కూడా రాజుకు బంగారం వచ్చేది.
16 రాజైన సొలొమోను పలకలుగా కొట్టబడిన బంగారంతో రెండు వందల పెద్ద తరహా డాళ్లను చేయించాడు. ప్రతిడాలు ఆరు వందల తులాల బంగారం కలిగి వుండేది.
17 అతడింకా మూడ వందల చిన్న తరహా డాళ్లను కూడా రేకులు గొట్టిన బంగారంతో చేయించాడు. ప్రతిడాలు నూట అరువది తులాల బంగారం కలిగివుంది. రాజు వాటిని “లెబానోను అరణ్యంలోని” విశ్రాంతి గృహములో ఉంచినాడు.
18 రాజైన సొలొమోను ఒక పెద్ద దంతపు సింహాసనాన్ని చేయించాడు. దానికి మేలిమి బంగారు పూత పూయించాడు.
19 సింహాసనం ముందు ఆరుమెట్లు వున్నాయి. ఈ సింహాసనపు వెనుక భాగం పైన గుండ్రంగా వుంది. సింహాసనానికి ఇరువైపులా చేతులు వుంచటానికి ఆధారపు కమ్ములు వున్నాయి. సింహాసనపు చేతులు గాక సింహాల విగ్రహాలు కూడ సింహాననానికి ఇరుపక్కల వున్నాయి.
20 ఆరు మెట్లలో ప్రతి మెట్టుకు రెండు పక్కలా రెండు సింహాల బొమ్మలను పెట్టారు. ఏ ఇతర రాజ్యంలోను ఈ రకంగా సింహాలంకరణ చేసి ఉండలేదు.
21 లెబానోను అరణ్యపు భవనంలో గిన్నెలు, పాన పాత్రలు, పనిముట్లు, ఆయుధాలు, అన్నీ శుద్ధ బంగారంతో చేయబడ్డాయి. భవనంలో ఏదీ వెండితో చేయబడలేదు. సొలొమోను కాలంలో బంగారం ఎంత విరివిగా లభించేదనగా ప్రజలు వెండిని విలువైన లోహంగా అసలు పరిగణించనేలేదు!
22 వ్యాపార నిమిత్తం ఇతర దేశాలకు పంపటానికి సొలొమోనుకు చాలా ఓడలున్నాయి. ప్రతి మూడు నెలలకూ ఓడలు తిరిగి వస్తూవుండేవి. ఆ ఓడల నిండా బంగారం, వెండి, దంతం, పశువులు రాజుకొరకు తేబడేవి.
23 ఈ భూమి మీద సొలొమోను మిక్కిలి ప్రఖ్యాతి గాంచిన రాజు. రాజులందరికంటె అతనికి ధనం, తెలివి తేటలు విశేషంగా ఉన్నాయి.
24 ప్రతి చోట ప్రజలు రాజైన సొలొమోనును చూడాలని ఆరాట పడేవారు. యెహోవా అతనికిచ్చిన మహా జ్ఞానాన్ని వారంతావిని తెలుసుకుని ఆనందించాలని కుతూహలపడేవారు.
25 ప్రతి సంవత్సరం రాజును చూడ్డానికి ప్రజలు వచ్చేవారు. వచ్చిన ప్రతివాడూ ఏదో ఒక కానుక పట్టుకు వచ్చేవాడు. వారు వెండి, బంగారు వస్తువులు, దుస్తులు, ఆయుధాలు, సుగంధ ద్రవ్యాలు, గుర్రాలు, కంచర గాడిదలు మొదలగు వాటిని తెచ్చేవారు.
26 కావున సొలొమోను అనేక రథములను, గుర్రములను కలిగియున్నాడు. అతనికి ఒక వెయ్యి నాలుగు వందల రథములు, పన్నెండు వేల గుర్రములు వున్నాయి. సొలొమోను ప్రత్యేక నగరాలను నిర్మించి ఈ రథాలన్నిటినీ వాటిలో వుంచాడు. కాని రాజైన సొలొమోను కొన్ని రథాలను తనతో యెరూషలేములో వుంచుకున్నాడు.
27 రాజు ఇశ్రాయేలును మిక్కిలి సంపన్న దేశంగా చేశాడు. యెరూషలేము నగరంలో వెండి రాతి గుట్టల్లా, దేవదారు చెక్కల్లా, కొండల్లో, కోనల్లో కాచే మేడి పండ్లలా అతి సామాన్యమై పోయింది.
28 ఈజిప్టు నుంచి, కూషునుంచి సొలొమోను గుర్రములను తెప్పించే వాడు. అతని వర్తకులు వాటిని కూయిలో కొన్ని ఇశ్రాయేలుకు తెచ్చేవారు.
29 ఈజిప్టు నుండి తెచ్చిన రథం ఒక్కటికి ఆరు వందల తులాల వెండి, గుర్రం ఒక్కటికి నూట ఏబది తులాల వెండి చొప్పున చెల్లించేవారు. సొలొమోను గుర్రాలను, రథాలను హిత్తీయుల రాజులకు మరియు అరాము రాజులకు అమ్మెడివాడు.