9
దేవుడు మరల సొలొమోను వద్దకు వచ్చుట
1 సొలొమోను యెహోవా దేవాలయాన్ని, తన రాజ భవనాన్ని నిర్మించటం పూర్తి చేశాడు. తాను నిర్మించదలచుకొన్నవన్నీ పూర్తి చేశాడు.
2 తరువాత యెహోవా సొలొమోనుకు పూర్వం గిబియోను పట్టణంలో ప్రత్యక్షమైనట్లు మళ్లీ కన్పించాడు.
3 యెహోవా అతనితో ఇలా అన్నాడు,
“నీ ప్రార్థన విన్నాను. నీవు నన్ను చేయమని అడిగిన విషయాలను కూడా విన్నాను. నీవు ఈ దేవాలయము కట్టించావు. నేను దానిని పవిత్రస్థలంగా చేశాను. కావున నేనక్కడ శాశ్వతంగా ఆరాధించబడతాను. నేను దానిని కనిపెట్టుకుని ఉండి ఎల్లప్పుడూ దానిని గూర్చి ఆలోచన చేస్తాను.
4 నీ తండ్రివలె నీవు సదా నన్ను ఆరాధిస్తూ వుండాలి. అతడు న్యాయవర్తనుడు; నిజాయితీపరుడు. నా న్యాయసూత్రాలను, నేను నిర్దేశించిన కట్టుబాట్లను నీవు పాటించాలి.
5 నీవు ఇవన్నీ పాటిస్తే, ఇశ్రాయేలు రాజు ఎల్లప్పుడూ నీ వంశంలో నుండి వచ్చేలా చేస్తాను. ఈ వాగ్దానం నేను నీ తండ్రి దావీదుకు చేశాను. ఇశ్రాయేలు ఎల్లప్పుడూ అతని సంతానంలోని వాడొకనిచే పరి పాలింపబడుతుందని నేనతనితో చెప్పాను.
6-7 “అయితే నీవు గాని, నీ సంతతి గాని నన్ను అనుసరించక పోయినా, నా న్యాయసూత్రాలను, నేను నిర్దేశించిన కట్టుబాట్లను పాటించకపోయినా, లేక మీరు ఇతర దేవుళ్లను సేవించి, ఆరాధించినా, నేను ఇచ్చిన రాజ్యంలో నుంచి ఇశ్రాయేలీయులు బయటికి పోయేలా ఒత్తిడి తెస్తాను. ఇశ్రాయేలీయులు నలుగురిలో నవ్వులపాలై, క్రమశిక్షణారాహిత్యంలో ఒక ఉదాహరణగా మిగిలి పోతారు. నేను ఈ దేవాలయాన్ని పవిత్రపరిచాను. ఇది ప్రజలు నన్ను గౌరవించే స్థలం. కాని మీరు నా ఆజ్ఞలను మన్నించకపోతే ఈ దేవాలయాన్ని నేలమట్టం చేస్తాను.
8 ఈ దేవాలయం సర్వనాశనం చేయబడుతుంది. ఇది చూచిన ప్రతివాడూ విస్మయము చెందుతాడు. వారంతా, ‘యెహోవా ఈ రాజ్యానికి, ఈ దేవాలయానికి ఈ భయంకర పరిస్థితిని ఎందుకు కల్పించాడు?’ అని అడుగుతారు.
9 మరికొందరు, ‘ఈ పరిణామం ఎందుకు వచ్చిందంటే ఆ ప్రజలు వారి యెహోవా దేవుని మర్చిపోయారు. వారి దేవుడు వారి పూర్వీకులను ఈజిప్టునుండి తీసుకుని వచ్చాడు. కాని వారు ఇతర దైవాలను సేవించటం మొదలు పెట్టారు’ అని సమాధానం చెపుతారు.”
10 ఇరవై సంవత్సరాల కాలవ్యవధిలో రాజైన సొలొమోను యెహోవా యొక్క దేవాలయాన్ని, తన రాజగృహాన్ని కట్టించాడు.
11 ఇరవై సంవత్సరాల తరువాత రాజైన సొలొమోను గలిలీయ దేశమందున్న ఇరవై పట్టణాలను తూరు రాజైన హీరాముకు ఇచ్చాడు. హీరాము రాజు ఆలయ నిర్ణాణంలోను, రాజ ప్రాసాద నిర్మాణంలోను సహాయపడి నందుకు, సొలొమోను ఈ పట్టణాలను ఇచ్చాడు. సొలొమోను కోరినంత దేవదారు కలపను, సరళ వృక్షాలను, బంగారాన్ని హీరాము ఇచ్చాడు.
12 కావున సొలొమోను ఇచ్చిన ఆ పట్టణాలను చూడటానికి తూరు నుండి హీరాము బయలుదేరి వెళ్లాడు. హీరాము ఆ పట్టణాలను చూచి తృప్తిపడలేదు.
13 “ఈ పనికిరాని పట్టణాలను నాకు ఎందుకిచ్చనట్లు సోదరా?” అని హీరాము రాజు అన్నాడు. హీరాము రాజు ఆ పట్టణ ప్రాంతాలకు కాబూల్ ప్రాంతమని పేరు పెట్టాడు. ఈ నాటికి ఆ ప్రాంతం కాబూల్ అని పిలవబడుతోంది.
14 హీరాము సుమారు రెండు వందల నలభై మణుగుల బంగారాన్ని రాజైన సొలొమోనుకు పంపాడు.
15 రాజైన సొలొమోను దేవాలయ నిర్మణానికి, రాజభవన నిర్మణానికి బానిసలను బలవంతంగా పని చేయించాడు. ఈ బానిసలను చాలా ఇతర కట్టడాల విషయంలో కూడ రాజైన సొలొమోను వినియోగించుకున్నాడు. అతడు మిల్లోను నిర్మించాడు. అతడింకా నగరానికి చుట్టూ ప్రాకారం కట్టించాడు. అతను హాసోరు, మెగిద్దో, మరియు గెజెరు నగరాలను కూడ పునర్మించాడు.
16 గతంలో ఈజిప్టు రాజు గెజెరు నగరంపై దండెత్తి దానిని తగులబెట్టాడు. అక్కడ నివసించే కనానీయులను చంపేశాడు. ఫరో కుమారైను సొలొమోను వివాహం చేసుకొన్నాడు. పెండ్లి కానుకగా ఫరో ఆ నగరాన్ని సొలొమోనుకు ఇచ్చాడు.
17 సొలొమోను ఆ నగరాన్ని తిరిగి నిర్మించాడు. సొలొమోను దిగువ బేత్ హోరోనును కూడ నిర్మించాడు.
18 రాజైన సొలొమోను బయతాతును, యూదయ అరణ్యములోనున్న తద్మోరు నగరాలను కూడా నిర్మించాడు.
19 రాజైన సొలొమోను ధాన్యాగారములు, తదితర వస్తువులు నిల్వచేయు గోదాములుండు నగరాలను కూడ కట్టించాడు. తన రథాలకు, గుర్రాలకు తగిన శాలలు కూడ నిర్మింపజేశాడు. యెరూషలేములోను, లెబానోను లోను, ఇంకా తాను రాజ్యం చేసిన ప్రాంతాలలోను సొలొమోను రాజు కావాలనుకున్న కట్టడాలను చాలా నిర్మించాడు.
20 ఇశ్రాయేలీయులు కానివారు రాజ్యంలో చాలా మంది వున్నారు. వారు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు.
21 ఇశ్రాయేలీయులు ఈ ప్రజలను నాశనం చేయలేక పోయారు. సొలొమోను వారిని బానిసలుగా పనిచేసేటందుకు బలవంతం చేశాడు. వారంతా ఈ నాటికీ బానిసలే.
22 కాని సొలొమోను ఇశ్రాయేలీయుల నెవ్వరినీ తన బానిసలు కమ్మని బలవంతం చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలు సైనికులుగాను, ప్రభుత్వ అధికారులుగాను, ఉద్యోగులుగాను, సైన్యాధిపతులు గాను, రథాధిపతులుగాను, రథసారథులుగాను పని చేశారు.
23 సొలొమోను చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించడానికి ఐదువందల ఏభై మంది అధికారులున్నారు. వారు పనివారి మీద అధికారులు.
24 ఫరో కుమారై దావీదు నగరం నుండి సొలొమోను ఆమెకు కట్టించిన భవనానికి వెళ్లింది. అప్పుడు సొలొమోను మిల్లోను నిర్మించాడు.
25 సంవత్సరానికి మూడుసార్లు సొలొమోను బలిపీఠం మీద దహన బలులు మరియు సమాధాన బలులు అర్పించాడు. ఈ బలిపీఠం సొలొమోను యెహోవా కొరకు నిర్మించింది. రాజైన సొలొమోను యెహోవా ముందు ధూపం వేసేవాడు. కావున దేవాలయ నిర్వహణకు కావలసిన వస్తువులన్నీ అతడు సరఫరా చేసేవాడు.
26 ఎసోన్గెబెరు వద్ద రాజైన సొలొమోను ఓడలను కూడ నిర్మించాడు. ఈ పట్టణం ఏలతు దగ్గర వుంది. ఇది ఎదోము రాజ్యంలో ఎర్ర సముద్రపు తీరాన వుంది.
27 రాజైన హీరాము వద్ద సముద్ర విషయాలలో ఆరితేరిన మనుష్యులు కొందరున్నారు. వీరు తరచు ఓడలలో ప్రయాణం చేసేవారు.సొలొమోను మనుష్యులతో కలిసి సొలొమోను ఓడలలో పని చేయటానికి హీరాము రాజు ఆ మనుష్యులను పంపాడు.
28 సొలొమోను ఓడలు ఓఫీరను స్థలానికి వెళ్లాయి. ఆ ఓడలు ఓఫీరు నుండి ఎనిమిది వందల నలభై మణుగుల బంగారాన్ని రాజైన సొలొమోనుకు తీసుకొని వచ్చాయి.