18
హిజ్కియా యూదాలో తన పరిపాలన ప్రారంభించుట
1 అహాజు కుమారుడైన హిజ్కియా యూదా రాజుగా వుండెను, ఏలా కుమారుడైన హోషేయా ఇశ్రాయేలు రాజుగా ఉన్న మూడవ సంవత్సరమున, హిజ్కియా తన పరిపాలన ప్రారంభించాడు.
2 పరిపాలన ప్రారంభించునాటికి అతను 25 యేండ్లు వాడు. యెరూషలేములో హిజ్కియా 29 యేండ్లు పాలించాడు. అతని తల్లి పేరు అబీ; ఆమె జెకర్యా కుమార్తె.
3 హిజ్కియా తన పూర్వికుడైన దావీదువలె, యెహోవా దృష్టికి మంచి పనులు చేసెను.
4 హిజ్కియా ఉన్నత స్థలాలను ధ్వంసం చేశాడు. అతను స్మారకశిలలను బద్ధలు చేశాడు; అషెరా స్తంభాలను పడగొట్టాడు. ఆ సమయంలో, ఇశ్రాయేలు ప్రజలు మోషే చేసిన ఇత్తడి సర్పానికి ధూపం వెలిగించేవారు. ఈ ఇత్తడి సర్పం “నెహుష్టాను” అని పిలవబడేది. హిజ్కియా ఈ ఇత్తడి సర్పాన్ని ముక్కలు చేశాడు. ఎందుకనగా ప్రజలు ఆ కంచు సర్పాన్ని పూజిస్తున్నారు కనుక.
5 హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను విశ్వసించాడు. యూదాలోని రాజులందరిలో అతనికి పూర్వంగాని, తర్వాతగాని హిజ్కియా వంటి వ్యక్తిలేడు.
6 యెహోవా పట్ల హిజ్కియా అతి విధేయుడు. యెహోవాను అనుసరించడం అతను మానలేదు. మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అతను పాటించాడు.
7 యెహోవా హిజ్కియా పక్షంగా వున్నాడు. అతను చేసిన ప్రతి విషయంలోను హిజ్కియా కృతార్థుడయ్యాడు.
హిజ్కియా అష్షూరు రాజు పరిపాలన నుండి తప్పుకున్నాడు. అష్షూరు రాజుని కలవడం హిజ్కియా మాని వేశాడు.
8 హిజ్కియా గాజాకి వెళ్లేదారి అంతటను ఆ చుట్టుప్రక్కల ప్రదేశంలోగల ఫిలిష్తీయులందరినీ ఓడించాడు. చిన్న పట్టణం మొదలుకొని పెద్ద నగరందాకా గల అన్ని ఫిలిష్తీయుల నగరాలను అతను ఓడించాడు.
అష్షూరువారు షోమ్రోనుని పట్టుకొనుట
9 అష్షూరు రాజైన షల్మనేసెరు షోమ్రోనుకి విరుద్ధంగా యుద్ధం చేయడానికి వెళ్లాడు. అతని సైన్యము నగరాన్ని చుట్టుముట్టింది. హిజ్కియా యూదా రాజుగా ఉన్న నాల్గవ సంవత్సరంలో ఇది జరిగింది. (ఏలా కుమారుడైన హోషేయా ఇశ్రాయేలు రాజుగా ఉన్న ఏడవ సంవత్సరములో ఇది జరిగింది).
10 మూడవ సంవత్సరము చివరను షల్మనేసెరు షోమ్రోనుని పట్టుకున్నాడు. హిజ్కియా యూదా రాజుగా ఉన్న ఆరవ సంవత్సరమున, అతను షోమ్రోనుని వశము చేసుకున్నాడు. (ఇశ్రాయేలు రాజుగా హోషేయా వున్న తొమ్మిదో సంవత్సరమున ఇది జరిగింది).
11 అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని బందీలుగా అష్షూరుకు తీసుకుని వెళ్లాడు. వారిని హాలహు లేక హాబోరు (గోజాను నది), మాదీయుల నగరాలలో నివసింపజేశాడు.
12 ఇశ్రాయేలువారు తమ దేవుడైన యెహోవాను పాటించక పోవడంవల్ల ఇలా జరిగింది. వారు యెహోవా ఒడంబడికను విచ్ఛిన్నం చేశారు. యెహోవా సేవకుడైన మోషే చెప్పిన అన్ని విషయాలను వారు పాటించలేదు. యెహోవా ఒడంబడికను ఇశ్రాయేలు ప్రజలు పెడ చెవిని పెట్టారు. లేక చేయమని చెప్పిన పనులు వారు చేయలేదు.
అష్షూరు యూదాని తీసుకొనుటకు సిద్ధపడుట
13 హిజ్కియా రాజుగా వున్న 14వ సంవత్సరమలో అష్షూరు రాజయిన సన్హెరీబు యూదాలోని అన్ని బలిష్ఠ నగరాల మీద దండెత్తి వెళ్లాడు. సన్హెరీబు ఆ నగరాలన్నిటిని ఓడించాడు.
14 అప్పుడు యూదా రాజయిన హిజ్కియా అష్షూరు రాజుకి లాకీషు వద్ద ఒక సందేశం పంపాడు. “నేను తప్పు చేశాను. నన్ను వంటరిగా వదలండి. అప్పుడు మీరు ఏమి కోరినా అది నేనిస్తాను” అని హిజ్కియా చెప్పాడు.
తర్వాత అష్షూరు రాజు యూదా రాజయిన హిజ్కియాని 11 టన్నుల వెండి, 1 టన్ను బంగారం ఇమ్మని అడిగాడు.
15 హిజ్కియా యెహోవా ఆలయం నుండి రాజుగారి నిధుల నుంచీ వెండి అంతా తీసి ఇచ్చాడు.
16 ఆ సమయంలో హిజ్కియా యెహోవా మందిరానికి ద్వారము మెట్లకి గల బంగారమంతా తీయించి వేశాడు. హిజ్కియా రాజు ఆ తలుపుల మీద మెట్లమీద బంగారం ఉంచాడు. హిజ్కియా అష్షూరు రాజుకు ఈ బంగారమంతా ఇచ్చివేశాడు.
అష్షూరు రాజు యెరూషలేముకు మనుష్యులను పంపుట
17 అష్షూరు రాజు అతి ముఖ్యులైన తర్తానును, రబ్బారీసు రబ్బాకేనును అను తన ముగ్గురు సైన్యాధిపతులను, పెద్దసైన్యముతో యెరూషలేములోని హిల్కీయా రాజు వద్దకు పంపాడు. ఆ మనుష్యులు లాకీషు నుంచి యెరూషలేము వెళ్లారు. వారు చేరి “చాకిరేవు” వెళ్లే దారిలోవున్న యెరక కొలను కాలువ దగ్గర నిలబడ్డారు.
18 వారు రాజుని పిలిచారు. హిజ్కియా కుమారుడైన ఎల్యాకీము (ఎల్యాకీము రాజభవన అధికారి), షెబ్నా (కార్యదర్శి), అసాపు కొడుకైన యోవాహును (దస్తావేజులు సంరక్షించేవాడు) వారిని కలుసు కోడానికి వచ్చారు.
19 ఒక సైన్యాధిపతి ఇలా చెప్పాడు, “అష్షూరు మహా రాజు చెప్పుచున్నది:
‘హిజ్కియాతో చెప్పు. నీవు దేనిని విశ్వసిస్తున్నావు?
20 నీ మాటలు విలువలేనివి. యుద్ధంలో “నాకు సహాయంగా వుండదగినంత. సలహా, శక్తివున్నాయి” అని నీవు చెప్పు చున్నావు. కాని నీవు నా పరిపాలన నుండి వేరుపడిన తర్వాత నీవెవరిని నమ్ముతున్నావు?
21 విరిగిపోయిన రెల్లుతో చేయబడిన చేతికర్రను ఊని ఉన్నావు! ఈ చేతికర్ర ఈజిప్టు. ఈ చేతికర్రను ఊని నడిస్తే అది విరిగిపోయి, చేతిలో గుచ్చుకొని గాయపరుస్తుంది. తనను విశ్వసించే వారికందరికీ ఈజిప్టు రాజు అటు వంటివాడు.
22 “మీ దేవుడైన యెహోవాని నమ్ముతున్నట్లు” నీవు చెప్పువచ్చు. కాని ఉన్నత స్థలాలను బలిపీఠాలను హిజ్కియా తొలగించి యెరూషలేములోని బలిపీఠం ఎదురుగా మాత్రమే ఆరాధించాలని యూదా, యెరూషలేము ప్రజలకు చెప్పినట్లు నాకు తెలుసు.
23 ‘నా యాజమాని అయిన అష్షూరు రాజుతో ఇప్పుడు నీవు ఈ ఒడంబడిక చేసుకో. స్వారీ చేయగల మనుష్యులుంటే, నీకు రెండు వేలు గుర్రాలు ఇస్తానని నేను వాగ్గానం చేస్తాను.
24 నా యజమానికి గల చాలా తక్కువ అధిపతిని కూడా నీవు ఓడించలేవు. రథాలకు, అశ్విక వీరులకు నీవు ఈజిప్టు మీద ఆధారపడి వున్నావు.
25 ‘యెహోవా ఆజ్ఞ లేకుండ యెరూషలేమును నాశనం చేయుటకు నేను రాలేదు. “ఈ దేశానికి విరుద్ధంగా వెళ్లి దానిని నాశనము చేయుము” అని యెహోవా నాకు చెప్పాడు.’ ””
26 అప్పుడు హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నా యెవాహు ఆ సైన్యాధిపతితో, “దయచేసి మాతో సిరియా బాషలో మాట్లాడండి. ఆ బాషను మేము అర్థం చేసుకుంటాము. యూదా భాషలో మాతో సంభాషించవద్దు. ఎందుకంటే, గోడమీద ఉన్న వారు ఈ మాటలు వింటారు.” అని చెప్పారు.
27 కాని రబ్షాకే వారితోను ఇట్లనెను: “నా యాజమాని నీతోను నీతోను మీ రాజుతోను మాత్రమే మాటలాడుటకు నన్ను పంపలేదు. గోడమీద కూర్చున్న వారితో కూడా మాటలాడెదను. వారు నీతోపాటు తమ మలమూత్ర ములను సేవిస్తారు.”
28 తర్వాత యూదా భాషలో సిరియా సైన్యాధిపతి బిగ్గరగా అరిచాడు. “అష్షూరు మహారాజు పంపిన ఈ సందేశం వినండి.
29 హిజ్కియా మిమ్మును మోసము చేయడానికి సమ్మతింపకుడి. నా అధికారం నుండి అతను మిమ్మును కాపాడలేడు.
30 యెహోవాను మీరు నమ్మునట్లుగా హిజ్కియాని సేవించవద్దు. యెహోవా మనల్ని కాపాడును, అష్షూరు రాజు ఈ నగరాన్ని ఓడించలేడు” అని హిజ్కియా చెప్పాడు.
31 కాని హిజ్కియా మాటలు వినవద్దు. “అష్షూరు రాజు ఇది చెప్పుచున్నాడు:
‘నాతో సంధి చేసుకోండి. నా దగ్గరికి రండి. అప్పుడు ఒక్కొక్కరు తన సొంత ద్రాక్షలు, తన సొంత అరటి పండ్లు తినివచ్చు, తన సొంత బావినుండి నీరు త్రాగవచ్చు.
32 నేను వచ్చి మిమ్మును దూరంగా మీ సొంత ప్రదేశము వలె ఒక పచ్చిక ప్రదేశానికి తీసుకు వెళ్లేంత వరకు మీరిది చేయవచ్చు. అది ధాన్య్యాంగల ప్రదేశము. కొత్త ద్రాక్షారసం గలది. ద్రాక్షా పొలాలు, రొట్టె గలది. ఒలీవ తేనెగల ప్రదేశమది. అప్పుడు మీరు బ్రతుకవచ్చు; చనిపోరు. కాని హిజ్కియా మాటలు వినకుడి. అతను మీ బుద్ధ మార్చాలని ప్రయత్నిస్తున్నాడు. యెహోవా మనలను కాపాడ్తాడు. అని అతను చెప్పుచున్నాడు.
33 అష్షూరు రాజునుండి ఇతర దేశాల దేవత లెవరైనా అతని దేశాన్ని రక్షించారా? లేదు.
34 హమాతు, అర్పాదు దేవుళ్లు ఎక్కడున్నారు? సెపర్వాయీము, హేన, ఇవ్వా దేవుళ్లెక్కడున్నారు? నానుండి వారు షోమ్రోనును కాపాడగలిగినారా? లేదు.
35 ఇతర దేశాలలో వున్న ఏ దేవుళ్ళయినా నానుండి తమ భూమిని కాపాడుతారా? లేదు. యెరూషలేముని యెహోవా నానుండి కాపాడుతాడా? లేదు’ ”
36 కాని ప్రజలు మౌనం వహించారు. వారు ఆ సైన్యాధిపతితో ఒక్కమాట కూడా చెప్పలేదు. కారణం, హిజ్కియా రాజు, “అతనితో ఏమీ మాటలాడ వద్దు” అని వారికి ఆజ్ఞాపించాడు.
37 హిల్కీయా కొడుకైన ఎల్యాకీము (ఎల్యాకీము రాజభవనం అధికారి), షెబ్నా (కార్యదర్శి), ఆసాపు కొడుకైన యెవాహు (దస్తావేజుల సంరక్షకుడు) హిజ్కియా వద్దకు వచ్చారు. తాము తలక్రిందులై నామని తెలపడానికై వారి వస్త్రాలు చింపివేయబడ్డవి. అష్షూరు సైన్యాధిపతి చెప్పిన విషయాలను వారు హిజ్కియాకు చెప్పారు.