19
దావీదు మనుష్యులను అమ్మోనీయులు అవమాన పరచటం
అమ్మోనీయుల రాజు పేరు నాహాషు. నాహాషు చనిపోగా అతని కుమారుడు నూతన రాజయ్యాడు. ఇది విన్న దావీదు, “నాహాషు నాపట్ల చాలా దయతో వున్నాడు. నేను కూడ నాహాషు కుమారుడు హానూను పట్ల దయగలిగి వుంటాను” అని అన్నాడు. కావున తన తండ్రి చనిపోయిన సందర్భంగా హనూనును పలకరించే నిమిత్తం దావీదు తన మనుష్యులను పంపాడు. హానూనును ఓదార్చటానికి దావీదు దూతలు మోయాబు దేశానికి వెళ్లారు.
అమ్మోనీయుల పెద్దలు హానూనుతో ఇలా అన్నారు: “నీవు మోసంలో పడవద్దు. దావీదు నిజంగా నిన్ను ఓదార్చటానికి గాని, చనిపోయిన నీ తండ్రి పట్ల గౌరవభావంతో గాని తన మనుష్యులను పంపలేదు! దావీదు తన మనుష్యులను కేవలం నీమీద, నీ రాజ్యం మీద నిఘావేసి రహస్యాలను సేకరించటానికే పంపాడు. నిజానికి దావీదు నీ రాజ్యాన్ని నాశనం చేయ సంకల్పించాడు.” దానితో దావీదు మనుష్యులను హానూను బంధించి వారి గడ్డాలు* గొరిగించాడు. తొడల దగ్గర వారి బట్టలు కూడ హానూను కత్తిరించాడు. తరువాత వారిని పంపివేశాడు.
దావీదు మనుష్యులు ఆ పరిస్థితిలో ఇంటికి వెళ్లటానికి సిగ్గుతో చాలా బాధపడ్డారు. అది చూసిన కొంత మంది మనుష్యులు దావీదు వద్దకు వెళ్లి అతని మనుష్యులకు జరిగిన అవమానాన్ని తెలియజేశారు. అది విన్న దావీదు తన మనుష్యులకు ఇలా కబురు పంపాడు: “మీ గడ్డాలు పెరిగే వరకు మీరు యెరికో పట్టణంలో వుండండి. తరువాత మీరు ఇండ్లకు తిరిగిరండి.”
ఇది జరిగిన పిమ్మట అమ్మోనీయులు తాము దావీదుకు బద్ధశత్రువులైనట్లు గుర్తించారు. దానితో హానూను, అమ్మోనీయులు డెబ్బై ఐదువేల పౌనుల (రెండువేల మణుగులు) వెండిని వెచ్చించి మెసపొతేమియా (అరామ్నహరయీము) నుండి రథాలను, రథసారధులను కొన్నారు. వారింకా అరాములోని మయకా, సోబా నగరాల నుండి కూడ రథాలను, వాటిని తోలే వారిని సేకరించారు. అమ్మోనీయులు ముప్పది రెండువేల రథాలను కొన్నారు. వారు మయకా రాజుకు, అతని సైన్యానికి కొంత సొమ్ము చెల్లించి వారి సహాయాన్ని కూడ అర్థించారు. మయకా రాజు, అతని సైనికులు వచ్చి మెదెబా పట్టణం వద్ద గుడారాలు వేశారు. అమ్మోనీయులు తమ పట్టణాల నుండి బయటకు వచ్చి యుద్ధానికి సిద్ధమయ్యారు.
అమ్మోనీయులు యుద్ధానికి సిద్ధమవుతున్నారని దావీదు విన్నాడు. అతను యోవాబను, ఇశ్రాయేలు సైన్యాన్నంతటినీ అమ్మోనీయులను ఎదుర్కోటానికి పంపాడు. అమ్మోనీయులంతా బహిరంగంగా వచ్చి యుద్ధానికి సిద్ధంగా వున్నారు. వారు నగర ద్వారం వద్ద వున్నారు. వారికి సహాయంగా వచ్చిన రాజులు వారి సేవలతో బయట పొలాలలో దిగియుండిరి.
10 తనపై యుద్ధం చేయటానికి రెండు సైనిక కూటాలవారు సిద్ధంగా వున్నట్లు యోవాబు చూశాడు. ఒక వర్గం తనముందు, రెండవ వర్గం తన వెనుక వున్నాయి. అప్పుడు యోవాబు ఇశ్రాయేలు సైన్యంలో కాకలు తీరిన వారిని కొంతమందిని ఎంపిక చేశాడు. వారిని అరాము సైన్యంతో పోరాడటానికి పంపాడు. 11 యోవాబు మిగిలిన ఇశ్రాయేలు సైన్యాన్ని అబీషై అధీనంలో వుంచాడు. యోవాబు సోదరుడే అబీషై. ఆ సైనికులు అమ్మోనీయుల సైన్యంతో యుద్ధం చేయటానికి వెళ్లారు. 12 అబీషైతో యోవాబు ఇలా అన్నాడు: “అరాము సైన్యం గనుక నామీద పైచేయిగా వుంటే నీవు నాకు సహాయంగా రావాలి. ఒకవేళ అమ్మోనీయుల సైనికులు గనుక నీ శక్తికి మించివుంటే నేను నీకు సహాయంగా వస్తాను. 13 మన ప్రజల కొరకు, మన దేవుని నగరాల కొరకు పోరాడే ఈ తరుణంలో మనం చాలా ధైర్యంగా వుండాలి! యెహోవా ఏది మంచిదని తలుస్తాడో దానిని ఆయన చేయుగాక!”
14 యోవాబు, అతని సైనికులు కలిసి అరాము నుండి వచ్చిన సైన్యాన్ని ఎదుర్కొన్నారు. అరాము సైన్యం యోవాబు సైనికుల ధాటికి తట్టుకోలేక పారిపోయింది. 15 అరాము సైన్యం పారిపోవటం అమ్మోను సైనికులు చూసి, వారు కూడ పారిపోయారు. వారు అబీషైకి, అతని సైన్యానికి జడిసి పారిపోయారు. అమ్మోనీయులు తమ నగరంలోకి వెళ్లిపోయారు. యోవాబు యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.
16 ఇశ్రాయేలు తమను ఓడించినట్లు అరాము నాయకులు అర్థం చేసుకున్నారు. యూఫ్రటీసు నదికి తూర్పున నివసిస్తున్న అరామీయులను సహాయంగా రమ్మని వారు కబురు పంపారు. అరాముకు చెందిన హదదెజెరు సైన్యానికి షోపకు అధిపతి. అరాములో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన సైన్యాలను కూడ షోపకు నడిపించాడు.
17 అరాము ప్రజలు యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త దావీదు విన్నాడు. అందువల్ల దావీదు ఇశ్రాయేలు ప్రజలందరినీ సమీకరించాడు. దావీదు వారిని యోర్దాను నదిని దాటించాడు. వారు అరామీయులకు ఎదురుపడి నిలబడ్డారు. దావీదు తన సైన్యాన్ని యుద్ధానికి సమాయత్తపరచి అరామీయులతో తలపడ్డాడు. 18 ఇశ్రాయేలీయుల నుండి అరామీయులు పారిపోయారు. దావీదు, అతని సైనికులు కలిసి ఏడువేల మంది అరాము రథసారధులను, నలుబదివేల మంది అరాము సైనికులను చంపివేశారు.
19 ఇశ్రాయేలీయులు తమను ఓడించారని హదదెజెరు సైన్యాధికారులు తెలుసుకొని, దావీదుతో సంధి చేసుకొన్నారు. వారు దావీదుకు సేవకులయ్యారు. అటు తరువాత అరామీయులు ఎన్నడూ అమ్మోనీయులకు సహాయం చేయలేదు.
* 19:4 దావీదు … గడ్డాలు ఇశ్రాయేలీయులు తమ గడ్డాలు గొరిగించుకోవటం మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధం. 19:6 డె బ్బై ఐదువేల పౌనులు మూడువేల మూడువందల అరవై కిలోగ్రాములు.